Home / తెలుగు / T News లైవ్ షో లో ప్రశ్నలకు CM KCR సమాధానాలు
KCR TNews Live Show

T News లైవ్ షో లో ప్రశ్నలకు CM KCR సమాధానాలు

ప్రభుత్వం వచ్చాక ఏమీ జరుగడం లేదు అని చాలామంది అనుకున్నరు. కానీ సైలెంట్‌గా 
పనిచేసుకుంటూ పోతున్నా. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో సీఎం చాంబర్‌లో నా టేబుల్ డ్రాలో భద్రంగా పెట్టుకున్నాను . ఏ విషయం వచ్చినా చూసుకుంటున్న. అదే మా భగవద్గీత.

టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోనే తమ భగవద్గీత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండాఅమలు చేసి చూపిస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం అవినీతి, భూ కబ్జాలు, కుంభకోణాలు వారసత్వంగా ఒక గంజాయి వనాన్ని అందించిందని, ఆ గంజాయి వనాన్ని నరికి వేస్తామని అన్నారు.

గురుకుల్ భూముల కబ్జాలే కాదు భూదాన్ భూములతో సహా దేనినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని, కబ్జాదారులు స్వయంగా భూములు సరెండర్ చేస్తే బతికి పోతారని అన్నారు. లేకుంటే జైలుకు వెళ్లక తప్పదన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు ఉద్యమంలో ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవం పాలనలో పాఠాలు నేర్పిందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ముందు ముందు మరిన్ని పథకాలు ప్రవేశపెడతామని చెప్పారు.

పోరాడి సాధించిన తెలంగాణను ఇతరుల పాలు కానివ్వరాదనే ఎన్నికల్లో పోటీ చేశామని చెప్పారు. గురువారం ఆయన టీ న్యూస్ నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేధావులతోపాటు సామాన్య ప్రజలు అడిగిన అనేక ప్రశ్నలకు జవాబిచ్చారు. ఆ వివరాలు..

టీ న్యూస్: ప్రభుత్వంలో వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి.. ఒకేరోజు మీరు వేగంగా తీసుకున్న కీలక నిర్ణయాలు ఆశ్చర్యపరిచాయి.. ఇది ఎలా సాధ్యమైంది?
కేసీఆర్: తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో సుమారు 14 సంవత్పరాలు, అంతకుముందు కూడా ప్రజా జీవితంలో ఉన్నాను. కేంద్రమంత్రిగా, రాష్ట్రమంత్రిగా పనిచేశాను. ఉద్యమంలో అన్ని రంగాల ప్రజలను కలుసుకున్న. లంబాడీ తండాల్లో పొద్దున్నే వేపపుల్ల వేసుకుని వారితో కలిసి తిరిగిన. ఎన్నికల ప్రణాళికపై మేధావులతో చర్చించిన. ఘంటా చక్రపాణి నివాసంలో ఎడిటర్లతో సమావేశమై ఎన్నికల ప్రణాళిక రూపొందించినం. 

మాజీ డీజీపీ పేర్వారం, రమణాచారి, రామలక్ష్మణ్, చెల్లప్ప, ఏకే గోయల్ విశేషంగా సహకరించారు. దళితుల అభ్యున్నతి, రైతుల రుణమాఫీపై కసరత్తు చేశాం. ఇతరుల చేతుల్లో తెలంగాణ పెడితే ఏమౌతుందోనన్న ఆందోళనతోనే టీఆర్‌ఎస్ పోటీ చేసింది. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ప్రజలకు వివరించాం. అట్టడుగు, దళిత, మైనార్టీ వర్గాల ప్రజల ఆర్తి, ఆకాంక్షలను మ్యానిఫెస్టోలో చేర్చాం. బీడీ కార్మికుల అంశం మ్యానిఫెస్టోలో లేకపోయినా నిజామాబాద్ పర్యటన తర్వాత చేర్చాం. రాష్ట్ర ఖజానాకు పరిమితులుంటాయి. అసలు అమలుకు యంత్రాంగం సిద్ధంగా ఉందా లేదా ఇలా అనేక అంశాలు చూశాం.

