Home / Headlines / గవర్నర్‌కు శాంతిభద్రతలను లోక్‌సభ నాడే తిరస్కరించింది
AP Reorganisation Bill law & order

గవర్నర్‌కు శాంతిభద్రతలను లోక్‌సభ నాడే తిరస్కరించింది

హైదరాబాద్ నగర శాంతిభద్రతలు గవర్నర్‌కు అప్పగించే అంశంలో కేంద్ర హోంశాఖ తప్పులో కాలేసిందా?.. అవును. నిజంగా నిజం. గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించే అంశాన్ని లోక్‌సభ ఎప్పుడో తిరస్కరించింది. హోంశాఖ తానే రూపొందించి పార్లమెంటుతో ఆమోదింప చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు – 2014 పై లోక్‌సభ ఆమోదం సందర్భంగా ఇది చోటు చేసుకుంది.వివరాలివి. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర హోంశాఖ రూపొందించిన విషయం తెలిసిందే. 

ఈ మేరకు హోంశాఖ రూపొందించిన చిత్తుప్రతికి నాటి యూపీఏ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసి రాష్ట్రపతికి పంపించింది. అక్కడినుంచి అసెంబ్లీ చర్చ అనంతరం కొద్దిపాటి మార్పులతో లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లులోని వివిధ అంశాలపై అన్ని పార్టీల నాయకులు రోజంతా సమగ్రంగా చర్చించారు. అయితే అంతకు ముందు పార్లమెంటులో పెప్పర్ స్ప్రే ఘటన కారణంగా పార్లమెంటు ప్రసారాలు నిలిపివేసి చర్చ నిర్వహించడంతో నాటి చర్చ వివరాలు ప్రముఖంగా ప్రచారంలోకి రాలేదు.

ఆ రోజు ఏమైందంటే…

లోక్‌సభలో కొద్ది పాటి ప్రతిఘటనల మధ్య కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుపై చర్చను ప్రారంభించారు. తెలంగాణ ప్రాంత ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రాష్ట్ర ఆవశ్యకత, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన వివిధ అంశాలను ఆయన వివరించారు. తర్వాత ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ సుదీర్ఘంగా ప్రసంగించి బిల్లుకు మద్దతు తెలిపారు. 

తర్వాత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ క్రమంలో డండం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రసంగించారు. చివరగా పెద్దపల్లి ఎంపీ వివేక్ ప్రసంగానంతరం స్పీకర్ స్థానంలో ఉన్న మీరాకుమార్ బిల్లులోని ఒక్కో క్లాజుకు వివిధ పార్టీలు చేసిన సవరణలను ఓటింగ్‌కు పెట్టారు. బిల్లులోని 3వ క్లాజులోని అంశానికి హోంమంత్రి సవరణ ప్రతిపాదించడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో బిల్లును వ్యతిరేకిస్తున్న తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ కొన్ని క్లాజులకు సవరణలు ప్రతిపాదించారు. అందులో గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించే అంశం కూడా ఉంది.

గవర్నర్‌కు శాంతి భద్రతల కోసం…

సౌగతా రాయ్ బిల్లులోని 8వ క్లాజులోని (గవర్నర్ అధికారాలపై ఉన్నది ఈ క్లాజులోనే) ఒకటో అంశానికి ఆయన సవరణ ప్రతిపాదించారు. ఇది ఆనాటి సవరణలో క్రమసంఖ్య 42 కింద సభ ముందుకు వచ్చింది.

ఆయన ప్రతిపాదించిన సవరణ పాఠం ఇది…

ప్రస్తుత బిల్లులోని పేజీ నెం 3లో 8నుంచి 11 వ లైన్లలో రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పాలనా సౌలభ్యం కోసం, ఆ ప్రాంతంలో నివసించే వారందరి ప్రాణ రక్షణ , స్వేచ్ఛ, ఆస్తుల పరిరక్షణ కల్పించడం గవర్నర్ ప్రత్యేక బాధ్యతగా ఉంటుంది. అని ఉంది.

పై వాక్యాలకు సౌగతా రాయ్ తన సవరణ తీర్మానం ద్వారా ఈ కింది సవరణ ప్రతిపాదించారు. 8(1) గవర్నర్ ప్రత్యేక బాధ్యతల్లో శాంతిభద్రతల అంశం కూడా ఉంటుంది అంటే గవర్నర్‌కు శాంతిభద్రతల అంశాన్ని పూర్తిగా అప్పగించాలని ఆయన ప్రతిపాదించారన్న మాట.

తిరస్కరించిన లోక్‌సభ…

కాగా సౌగతా రాయ్ ప్రతిపాదించిన ఈ సవరణను స్పీకర్ మీరాకుమార్ ఓటింగ్‌కోసం సభ ముందు పెట్టారు. తొలుత మూజువాణి ఓటుకు స్పీకర్ ఉద్యుక్తురాలు కాగా సౌగతా రాయ్ డివిజన్ ఓటింగ్‌కు డిమాండ్ చేశారు. కొద్దిపాటి శతబిషల అనంతరం దానికి స్పీకర్ అంగీకరించారు. రూల్ 367 ప్రకారం సభలో సభ్యులు నిలబడడం ద్వారా తమ అనుకూలత వ్యతిరేకతలను వ్యక్తం చేయాలని కోరారు. అదే మార్గంలో సభ ఈ సవరణకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ సవరణ వీగి పోయిందని స్పీకర్ ప్రకటించారు. 

ఇది జరిగింది. అంటే గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించాలన్న డిమాండ్‌ను లోక్‌సభ నిర్దందంగా తిరస్కరించింది. 8వ క్లాజ్‌లోని ఇతర అంశాల్లో ఈ అంశం ఉన్నా అది ప్రత్యేక పరిస్థితిలో తప్ప మామూలు పరిస్థితికి వర్తించేది కాదు. అంటే గవర్నర్ మామూలు విధుల్లో శాంతిభద్రతల అంశం లేదు. దాన్ని చేర్చాలన్న సవరణను లోక్‌సభ తిరస్కరించింది. 

అసలు జరిగింది ఇది కాగా దీన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తాజాగా హోంశాఖ శాంతిభద్రతలు గవర్నర్‌కు మామూలు బాధ్యతల స్థాయిలో అప్పగించే యత్నం లోక్‌సభ తీర్మానాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,260 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>