Home / తెలుగు / ఆంధ్రజ్యోతి చెత్త పలుకులు!

ఆంధ్రజ్యోతి చెత్త పలుకులు!

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత గొప్ప ఫిక్షన్ రైటర్ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. కలలు కనడం, ఆ కలలకు అక్షరరూపం ఇవ్వడం, అవి చెదరిపోగానే మళ్లీ కొత్త కలలు కనడం రాధాకృష్ణకు అలవాటయింది. రాధాకృష్ణ కలల ప్రపంచం నానాటికీ విస్తరిస్తున్నది. ఇప్పుడది అనంతంగా గోచరిస్తున్నది. ఆంగ్లంలో విష్‌ఫుల్ థింకింగ్ అంటారు.. రాధాకృష్ణను అది ఆవహించినట్టు కనిపిస్తున్నది. గవర్నర్‌కున్న అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించినట్టు, దానిపై కేంద్రం సీరియస్ అయినట్టు, రాజ్యాంగాన్ని అవమానించడంగా భావించినట్టు, అవసరమయితే చివరి ఆయుధంగా కేంద్ర పాలన విధించే అవకాశం ఉన్నట్టు… అక్కసు, అజీర్తీ, ఉక్రోషమూ కలబోసి కలనేసి రాధాకృష్ణ అల్లిన కల్లబొల్లి కథనాన్ని చూసి తెలంగాణవాదులు విస్తుపోతున్నారు. 

andhrarkrshnaతొలి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన మనసులో ఎంత కుట్ర ఉన్నదో ఆయన ఈ రకంగానయినా బయటపెట్టుకున్నందుకు సంతోషం. ఆంధ్రజ్యోతి పత్రిక రాసిందంతా కేంద్రం బాధ అని ఎవరూ అనుకోవడం లేదు. అదంతా కేవలం రాధాకృష్ణ బాధ.. రాధాకృష్ణ గోస. రాధాకృష్ణ తన రెండు ముఖాలను ఎప్పుడూ దాచుకోలేదు. ఒకటి- నేను తెలంగాణవాడినంటాడు. తెలంగాణవాదినంటాడు. రెండు – మనసావాచా కర్మణా సమైక్యవాదిలా, చంద్రబాబు మనిషిలా మాట్లాడతాడు, రాస్తాడు. 

కేంద్రం మిథ్య, మమ్మల్ని శాసించడానికి కేంద్రం ఎవరు? అని నందమూరి తారకరామారావు సవాలు చేసినప్పుడు అశ్శరభశరభ అని ఆనందతాండవం చేసిన రాధాకృష్ణులు ఇప్పుడెందుకు బట్టలు చింపుకొంటున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్రం మిథ్య అని కూడా అనలేదు. మా మానాన మమ్మల్ని బతకనీయండి అంటున్నారు. రాష్ట్రం అధికారాల్లో జోక్యం చేసుకోవద్దంటున్నారు. కేంద్రం అధికారాలను ప్రశ్నించడం లేదు. రాజ్యాంగ విరుద్ధమైన, ప్రజాస్వామ్య విరుద్ధమైన, ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు మాపై రుద్దవద్దంటున్నారు. 

దేశంలో ఏ రాష్ట్రంపై విధించని ఆంక్షలు, పరిమితులు తెలంగాణ రాష్ట్రంపై విధించవద్దంటున్నారు. వైరుధ్యపూరితమైన ఆదేశాలు ఇవ్వవద్దంటున్నారు. ఇందులో రాధాకృష్ణకు ధిక్కారం కనిపించింది. ఒక రాష్ట్రం తన హక్కులకోసం, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం పోరాడడంగా అనిపించలేదు. నందమూరి తారకరామారావులో మాత్రం కేంద్రాన్ని సవాలు చేసిన మొనగాడు కనిపించాడు. అవును కదా- ఒక వెన్నుపోటును ప్రజాస్వామ్య పరిరక్షణగా, మరో వెన్నుపోటును ప్రజాస్వామ్య ద్రోహంగా మలిచి మరిపించి, మురిపించగల చతురులు కదా!

గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నదెవరు? మొదట పీపీఏలు రద్దుచేసి పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యుత్ సమన్వయ బోర్డులు అది తప్పని చెప్తున్నా వినకుండా ప్రైవేటు విద్యుత్ కంపెనీలను తెలంగాణకు విద్యుత్ ఇవ్వకుండా శాసిస్తున్నది ఎవరు? తెలంగాణ లోటు విద్యుత్‌తో సతమతమవుతున్నదని తెలిసీ ఇన్ని సమస్యలు సృష్టించింది ఎవరు? సీలేరు విద్యుత్ లెక్కలు చెప్పడానికి నిరాకరించిందెవరు? రాష్ట్ర విభజన పూర్తయి, తెలంగాణ ప్రభుత్వం అంటూ ఒకటి ఏర్పడిన తర్వాత… తెలంగాణ ప్రభుత్వంతో కనీసం మాటమాత్రంగా కూడా చెప్పకుండా పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేసి ఏకపక్షంగా తెలంగాణ భూభాగాలను ఆంధ్రలో కలిపింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగడుగునా అవమానిస్తూ వచ్చిందెవరు? తెలంగాణ ప్రభుత్వం ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా ఎంసెట్ నోటిఫికేషన్ తీసుకువచ్చిందెవరు? ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరు విద్వేషాలకు పునాదులు వేస్తున్నారు? ఎంఎస్‌వోలు తమ వ్యాపారాన్ని పణంగా పెట్టి ఆత్మగౌరవాన్ని చాటుకుంటే తప్పట.