దళితులకు టాప్ ప్రయారిటీ..
దళితుల అభివృద్ధికి టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఎస్‌సీ కార్పొరేషన్ మీద చాలా ఫోకస్ ఇవ్వబోతున్నాం. ఉన్న సిబ్బంది సరిపోరు. 516 మంది అధికారులు కావాలని అన్నారు. ప్రభుత్వం వచ్చాక ఏమీ జరుగడం లేదు అని చాలామంది అనుకున్నరు. కానీ సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నా. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో సిఎం ఛాంబర్‌లో నా టెబుల్ డ్రాలో భద్రంగా పెట్టుకున్నాను. ఏ విషయం వచ్చినా చూసుకుంటున్న. అదే మా భగవద్గీత. 

నీటి పారుదల..
ఇపుడు ప్రకటించినవి కొన్ని పథకాలే. ఇది ఆరంభం మాత్రమే ..ఇంకా చాలా జరగాలి. ఇరిగేషన్ చాలా ముఖ్యం. హైదరాబాద్‌లో కూర్చుని చేయాలనుకోవడం లేదు. క్షేత్ర స్థాయికి వెళితే చూస్తే కలిగే స్వానుభవం వేరు. కృష్ణా ,గోదావరి నదుల ప్రవాహం ఎలా ఉంది… ప్రాణహిత ఎట్లా ఉంది చూడాలి. నాతో మంత్రులు, పత్రికా విలేకరులను కూడా తీసుకువెళ్తా. కొత్త పంథాలో వెళ్లాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు నీళ్లు ఎలా వస్తాయో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక పవర్ సెక్టార్.. చాలా సమస్యలున్నాయి. ఎన్నికల్లోనే ప్రజలకు ముందే చెప్పుకున్నం. మూడేళ్లవరకు ఇబ్బంది ఉంటది.

కాంట్రాక్టు ఉద్యోగులు..యువతకు ఉద్యోగాలు..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వస్తున్నది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌తో ఇబ్బంది లేదు. 75 వేలనుంచి లక్ష ఉద్యోగాలు వస్తున్నయి. వివరాలు సేకరించడం ఇతర పనులు జరుగుతున్నయ్. టైంపడుతున్నది. అధికారులు తక్కువ ఉన్నరు. మాట చెప్పినంత తేలిక కాదు. అధికారులు తక్కువ మంది ఉన్నా బాగా పని చేస్తున్నారు. కలిసి పని చేద్దామని పిలుపునిచ్చాను.మంత్రులు సిన్సియర్‌గ పనిచేస్తున్నరు. సంతృప్తికరంగా ఉంది. ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది. తెలంగాణ కోల్పోయింది చాలా ఉంది. తెలంగాణ పూర్వవైభవం పున:స్థాపితం అయ్యే వరకూ చాలా దూరం ప్రస్థానం సాగాల్సి ఉంది. 

టీ న్యూస్.. కళ్యాణ లక్ష్మీ పథకం ఆలోచన ఎందుకు కలిగింది….?
కేసిఆర్: ఆడపిల్ల పెళ్లి అనగానే మిడిల్ క్లాస్ అయినా లోక్లాస్ అయినా వణికిపోతారు. వాళ్లు అనుభవించే బాధ వర్ణణాతీతం. ప్రత్యేకంగా గిరిజనులు, దళితులు. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్నకోడూరు గ్రామానికి పోయినపుడు దళితుల ఇంట్ల పెండ్లి ఆగిపోయి ఉంది. సార్ దండం పెడతా బిడ్డపెళ్లి ఎత్తిపోయెటట్లు ఉంది అని తల్లి నా ముందు ఏడ్చింది. అల్లునికి సైకిల్ ఇస్తమన్నం.. కానీ కాలేదు అన్నది. 

అల్లుడిని పిలిచి సైకిల్ పెళ్లి చేసుకుంటున్నావా..పిల్లను పెళ్లి చేసుకుంట్నునవా అని అడిగిన. తండ్రితో సమస్య ఉందని చెప్పిండు. నా గన్‌మెన్‌ను ఎంతైదని అడిగి 1900రూపాయలిచ్చి అట్లాస్ సైకిల్ తెమ్మని పర్యటనకు పోయిన. తిరిగి వచ్చే సరికి సైకిల్ వచ్చింది. పసుపుకుంకుమతో సిద్ధం చేసిండ్రు. నాతో కొబ్బరి కాయ కొట్టించింది. అల్లుడు సైకిల్ మీద భార్యను ఎక్కించుకుని పోయిండు. అట్లనే వరంగల్ ములుగు జిల్లాలో అగ్ని ప్రమాదం చూసేందుకు పోయిన. ఒక గిరిజనుడు నా కాళ్ల మీదపడి పెండ్లికి తెచ్చిన 70 వేలు కాలిపోయినయ్.

