Home / తెలుగు / మెదక్ జిల్లా ములుగులో ఉద్యానవన వర్సిటీ

మెదక్ జిల్లా ములుగులో ఉద్యానవన వర్సిటీ

మెదక్ జిల్లా ములుగు మండలంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అటవీ వర్సిటికీ అనుబంధంగా కాలేజీ, పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటవుతాయని చెప్పారు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో వీటిని నిర్మించనున్నారు. ఈ సంస్థలకు ములుగు వద్ద వెయ్యి ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

శుక్రవారం జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌కు వెళుతూ ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ (ఎఫ్‌ఆర్‌సీ)వద్ద కేసీఆర్ ఆగారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయే పై సంస్థలకు సంబంధించి స్థల పరిశీలన చేశారు. పచ్చని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంతోపాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఊహించని పురోభివృద్ధి సాధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ములుగు ఎఫ్‌ఆర్‌సీలో సుమారు వెయ్యి ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.

కలెక్టర్ శరత్, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ప్రియాంక వర్గీస్, డీఎఫ్‌వో సోనిబాలాదేవీ, ఓఎస్డీ హన్మంతరావులతో భూసేకరణ వివరాలపై సమీక్షించారు. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమానికి తానే వస్తానని, అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. 500 ఎకరాల విస్తీర్ణంలో అటవీ యూనివర్సిటీ, కాలేజీ, పరిశోధనా సంస్థ ఏర్పాటుకు మొదటగా రూ.100 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలో మొదటి పరిశోధన సంస్థ మెట్టుపాళ్యం వద్ద ఉండగా, రెండవది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుకానుందని చెప్పారు. దక్షిణభారతంలో ములుగు కేంద్రం అతిపెద్ద పరిశోధనాసంస్థగా వెలుగొందనుందని అన్నారు.

ప్రఖ్యాతిగాంచిన 100 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులు తమిళనాడు మెట్టుపాళ్యం యూనివర్సిటీ విద్యార్థులేనన్న సీఎం.. అలాంటి అద్భుత పరిశోధనలకు ములుగు అటవీ యూనివర్సిటీ వేదిక కాబోతున్నదని పేర్కొన్నారు. ఫలితంగా కొత్త వృక్షజాతుల అభివృద్ధి, అటవీ సంరక్షణ అవగాహన, అటవీ సంపద పెంపు, విద్యార్థులకు అటవీరంగంలో ఉన్నత విద్య అవకాశాలు, ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మరో 500 ఎకరాల్లో ఏర్పాటు కానున్న హార్టీకల్చర్ యూనివర్సిటీ నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. 

తెలంగాణలో కూరగాయల సాగులో పురోభివృద్ధికి, ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉన్న మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల కూరగాయల రైతులకు ఈ యూనివర్సిటీతో ఎంతో లబ్ధి చేకూరనుందని సీఎం తెలిపారు. మెదక్ జిల్లా కూరగాయల సాగుకు అనుకూలమైన ప్రదేశమని చెప్పారు. యూనివర్సిటీ వల్ల కూరగాయల తోటల పెంపకానికి అవసరమైన పరిశోధనలు రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. దాంతో ఇక్కడ మరిన్ని దిగుబడులు వస్తాయని, రైతులకు ఆర్థికలాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయని అన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నారు. ఇంకా దేశ, విదేశాలకు చెందిన నూతన పరిజ్ఞానానికి యూనివర్సిటీ వేదిక కానుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అటవీ యూనివర్సిటీ, పరిశోధన కేంద్రం, కాలేజీ, హార్టీకల్చర్ యూనివర్సిటీకి అడ్మినిస్ట్రేషన్ బ్లాకుల నిర్మాణం కోసం రీసెర్చ్ సెంటర్‌కు ఎదురుగా ఉన్న మరో 175 ఎకరాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇందులో విద్యార్థుల హాస్టల్ భవనాలు, కార్యాలయాల భవన సముదాయాలు నిర్మిస్తారన్నారు. 

జిల్లాలో 16వేల ఎకరాల ప్రభుత్వ భూముల గుర్తింపు

ఇప్పటి వరకు జిల్లాలో 16 వేల ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించినట్లు కేసీఆర్ వెల్లడించారు. ఇతర జిల్లాల్లో సైతం ప్రభుత్వ భూములను గుర్తించి, వ్యవసాయనుబంధ, పారిశ్రామిక ఆధారిత అవసరాల కోసం కేటాయిస్తామన్నారు. ఇప్పటికే మెదక్ జిల్లాలో ఐటీసీ సంస్థ ఆహార పదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని చెప్పారు. వ్యవసాయ క్షేత్రంలో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ శరత్, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రియాంక వర్గీస్ ఇతర అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. విశ్వప్రయత్నాలు చేసైనా ఈ నెల 15న దళితులకు భూ పంపిణీ చేయాలని ఆదేశించారు.

అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని పాడైన రోడ్ల మరమ్మతును తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో రోడ్ల మరమ్మతుకు దాదాపు రూ.128 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు వాటిని సీఎంకు అందజేశారు. పూర్తిగా పాడైన రోడ్లకు మొదట ప్రాధాన్యం ఇచ్చి మరమ్మతులు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

తూప్రాన్-ప్రజ్ఞాపూర్, ప్రజ్ఞాపూర్-జగదేవ్‌పూర్‌ల మధ్య నాలుగు లైన్ల రోడ్డుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గజ్వేల్ పట్టణంలో సెంటర్ లైట్లు ఏర్పాటు చేయాలని, వెంటనే మొక్కలు నాటి, సిద్ధంగా ఉన్న 2వేల ట్రీగార్డ్‌లను అమర్చాలని సూచించారు. నియోజకవర్గాన్ని హరిత వనంగా మార్చాలని కోరారు. గజ్వేల్ పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలు అక్కడోటి, ఇక్కడోటి ఉన్నాయి. అన్నింటినీ ఒకే చోటకు తెచ్చేలా సమీకృత భవన నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డికి సీఎం ఆదేశించారు.

సమీక్ష సమావేశానికి ముందు జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, వరదరాజ్‌పూర్ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ను కలిశారు. తమ గ్రామాల అభివృద్ధి కోసం వినతి పత్రాలు సమర్పించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరడంతో సీఎం సరేనని హామీ ఇచ్చారు. శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన అనితమ్మ అనే మహిళ తన భర్త గ్రామ సేవకుడుగా ఉండి చనిపోయాడని, ప్రస్తుతం తాను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో అనితమ్మకు గ్రామ సేవకురాలిగా అవకాశం కల్పించాలని ఆర్డీవోను ఆదేశించారు. కాగా వ్యవసాయ క్షేత్రం నుంచి ములుగు వెళుతూ కేసీఆర్ మర్కుక్ గ్రామంలో ఆగి గ్రామస్తులతో మాట్లాడారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గ్రామస్తులు కూడా శ్రమదానం ద్వారా గ్రామాన్ని బాగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గురువారం రాత్రి వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన సీఎం శుక్రవారం ఉదయం రెండున్నర గంటలపాటు క్షేత్రంలోని పంటలను స్వయంగా పరిశీలించారు.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,291 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>