Home / తెలుగు / హైదరాబాద్ కబ్జాకు కోరలు సాచిన మోడీ సర్కారు!

హైదరాబాద్ కబ్జాకు కోరలు సాచిన మోడీ సర్కారు!

తెలంగాణ రాష్ట్ర నవోదయంపై ఆరంభంలోనే చీకట్లు కమ్మే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం నిర్లజ్జగా తెరతీసింది. సీమాంధ్ర బాబుల ఒత్తిళ్లకు తలొంచి.. ప్రజాస్వామ్య స్ఫూర్తినే పాతరేసింది. రాష్ట్ర వ్యవహారాల్లో, ఉభయ కమిషనరేట్లతోపాటు రంగారెడ్డి జిల్లా శాంతి భద్రతల వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం 13 అంశాలతో లేఖ రాసింది. రాష్ట్ర వ్యవహారాల్లో గవర్నర్ ఆదేశాలను పాటించాలని అందులో పేర్కొన్నారు. బలగాల మోహరింపు వంటి అంశాల్లో గవర్నర్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. తద్వారా తెలంగాణ ప్రజలను, ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దారుణంగా అవమానిస్తూ తెలంగాణ సర్కారుపై సూపర్ ప్రభుత్వాన్ని రుద్దే చర్యలకు సాహసించింది. 

హైదరాబాద్ కబ్జాకు కోరలు సాచింది. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన సీఎం కే చంద్రశేఖర్రావు.. మోడీ సర్కారుది ఫాసిస్టు చర్యగా అభివర్ణించారు. కేంద్రం లేఖను పరిగణనలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యానికి పాతరేసే విధంగా ఉన్న ఈ లేఖకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామని ప్రకటించారు. వివిధ విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా కేంద్రం చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.

ఒకప్పుడు భాగ్యశాలి అయిన తెలంగాణ రక్తమాంసాలను అరవై ఏండ్ల ఉమ్మడి పాలనలో పీల్చిపిప్చిన చేసిన వలస పాలకులు.. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడటాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణలో వలస పాలన దోపిడీ చిహ్నాలను ప్రభుత్వం బద్దలు చేస్తుండటంతో అక్రమ సౌధాలు కుప్పకూలుతున్నాయి. ఒక్కొక్కరంగంపై శ్రద్ధ పెట్టి.. లోతుల్లోకి వెళ్లి చేస్తున్న పరిశీలనల్లో నాటి ప్రభుత్వాల అక్రమాలు బయటపడుతున్నాయి. దీంతో సీమాంధ్ర నేతలు కంగారెత్తిపోయారు. నగరంలో సీమాంధ్రులపై ఒక్క దాడి కూడా జరుగకున్నా.. సీమాంధ్రుల రక్షణ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు.

నిజానికి ఈ ప్రమాదాన్ని వారు ముందే ఊహించి తెలంగాణ రాష్ర్టాన్ని అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. అయినా రాష్ట్రం అవతరించడంతో ఇప్పుడు తమ అక్రమాలు బయటికి రాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కలిసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

రాజ్యసభలో తెలంగాణ బిల్లును వెంకయ్య అడ్డుకున్నప్పుడే ఆయన అసలు స్వరూపం బయటపడిందని అప్పట్లోనే తెలంగాణవాదులు ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కూడా కుట్రలను ఆపని సీమాంధ్ర నేతలు.. ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వివాదాస్పద లేఖ రాయించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ర్టాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం.. పరిస్థితిని మరింత జటిలం చేసే దిశగా రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఏ రాష్ర్టానికీ లేని ప్రత్యేక పరిస్థితులను తెలంగాణపై రుద్దేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నిస్తున్నదని పలువురు తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై సూపర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తెగేసి చెబుతున్నారు.