శ్రీరామనవమి వెళ్లినాక పెళ్లి చేద్దామనుకున్నా అని ఏడ్చిండు. ఆదుకున్నం. ఇలాంటి ఎన్నో అనుభవాలున్నాయి. ఆడపిల్ల పెళ్లి అంటే ఉన్న వారింట్లోనే భయపడుతారు. దళితులకు ఇంకా ఇబ్బంది. వారి కోసమే ఈ కళ్యాణ లక్ష్మీ పథకం. కళ్యాణ లక్ష్మికి ఏమి పేరుపెట్టాలనే దానిపై క్యాబినెట్ లో చర్చ జరిగింది. పసుపు కుంకుమ , పుస్తెలు మెట్టెలు అని కొందరు చెప్పారు. రాము..ఐటీ, పంచాయితీరాజ్ మంత్రి..అతను కళ్యాణ లక్ష్మి అని చెప్పాడు. అధికారులందరూ బాగా ఉందని అన్నారు. 

టీ న్యూస్.. దళితుకు మూడెకరాల భూమి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ప్రభావం ఎలా ఉండబోతోంది…?.
కేసిఆర్‌:ఇంతకాలం దళితులకోసం కేటాయించిన నిధులు దారి మళ్లించారు. పథకాలు శాస్త్రీయంగా లేవు. నా స్వగ్రామం చింతకమడక లో 90 ఎకరాల భూమిని 110 మందికి ఇచ్చారు. తొవ్వగాని ఏదీ కాని లేకుండా అశాస్త్రీయంగా ఉంది. ఉపయోగంలోకి వచ్చిందా లేదా…అని చూడలేదు. ఈ సారి అలా కాదు. ప్రభుత్వమే పెట్టుబడి.నీటిపారుదల సౌకర్యం కల్పిస్తుంది. అగ్రికల్చర్ అధికారి మూడు నెలల కోసారి ఎవల్యుయేషన్ చేసి రిపోర్టు పంపాలి. దళిత వాడలనుంచి దరిద్రాన్ని తరిమికొడతాం. 

టీ న్యూస్ : రెండువందల పెన్షన్‌ను వేయి రూపాయలకు పెంచారు ఇది భారం కాదా,,,,,
కేసీఆర్: భారం అంటే నేను ఒప్పుకోను. ఆర్థిక నిపుణులు, ఆర్థిక శాస్త్రవేత్తలు పారిశ్రామిక వేత్తలకు మూడు వేల కోట్ల రాయితీలిద్దామంటే అధికారులు ఓకే అంటారు అదే పేదలకు అంటే భారమంటారు. అది కరెక్ట్ కాదు. మానవతా దృక్ఫదంతో చూడాలి. వితంతువులు, వృద్ధులను ఆదుకోవాలి. తినడానికి 770 రూపాయలు సరిపోవు. వికలాంగులకు, వృద్ధులకు సామాజిక భద్రత ఉండాలి. దసరా నుంచి దీపావళి మధ్య లోపు వారికి కొత్త బుక్‌లను అందిస్తాం. 

ప్రముఖుల అభిప్రాయాలు..
ఘంటాచక్రపాణి : కేసీఆర్ గారుతెలంగాణకు కొత్త దిశను నిర్థేశించారు. ఇంత కసరత్తు చూడటం మొదటి సారి. ఏమి చేయాలనే దానిపై స్పష్టత ఉంది. దళితులకు సంబంధించిన విధానం. పారిశ్రామిక విధానం ఎంతో బాగుంది. దళితులకు భూమి ఏ విధంగా గౌరవం వస్తుందో ఆ విధంగా విధానాలకు రూపకల్పన చేశారు. దయాదాక్షిణ్యాలు అవసరం లేకుండా పాలేరులు కాకుండా ఇంతకు మించి విప్లవం ఉండదు. ఉద్యోగాలకు సంబంధించి ఆందోళనలు లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా వేతనాలిచ్చారు. 