వారు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారినట్టట. మరి.. పత్రికలు, పత్రికాధిపతులు మాత్రం ఒక రాజకీయ పార్టీకి, ప్రాంతీయ ఆధిపత్యానికి కీలుబొమ్మగా వ్యవహరించవచ్చా? పత్రికాధిపతులకు ఉన్న హక్కులు ఎంఎస్‌వోలకు ఉండవా? ఏయే చానళ్లు ప్రసారం చేయాలో డీటీహెచ్‌లను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉన్నదా?

ట్యాంకుబండుపై పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయని కేసీఆర్ అనడం రాధాకృష్ణకు తప్పనిపించింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీ విగ్రహాలు పెట్టుకుని పూజించాలని, పూజిస్తారని ఎలా అనుకున్నారు? కేసీఆర్ అన్నదాంట్లో తప్పేముంది? విశాఖ తీరంలో 30 విగ్రహాలు పెట్టుకున్నారే.. అందులో తెలంగాణవారివి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో చెప్తావా రాధాకృష్ణా? ఆంధ్ర ప్రజలు గౌరవించదగిన తెలంగాణ మహనీయులు ఎవరూ తమరికి కనిపించలేదా? మా రాష్ట్రం వచ్చిన తర్వాత మా మహామహుల విగ్రహాలు మేము పెట్టుకోవద్దా? మాపై మీరు రుద్దిన ఆధిపత్య ప్రతీకలను తుడిపేసుకోవద్దా? స్మృతిపథం నుంచి మీరు మాయం చేసిన మా యోధుల చిత్రాలను మేము ప్రదర్శించుకోవద్దా? రాధాకృష్ణ, చంద్రబాబు వంటివారు అరిచి గీపెట్టవచ్చు గాక, హైదరాబాద్‌ను తెలంగాణీకరించితీరాలి. విగ్రహాలు, వీధులు, సంస్థల పేర్లలో తెలంగాణతనం కనిపించి తీరాల్సిందే కదా. 

ఎదురుదెబ్బలు తగిలింది కేసీఆర్‌కు కాదు, రాధాకృష్ణకు, చంద్రబాబుకు. తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు విద్యుత్ వెలుగులు పంచి ఉండవచ్చు. దానివల్ల బట్టబయలయింది గత సీమాంధ్ర ప్రభుత్వాలు, ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రమే. ప్రైవేటు విద్యుత్ ప్లాంటులన్నీ ఆంధ్రలో పెట్టించి, తెలంగాణలోని గోదావరి తీరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారో రాష్ట్రం వేర్పడిన తర్వాతగానీ తెలిసిరాలేదు. అయినా ఫర్వాలేదు. తెలంగాణ పోరాడి తీరుతుంది. తన శక్తులను కూడదీసుకుంటుంది. రాధాకృష్ణ కోరుకుంటున్నట్టు బెంగటిల్లి, మళ్లీ బాబురావాలి, జాబురావాలని సాగిలపడదు. కేంద్రం మూడు రాష్ర్టాలలో నిరంతర విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సిద్ధమైంది.

చంద్రబాబు సైలెంట్‌గా వెళ్లి ఆ పథకంలో ఆంధ్రప్రదేశ్‌ను చేర్పించుకున్నాడట. రాధాకృష్ణ మెదడుకు ఇందులోని కిటుకు అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్‌తో ఉన్న రాష్ట్రం. కేంద్రం పథకం అమలు కావాలంటే లోటు ఉన్న రాష్ర్టాన్ని ఎంచుకోరు. ఇందులో కేసీఆర్ చేయలేకపోయింది, చంద్రబాబు సైలెంట్‌గా చేసుకొచ్చిందీ ఏమీలేదు. చంద్రబాబు బెల్లంలాగా, కేసీఆర్ బెల్లంకొట్టిన రాయిలాగా కనిపించే మేధస్సుకు ఇంతకంటే విశాలంగా ఆలోచించే జ్ఞానం ఉండదు. నియంతృత్వం గురించి, సెంటిమెంటును రెచ్చగొట్టడం గురించి చంద్రబాబును, నరేంద్రమోడీని మోసే వాళ్లు మాట్లాడకుండా ఉంటే మంచిది. నరేంద్రమోడీ గురించి తెలిసినవారెవరూ ఆయనతో పెట్టుకోరట. అది నరేంద్రమోడీకి రాధాకృష్ణ ఇస్తున్న సర్టిఫికెట్. రాధాకృష్ణ చిన్నమెదడుకు అది నియంతృత్వంగా అనిపించలేదు.

చంద్రబాబును చూసి కేసీఆర్ నేర్చుకోవాలట. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు? అన్నట్టు ఉంది యవ్వారం. చంద్రబాబును, రాధాకృష్ణను చూసి నేర్చుకోవలసిన దుస్థితిలో తెలంగాణ నేతలు లేరు. చంద్రబాబు మద్దతు ఉన్నా లేకపోయినా ఢిల్లీలో జరిగేదేంలేదు కాబట్టి కుక్కిన పేనులా పడి ఉన్నాడు. చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నాడంటేనే కేంద్ర మంత్రులు భయపడుతున్నారట.. ఆయన డిమాండ్ల జాబితా వినలేక. ఢిల్లీలో తన అవసరం ఉంటే చంద్రబాబు ఎలా ఉండేవారో అందరికీ తెలుసు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు ఆయన పాలసీ. ఆయన నుంచి నేర్చుకోవలసింది ఏమీలేదు.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,282 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>