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ ఐదు ప్రకారం పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్ నగర ప్రజల రక్షణ పేరుతో ఇదే చట్టంలోని 8వ సెక్షన్‌లో గవర్నర్‌కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. దానిని ఆధారం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కొన్ని చర్యలను సహించలేని ఆంధ్ర నేతలతో కుమ్మక్కయి.. తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు వీలు కల్పించేలా కొన్ని సూచనలు సలహాలు చేస్తూ శుక్రవారం రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఒక లేఖ పంపింది. ఇందులో 8వ సెక్షన్‌లో గవర్నర్‌కు ఇచ్చిన బాధ్యతలను విస్తరించి చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి ఎస్ సురేశ్ కుమార్ పంపిన లేఖలో అంశాలు ఇలా ఉన్నాయి.
(ఏ) పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం.. రాష్ట్ర మంత్రి మండలి లేదా ఏదేని సంస్థ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఏదైనా రికార్డులు లేదా సమాచారాన్ని తెప్పించుకునే అధికారాన్ని గవర్నర్ కలిగి ఉంటారు. 
(బీ) హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతోపాటు రంగారెడ్డి జిల్లా ఎస్పీ సమయానుగుణంగా గవర్నర్‌కు నివేదికలు సమర్పించాలి. ప్రత్యేకించి ఉమ్మడి రాజధానిలో జరిగే తీవ్ర నేరాలపై ప్రత్యేక నివేదికలు ఇవ్వాలి. 
(సీ) చట్టంలోని నియమ నిబంధనలకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.
(డీ) కేంద్ర ప్రభుత్వం నియమించిన సలహాదారులు గవర్నర్‌కు సహకరిస్తారు. వివిధ సమయాలను బట్టి సదరు సలహాదారులకు గవర్నర్ బాధ్యతలు కేటాయిస్తారు.
(ఈ)హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లతోపాటు రంగారెడ్డి జిల్లాలోని కీలక వ్యవస్థలు, భవనాల విషయంలో శాంతి భద్రతలు, అంతర్గత భద్రత వంటి విషయాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన అన్ని అంశాలను రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి గవర్నర్‌కు వివరించాలి. వాటిపై గవర్నర్ తన అభిప్రాయాలను నిర్దిష్ట సంస్థలకు తెలియజేయవచ్చు. గవర్నర్ సలహాను పాటించాల్సి ఉంటుంది. 
(ఎఫ్) తీవ్రమైన నేరాలు, బలవంతపు వసూళ్లు లేదా అటువంటి పెద్ద నేరాలపై ఉభయ కమిషనరేట్లలోనూ, రంగారెడ్డి జిల్లాలోనూ ఇన్‌స్పెక్టర్ జనరల్ ర్యాంకుకు తక్కువకాని అధికారితో మూడు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, సత్వర విచారణకు వీలు కల్పించాలి.
(జీ) కీలకమైన సంస్థల భద్రత, ఆంతరంగిక భద్రతను పర్యవేక్షించేందుకు రెండు కమిషనరేట్లు, రంగారెడ్డి ఎస్పీ ఆఫీసులలో సీనియర్ అధికారులతో స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలి. ఈ స్పెషల్ సెల్ నగరంలో కీలకమైన సున్నితమైన సంస్థలను గుర్తించి అక్కడ భద్రతా ఏర్పాట్లు చాలినంతగా ఉన్నాయా లేదా భద్రత పెంచవలసిన అవసరం ఉందా అన్న అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు నివేదించాలి. ప్రత్యేకంగా గుర్తించిన సంస్థలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంకోసం ఎస్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌లు ఇప్పుడు కల్పిస్తున్న భద్రతను సమీక్షించి, అదనపు భద్రతా చర్యలను సూచించాలి. తనకు అందిన సమాచారం ప్రాతిపదికగా భద్రత పెంచవలసి వచ్చినా, ఏదైనా ముప్పు ఉందని తెలిసి ఆదేశించినా గవర్నర్ సూచనలను అమలు చేసితీరాలి. ప్రత్యేకంగా గుర్తించిన సంస్థల్లో మేనేజ్‌మెంట్ కేడర్‌లోని ఒక సీనియర్ అధికారిని స్పెషల్ సెల్‌తో సమన్వయంకోసం నియమించాలి. ఆ అధికారి ఎప్పటికప్పుడు సంస్థ భద్రతకు సంబంధించిన సమీక్షా నివేదికలను పంపడంతోపాటు స్పెషల్ సెల్ సిఫారసులను అమలు చేయాలి.
(హెచ్) ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతభద్రతల నిర్వహణ అవసరం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్‌లతో కలిపి ప్రత్యేకంగా ఒక పోలీసు సర్వీసు బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ సర్వీసు బోర్డు డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓల బదిలీలు, పోస్టింగుల వ్యవహారాన్ని చూడాలి. గవర్నర్ తన విజ్ఞత మేరకు సూచనలు, మార్పులు ఆమోదించే అధికారాన్ని కలిగి ఉంటారు.
(ఐ) ఒక వేళ గవర్నర్ తన విజ్ఞత ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో తప్పనిసరి అని భావిస్తే అదనపు బలగాలను మోహరించే విషయం పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి గవర్నర్‌కు తన నిర్ణయాన్ని తెలియజేయాలి. గవర్నర్ పునర్విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం ఈ నిర్ణయాన్ని సమీక్షించవచ్చు. ఈ విషయంలో గవర్నర్‌దే తుది నిర్ణయం.
(జే) ఏ అధికారయినా తప్పులు చేస్తే గవర్నర్ ఆ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదికను కానీ, అభిప్రాయాన్నికానీ కోరవచ్చు. ఆ అధికారిపై విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించవచ్చు.
(కే) అత్యవసర పరిస్థితుల్లో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదికను కానీ, అభిప్రాయాన్నికానీ, దాని ప్రాతిపదికగా నిర్దుష్టంగా తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది రీ అలకేషన్‌కు ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు.
ఎల్) అందుబాటులో ఉన్న వసతి, రెండు ప్రభుత్వాల అవసరాలను బట్టి సీనియర్ అధికారుల కమిటీ సిఫారసుల ప్రాతిపదికగా తెలంగాణ ప్రభుత్వం సలహామేరకు రెండు ప్రభుత్వాలలోని అన్ని విభాగాలకు భవనాల కేటాయింపు, నిర్వహణ జరగాలి. ఈ అంశంలో తుది నిర్ణయయాధికారం గవర్నర్‌దే.
ఎం) ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడంకోసం హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లతోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేసి, ఫిర్యాదులు విని పరిష్కరించాలి. ఫిర్యాదుదారులు తమ వాదన వినిపించడానికి అవకాశం కల్పించాలి. బాధితుల ఆస్తి హక్కుల రక్షణకోసం గవర్నర్ అవసరమయితే తెలంగాణ ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వవచ్చు.