దేశపతి శ్రీనివాస్: అవినీతిని ఎలా అరికడతారు?
కేసీఆర్: పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు. చాలా దారుణంగా 24 లక్షల కుటుంబాలు 57లక్షల ఇళ్లు కట్టినట్లు రికార్డుల్లో ఉంది. భయంకరమైన అవినీతి జరిగింది. ఆరోగ్య శ్రీలో అంతులేని అవినీతి , ఫీజురీయింబర్స్‌మెంట్‌లో, జలయజంలో వేలాది కోట్ల కుంభకోణాలు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు అంతే లేదు. చెరువులు, కుంటలు చివరికి దేవుడి భూములు కూడా దైవ భీతి లేకుండా కబ్జా చేశారు. ఈఎన్‌టిని కబ్జా చేశారు. ఇది సమైక్య రాష్ట్రం మనకు ఇచ్చిన వారసత్వ సంపద. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆరునూరైనా ఎవరినీ వదిలేది లేదు. అక్రమార్కులు తిన్నది కక్కాల్సిందే. భూదాన్ భూములు. గురుకుల్ భూములు కబ్జాదారులు తప్పు ఒప్పుకుంటే బతికిపోతరు. లేకుంటే జైలుకు పోక తప్పదు. గంజాయి వనాన్ని నరికేస్తాం.తులసి వనంగా మారుస్తాం. 

వేణుగోపాల్(పాత్రికేయులు): గురుకుల్ ట్రస్ట్ ఎన్‌కన్వెన్షన్ భూములను స్వాధీనం చేసుకోవాలి. కొత్త పారిశ్రామిక విధానాన్ని తేవాల్సి ఉంది. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను పునర్‌సమీక్షించాలి. 
కేసిఆర్: భూబకాసురుల భరతం పడతాం. హైదరాబాద్ మురికివాడలలో చాలా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. స్లమ్‌ఫ్రీ గా చేస్తాను. కొత్త గా పథకానికి రూపకల్పన చేస్తాను. నేనే స్వయంగా ఒక మురికివాడను దత్తత తీసుకుంటాను. అక్కడే భూములపై హక్కులిస్తాం. ఫ్లాట్‌లను వారిపై రిజిస్ట్రేషన్ చేయిస్తాను. పార్క్‌లు, రోడ్లు వేయిస్తాను. స్లమ్‌ఫ్రీ గా చేస్తాను. మురికివాడలు లేని హైదరాబాద్‌ను చూపిస్తాను.

హాఫెజ్ ఉస్మాన్.. మక్కామసీదు ఇమాం, (నవాబ్ మహబూబ్ అలీఖాన్.. అన్వరుల్ ఉలుమ్ కళాశాల కార్యదర్శి )
మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ముస్లింలు, వారి విద్యారంగంపై దృష్టి పెట్టండి. వారికి సౌకర్యాలు కల్పించండి. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఉచిత విద్యాబోధన జరిపిస్తామన్నారు. ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. అన్ని విధాలా తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకెళ్ళండి. ఎన్నికల ముందు ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయండి.
-ముఖ్యమంత్రి: సలాం పేష్ కర్‌తాహు. షుక్రియా అదాకర్తాహు (సలాం చేస్తున్నా. మీరు నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా). ముస్లింలలో నిరుద్యోగం, విద్యా, దారిద్య్ర సమస్య అధికంగా ఉంది. ముస్లింలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వారు అలాగే ఉంటే సమస్యలు పరిష్కారం కావు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీ మేరకు చేస్తున్నా. మైనారిటీ అభ్యర్థిని డిప్యూటీ సీఎం చేస్తాన్నన్నాను.. మహమూద్ అలీని చేశాం.

ముస్లింల కోసం రూ.వెయ్యికోట్ల బడ్జెట్ ఇస్తామన్నాను. నిన్ననే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైపోతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వారందరు దోచుకున్నారు. ఇలాంటి భూములను వక్ఫ్‌బోర్డుకు తిరిగి ఇప్పిస్తాం. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తూ నిన్ననే నిర్ణయం తీసుకున్నాం. 12% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పాను. కొందరు అమలుకాని హామీ అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఇరాదే పక్కే హైతో రాస్తే నికల్ ఆతే హై (చిత్తశుద్ధి ఉంటే దారులు వాటంతట అవేవస్తాయి). తప్పకుండా ఆ రిజర్వేషన్లను అమలు చేసి చూపిస్తాం. 

శ్రీనివాసరెడ్డి, (తడకమళ్ల (మిర్యాలగూడ)
తడకమళ్ల నుంచి ఇసుక అక్రమంగా రవాణా జరుగుతోంది. మూసీనది, పాలేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. దీనివల్ల పంట, పొలాలు చెడిపోతున్నాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి.
- ముఖ్యమంత్రి: ఇసుక రవాణా జరుగకుండా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం.

