Home / తెలుగు / రైల్వే క్రాసింగ్‌ల వద్ద చిన్న మార్పుతో పెద్ద రక్షణ!
design

రైల్వే క్రాసింగ్‌ల వద్ద చిన్న మార్పుతో పెద్ద రక్షణ!

ప్రభుత్వాల అలసత్వం.. వాహనదారుల నిర్లక్ష్యం, తొందరపాటు కారణంగా ప్రతిఏటా కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. 2001 నుంచి డిసెంబర్ 2013 వరకు మొత్తం కాపలాలేని రైల్వేక్రాసింగ్‌ల వద్ద జరిగిన ప్రమాదాల్లో 870 మంది మృతి చెందితే.. ఇందులో ఏప్రిల్ 2013 నుంచి డిసెంబర్ 2013 మధ్యకాలంలోనే 66 మంది దుర్మరణం పాలయ్యారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఏర్పాటు చేసే హెచ్చరిక బోర్డులు, సంకేతాలు ఇవేవీ ఎలాంటి ప్రయోజనాన్నివ్వ లేదు.

కానీ రైల్వే క్రాసింగ్‌ల వద్ద స్పీడ్ బ్రేకర్ల నిర్మాణంలో కొద్దిపాటి మార్పులు చేస్తే ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని మానవప్రవర్తనను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రతి రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలకు ఇరువైపులా పది మీటర్ల దూరంలో అప్రోచ్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లను నిర్మిస్తున్నారు. కానీ వీటిని రోడ్డుకు కచ్చితంగా లంబకోణంలో నిర్మిస్తున్నారు.

ఫలితంగా వీటి మీదుగా ప్రయాణించే వాహనాల ముందు, వెనుక టైర్లు ఒకే సారి స్పీడ్‌బ్రేకర్లపైకి ఎక్కి దిగుతాయి. అలాంటి పరిస్థితుల్లో వాహనవేగం తగ్గించకపోయినా వాహనంలో ప్రయాణిస్తున్నవారు పెద్దగా కుదుపులకు గురికారు. దీనివల్ల రెండు నష్టాలున్నాయి. ఆ సమయంలో వాహన డ్రైవర్ వేగాన్ని తగ్గించకపోతే.. అక్కడినుంచి పట్టాలవరకు ఉన్న 10 మీటర్ల దూరాన్ని కేవలం 12సెకన్ల వ్యవధిలోనే అధిగమిస్తాడు. ఈ 12 సెకన్ల వ్యవధిలో పట్టాలకు ఇరువైపులా చూసి రైలు రాకను నిర్ధారించుకోవడం సాధ్యం కాదు. ఇంజినీర్ల సూచనల ప్రకారం.. స్పీడ్ బ్రేకర్లను రోడ్డుపై సరిగ్గా అడ్డంగా కాకుండా కొంత కోణం చేస్తూ నిర్మిస్తే.. ప్రమాదాలు తగ్గే అవకాశాలున్నాయి. 

రోడ్డు దిశకు 45 డిగ్రీల కోణంతో స్పీడ్‌బ్రేకర్ నిర్మిస్తే.. వాహనం స్పీడ్ బ్రేకర్ దాటే సమయంలో ముందు రెండు టైర్లు.. ఒక్కోటి ఒక్కోసారి బ్రేకర్ ఎక్కి దిగుతాయి. ఫలితంగా వాహనం కుడి, ఎడమలకు విపరీతమైన కుదుపులకు గురవుతుంది. ఒక వేళ డ్రైవర్ అప్పటివరకు వేగం తగ్గించకపోయినా ఆ కుదుపులకైనా జడిసి కచ్చితంగా వాహనవేగాన్ని పూర్తిగా నియంత్రిస్తాడు. వేగం తగ్గిన వాహనం మళ్లీ పుంజుకుని పదిమీటర్ల దూరంలోని పట్టాల వద్దకు చేరాలంటే కనీసం 16 సెకన్లు పడుతుంది. డ్రైవర్‌కు అదనంగా 4 సెకన్ల సమయం లభిస్తుంది. చాలా ప్రమాదాలు వెంట్రుకవాసిలోనే తప్పిపోతాయి. అలాంటిది ఈ నాలుగు సెకన్ల సమయాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ రకం స్పీడ్‌బ్రేకర్లను ఆడ్‌బాల్ స్పీడ్‌బ్రేకర్లుగా పిలుస్తున్నారు. కేరళకు చెందిన బిజు డొమినిక్ అనే ఇంజినీరింగ్ నిపుణుడు వీటికి డిజైన్ చేశారు.

లెవల్ క్రాసింగ్‌లు.. ప్రమాదాలు ఎప్పుడెన్ని?

2011-12 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 32735 లెవల్‌క్రాసింగ్‌లున్నాయి. వీటిలో 14900 లెవల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా లేదు. కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద జరిగిన ప్రమాదాల్లో 2011-12 మధ్యకాలంలో 229 మంది, 2011-12 మధ్య కాలంలో 95 మంది దుర్మరణం పాలయ్యారు. ఏప్రిల్ 2013- డిసెంబర్ 2013 మధ్యకాలంలోనే 66 మంది మృతిచెందారు. 2011-12 మధ్యకాలంలో కొన్ని లెవల్ క్రాసింగ్‌లను విలీనం చేయడం, లేదా ఎత్తివేయడం వల్ల వాటిసంఖ్య 31846కు తగ్గిపోయింది. ఇందులో కాపలా లేనివి 13, 350. అంటే ఏడాదికాలంలో ఇన్ని వందలమంది బలైనా కేంద్రం కేవలం 1500 లెవల్‌క్రాసింగ్‌ల వద్దనే భద్రత కల్పించగలిగింది. 2013 ఆగస్టు నాటికి కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల సంఖ్య 12650కి తగ్గిపోయినట్టు గత రైల్వేమంత్రి ఖర్గే లోక్‌సభకు తెలిపారు.

అప్రమత్తత అత్యవసరం

లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఎంత అత్యాధునిక టెక్నాలజీ ప్రవేశపెట్టినా, ఎన్ని హెచ్చరిక బోర్డులు పెట్టినా.. ప్రయాణికులు, వాహనచోదకులు అప్రమత్తంగా లేకపోతే అవన్నీ నిష్ఫలమే. లెవల్‌క్రాసింగ్ దాటేప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి.
1. రైల్వే క్రాసింగ్‌ల వద్ద మూసిఉన్న గేట్ల కిందుగా ఎప్పుడూ దూరిపోవద్దు.
2. కాపలాలేని క్రాసింగ్‌ల వద్ద రైలు వస్తున్నదీ, లేనిదీ పరిశీలించాలి.
3. క్రాసింగ్‌ల వద్ద పట్టాలు దాటేప్పుడు ఎప్పుడు కూడా మధ్యలో నిలిచిపోవద్దు.
4. లెవల్ క్రాసింగ్‌ల వద్ద వాహనవేగాన్ని తగ్గించాలి. గేట్లు దాటేప్పుడు సెల్‌ఫోన్ వినియోగించొద్దు.
5. మీరు ప్రతిరోజూ పట్టాలు దాటాల్సి వస్తే.. రైళ్ల సమయపాలనపై అవగాహన పెంచుకోండి.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,313 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>