కేంద్రం లేఖపై కేసీఆర్ ఫైర్

రాష్ట్ర వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం పెంచేలా కేంద్ర రాసిన లేఖపై సీఎం కే చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కబళించడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఫాసిస్టు చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్రం రాసిన లేఖ అప్రజాస్వామికంగా, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. కేంద్రం నిర్ణయానికి నిరసనగా ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఏకం చేసి ఢిల్లీ వెళతామని ప్రకటించారు. ప్రజాస్వామ్యానికి పాతరేసే విధంగా ఉన్న ఈ లేఖకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య ఉద్యమం చేపడతామని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫాసిస్టు ధోరణిని నిరసిస్తామని చెప్పారు. 

హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించడమంటే తెలంగాణ ప్రజలను, ప్రభుత్వాన్ని కేంద్రం అవమానించినట్లేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని తేల్చి చెప్పారు. కేంద్రం రాసిన లేఖను ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించేది లేదని, అమలు పరిచేది లేదని కూడా సీఎం కరాఖండితంగా చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్రానికి లేఖ ద్వారా తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇదే లేఖను అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులకు పంపాలని ఆయనకు సూచించారు. 

మోడీ దిష్టిబొమ్మలు దహనానికి ఓయూ జేఏసీ పిలుపు

హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు అప్పగించాలనే కేంద్రం నిర్ణయంపై ఓయూ జేఏసీ మండిపడింది. ఈ నిర్ణయం సరైందని కాదని ఓయూ జేఏసీ నాయకులు పిడమర్తి రవి, దూదిమెట్ల బాలరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై శనివారం తెలంగాణ వ్యాప్తంగా నరేంద్రమోడీ దిష్టబొమ్మలు దహనం చేయాలని పిలుపునిచ్చారు.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,282 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>