కుమార్, ఖమ్మం
రుణమాఫీ ఎప్పటి నుంచి అమలు చేస్తారు?
-ముఖ్యమంత్రి: వెంటనే అమలు చేస్తాం.

వెంగల్, (యూఎస్‌ఏ)
కొన్ని దళిత కుటుంబాలకు 30ఎకరాలు ఇచ్చి, సహకార సేద్యం చేయిస్తే బాగుంటుంది. ప్రవీణ్‌కుమార్‌లాంటి అధికారులను ప్రోత్సహించాలి.
-ముఖ్యమంత్రి: సహకార వ్యవసాయం గతంలోనే విఫలమైంది. రష్యాలో కూడా విఫలమైంది. ఒక్కో కుటుంబానికి 3 ఎకరాలు చొప్పున ఇస్తే వారి పనులు వారు చేసుకుంటారు. ప్రవీణ్‌కుమార్ నిజంగా ఉత్తమ అధికారే. విద్యకు సంబంధించిన అంశాల్లో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తాం.

నవీన్‌కుమార్, పుణె 
ఖమ్మం జిల్లాకు చెందిన నేను స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నాను. ఈనాడు నా గ్రామం పోలవరం ముంపులో భాగంగా ఏపీకి వెళ్లిపోయింది. తెలంగాణ వచ్చినందుకు ఆనందపడాలో నా గ్రామం ఆంధ్రలో కలిసిపోయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. నాకు తెలంగాణకు రావాలని ఉంది. 
-ముఖ్యమంత్రి: కేంద్రం దుర్మార్గంగా వ్యవహరించి ముంపు మండలాలను ఏపీలో కలిపేసింది. తెలంగాణ వచ్చినందుకు సంతోషపడాలో.. ఏడు మండలాలు ఆంధ్రలో కలిసినందుకు బాధపడాలో తెలియడం లేదు. కేంద్రంలోని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఇప్పుడు చేయగలిందేమీ లేదు. భూములు కోల్పోయినవారికి మార్కెట్ విలువ ప్రకారం అందేలా మేము ప్రయత్నిస్తాం. ముంపు మండలాలకు చెందినవారు తెలంగాణకు వస్తామంటే.. స్వాగతం పలుకుతాం.

రహమాన్, మెదక్
మేము ఏండ్ల తరబడి తక్కువ జీతాలకు ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నాం. మాకు పర్మినెంట్ చేయించి, జీతాలు పెంచేలా చూడాలి. 
-ముఖ్యమంత్రి: మీరు పనిచేసే కంపెనీ వివరాలు తెలుపండి. యాజమాన్యంతో జీతాల విషయంలో మాట్లాడుతా. 

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి ప్రధాన సమస్యగా ఉన్న డిపెండింగ్ ఉద్యోగాల విషయం?
-ముఖ్యమంత్రి: త్వరలో సింగరేణిపై సమీక్ష జరుపుతాం. ఇచ్చిన హామీ ప్రకారం డిపెండింగ్ ఉద్యోగాలిప్పిస్తాం. తీపి కబురు అందిస్తాం.

దేశపతి శ్రీనివాస్, గాయకుడు
గిరిజన గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించడం వెనుక?..
-ముఖ్యమంత్రి: గ్రామంలో తండా ఒక భాగంగా ఉండటంవల్ల తండా అభివృద్ధి చెందడం లేదని గిరిజనుల అభిప్రాయం. తండానే పంచాయతీ అయితే అభివృద్ధి చేసుకుంటామని వారి ఆశ. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలుగా ప్రకటించాం. అభివృద్ధి జరుగుతున్నది.

జ్వాలా నరసింహారావు, (సీఎం సీపీఆర్వో)
మ్యానిఫెస్టో ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. డిపార్ట్‌మెంట్లవారీగా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులు చెప్పింది విని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి మీడియా కూడా సహకరించడం అభినందనీయం.

వినోద్‌కుమార్, వికారాబాద్
వికారాబాద్‌ను జిల్లాగా మారుస్తున్నారా? 
- సీఎం: వికారాబాద్‌ను జిల్లాగా మారుస్తున్నాం. మీకు శుభాకాంక్షలు 

జగన్, ఉప్పల్
ప్రభుత్వ హాస్పిటాళ్లలో వసతులు ఎప్పుడు మెరుగుపడతాయి?
-ముఖ్యమంత్రి:గత ప్రభుత్వాలు ప్రభుత్వ హాస్పిటళ్లను పెంటకుప్పలు చేశాయి. అన్నీ జిల్లా కేంద్రాల్లో నిమ్స్ స్థాయి హాస్పిటళ్లను ఏర్పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

బొల్లారం నుంచి నరసింగరావు: చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తారా? 
-ముఖ్యమంత్రి: తప్పకుండా. రూ.200కోట్లుకన్నా తక్కువ పెట్టుబడితో ఉండే పరిశ్రమలను చిన్న పరిశ్రమలంటారు. మీరు ఒకసారి సెక్రటేరియట్‌కు రండి మనం ఈ విషయంపై చర్చిద్దాం. 

హైదరాబాద్ నుంచి సుదర్శన్: హైదరాబాద్ మాస్టర్ ప్టాన్ గురించి ..
-ముఖ్యమంత్రి: ఆంధ్రాబాబులు హైదరాబాద్‌ను తలదన్నే నగరాన్ని నిర్మించుకుంటామని కలలు కంటున్నారు. వారు గొప్ప నగరాన్ని నిర్మించుకోవాలి. వాళ్లు అభివృద్ధి చెందాలి. అయితే హైదరాబాద్ వంటి మహానగరాన్ని నిర్మించడం ఇప్పుడు నిజాం నవాబ్‌కు కూడా సాధ్యం కాదు. పౌర సమాజం సహకరిస్తే హైదరాబాద్‌లో గుణాత్మకమైన మార్పులు తీసుకువస్తాం. కొద్ది సంవత్సరాల్లో హైదరాబాద్ జనాభా మూడు కోట్లకు చేరుకుంటుందనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 

చెన్నమనేని రాజేశ్వర్‌రావు
పంచాయతీ అధికారాల బదలాయింపు ఎప్పటినుంచి?
-ముఖ్యమంత్రి: రాజేశ్వర్‌రావు తన జీవితమంతా ప్రజల కోసం పనిచేశారు. నిక్కచ్చిగా మాట్లాడటం ఆయన అలవాటు. అందుకే ఎప్పటినుంచి పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు చేపడుతారని అడిగారు. పంచాయతీరాజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందులో భాగంగా అపార్డ్‌లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లకు శిక్షణాతరగతులు నిర్వహిస్తాం. అధికారాల బదలాయింపుపై దృష్టి సారించాం.

యాంకర్: ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమ కారులతో సంబంధాలు కొనసాగించడానికి వీలు ఉంటుందా?
-ముఖ్యమంత్రి: సీఎం అయిన తర్వాత తెలంగాణ భవన్‌కు రావడం తగ్గింది. పని ఒత్తిడి వల్ల గతంలో మాదిరిగా ఉద్యమకారులను కలువలేకపోవచ్చు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు బాధపడవద్దు. ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేను. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో ప్రజలను నేరుగా కలుసుకుంటాను.

ఘంటా చక్రపాణి: భారీ వరాలు కురిపిస్తున్నారు? బడ్జెట్ ఎలా ఉండబోతోంది? పథకాల అమలకు నిధులున్నాయా? అనే సందేహం వ్యక్తమవుతున్నది. ఎయిడెడ్ కాలేజీల క్రమబద్ధీకరణ విషయంలో ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందా అనే సందేహం వ్యక్తమవుతున్నది?
-ముఖ్యమంత్రి: రెండో ప్రశ్న అర్థం కాలేదు. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తాను. చాలా హామీలు ఇస్తున్నారు. అమలవుతాయా? అనే సందేహం చాలామందిలో ఉంది. ఈ అంశంపై చాలా వేదికలపై ప్రకటించాను. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు. వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. తెలంగాణలో అన్ని వనరులు ఉన్నాయి.

ఆదాయం సర్‌ప్లస్. మిగులు రాష్ట్రం. ఈ విషయాన్ని చాలామంది పుస్తకాల్లో రాశారు. ప్లాన్-నాన్‌ప్లాన్ బడ్జెట్ కలిసి రూ.75 వేల కోట్లు ఉంటుంది. ఇందులో రూ. 40 వేల కోట్లు నాన్‌ప్లాన్. మిగతా రూ. 35 వేల కోట్లు ప్లాన్ బడ్జెట్. పాత బకాయిలను వసూలుచేస్తే వనరులకు ఢోకా ఉండదు. కొంత ఆర్థిక క్రమశిక్షణ కూడా అవసరముంటుంది. రుణాలమాఫీకే అధికంగా నిధులు ఖర్చవుతాయనే అనుమానముంది. ఆర్‌బీఐతో ప్రభుత్వం ఈ రుణాలపై చర్చ జరుపుతోంది.

ప్రతి ఏటా వడ్డీ ప్రభుత్వం చెల్లించడంతోపాటు నాలుగైదు వాయిదాలలో అసలు చెల్లించేలా ప్రణాళికలు రూపొందించాం. అంతేగాకుండా నిజాం నవాబు చేసిన పనుల వల్ల తెలంగాణలో అపారమైన భూ సంపద ఉంది. కొన్ని ప్రాంతాల్లో విలువైన స్థలాలను భూబకాసురులు ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వం కూడా రక్షించలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ భూమలును గుర్తించి, వీటిపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి అమ్మకాలు చేపడుతాం.

సింగరేణి, ఇతర గనుల ద్వారా రాయల్టీ వస్తుంది. ఇక పెట్టుబడులను కూడా ఆకర్షిస్తాం. మన రాష్ట్రం దేశంలోనే బెస్ట్‌గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఏ మాత్రం పోటీలేదు. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సరితూగదు. ఐఐటీఆర్‌వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు తెలంగాణకు వస్తున్నాయి. వీటిద్వారా అభివృద్ధి జరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణస్థాయి పెరిగి పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం ద్వారానే పథకాలను అమలుచేస్తాం. అన్ని వనరులను ఉపయోగించుకుని రాష్ర్టాన్ని ఔరా..అనిపించేలా, దేశం ముక్కున వేలేసుకునేలా అభివృద్ధి చేస్తాం.

దేశపతి శ్రీనివాస్: రాష్ట్ర ప్రభుత్వ పాలనను అస్థిరతపరిచే కుట్రలు చేస్తున్నారు. గవర్నర్ పాలన ఉంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి?
-ముఖ్యమంత్రి:రాష్ర్టాల హక్కులను కేంద్రం హరించజాలదు. కొత్తగా ఏర్పడ్డ రాష్ర్టాలకు బాలారిష్టాలు తప్పవు. అటువంటి ప్రయత్నాలు చేస్తే దేశంలో ఉన్న 28 రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం. ఇందులో బీజేపీ ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తాం. యుద్ధం ప్రకటిస్తాం. అందులో కూడా విజయవంతమవుతాం. అనుమానం లేదు. కోట్ల మంది ప్రజలు నా వెనుక ఉన్నారు. సోయి పెరిగి రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతున్నది. ఇది అపూర్వమైన దృశ్యం.

కల్లూరి శ్రీనివాసరెడ్డి, సీనియర్ జర్నలిస్టు
హామీలు నెరవేర్చడానికి సంవత్సరాలు పడుతుందని భావిస్తే కేవలం 46 రోజుల్లోనే వరాలు కురిపించారు. 60 ఏండ్లుగా రాజకీయ స్వాతంత్యం కోసం పోరాడిన తెలంగాణవాదులు సీఎంగా కేసీఆర్‌ను చూడగలుగుతున్నారు. ఇంటి పార్టీ గెలిచింది. ఒక రైతు బిడ్డ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం సంతోషకరం. ఆటో రిక్షావాలాలు, డాక్టర్లు, ఉద్యోగులు అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మిత్రుల ఒత్తిడి మేరకే ఎన్నికల్లో పాల్గొన్నా
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తర్వాత రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. 40 ఏండ్ల పాటు రాజకీయాల్లో రాపిడిని అనుభవించానని అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతో వేయిజన్మలకు కావాల్సిన కీర్తిని గడించానని, ఇక చరిత్రగా మిగిలిపోవాలని ఆకాంక్షించానని ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో టీ చానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

ఉద్యమంలో పాల్గొన్న మిత్రులందరూ సాధించిన తెలంగాణను ఎవరి చేతుల్లో పెడితే ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశపతి శ్రీనివాస్ వంటి మిత్రుల ఒత్తిడి మేరకు ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొన్నానని వివరించారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించారని, ప్రజల మద్దతు లభించిందని, అందుకే అంతరాలు లేని, ఆదర్శవంతమైన బంగారు తెలంగాణను నిర్మించడం బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

One comment

  1. When a person talks from heart you will know. All these words are directly from the heart.

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,281 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>