Home / TG History / Arts & Literature / వలసంటే? – అభినయ్ కశ్యప్
1002627_10200754980371032_2108133960_n

వలసంటే? – అభినయ్ కశ్యప్

ఒక 15 ఏండ్ల కిందటి మాట:
వేసవి సెల్వులు వస్తే మా దోస్తులందరూ తిరుపతి వోతం, ఊరికి వోతం, ఊటీ వోతం అనేటోళ్ళు. నాకు మాత్రం మనసంతా మా ఊరిమీననే. “మా పల్లె యందు ప్రకృతి పరవశించెను, ఎటు చూసినా పచ్చని పొలాలతో, పారే కాలువలతో, వాగులతో, వంకలతో, పల్లె అందము వర్ణనాతీతము” అని పుస్తకాలల్ల సదువుకునేటిది. అది సదివి ఊరికి పోవాలెనని ఉబలాటం ఇంగా ఎక్కువయ్యేటిది. అప్పట్ల చిన్న చిన్న పోరల్లం ఒక పది మంది దంక ఐతుంటిమి. సెల్వులొస్తే సాలు, ఊరికోవాలె, ఆడ అందరితోని ఆడుకునాలె, శామకూరోళ్ళ సందీపు, భారతీషు, పద్మనాభాచర్య, ఐద్రవాదు సంపతు, మా ముగ్గురక్కలు, పెదనాయిన, పెద్దమ్మ ఇంగ మా కాక. ఎప్పుడైతె కలుస్తనా ఈళ్ళనందరినీ అని పానం ఒకటే గుంజుడు. ” ఎండాకాలం రా బిడ్డా ఆడ ఓళ్ళకే మస్తు కష్టము, అసలే ఊర్ల నీళ్ళు లేవు, నీడ పట్టున ఈడనే ఉండు రా ఇంటి కాడ” అని అమ్మా, నాయిన మస్తు జెప్పేటోల్లు. మనం ఇంటమా, ఆ దోస్తులు, ఆ మామిడిపండ్లు, మా కాక. మనసు వశమయ్యేటిది కాదు. రెండు మూడు దినాలుండి వస్త అమ్మా అని ఒచ్చేటోన్ని.
*****************************************************************
కోటకొండ, పాలమూరు బస్ట్యాండు కెల్లి 40 కిలోమీటర్లు దూరం. చిన్న ఊరు. గుట్టలపొంటి రోడ్డు లేని దారి. నలభై కిలోమీటర్ల దారికి గంటన్నర పట్టేటిది. ఊరికి పోయిన తర్వాత అర్థమయ్యింది నీళ్ళ కష్టాలంటే ఎట్లుంటయో అని. తాగే నీళ్ళకి ఇంటికాడికెల్లి రెండు కిలోమీటర్ల దూరం నడ్సుకుంట పోయి మంచి నీళ్ళ బాయి కాడ నీళ్ళు సేదుకుని మోసుకుంట రావాలె. స్నానానికి నీళ్ళకి కూడా చేతి పంపు కాడ కెల్లి నీళ్ళు తెచ్కునాలె. మనసుకి, పానానికి ఎంత కష్టమైనా, పట్నం కెల్లి పిల్లలొచ్చిండ్రని మా అక్కలు కష్టం భరించేటోళ్ళు. ఆ చిన్నతనం ల అదేది అర్థమయ్యేటిది కాదు. ఆ తల్లులకో దండం. తెలంగాణ పల్లెలు, నీటి కష్టాలపై మొదటి జీవిత పాఠం.
*****************************************************************
మా కాక, నన్ను నా తోటి సోపతిగాళ్ళని యేసుకొని పొలం కాడికి పోవుడు, ఊరు తిప్పిసూపెట్టుడు, సాయంత్రం శెరువు కాడికి తోల్కపోయి, సల్లగ గడ్డిల వండుకొని ఆకాశం పొంటి సూస్కుంట సుక్కలు లెక్క వెట్టుడు చేస్తుంటిమి. ఊల్లె పోరళ్ళు సాయంత్రం శెరువు కాడికొచ్చి బట్టలుతుక్కొని శెర్వు ల ఈతకొట్టి అదే పంచ నెత్తికి సుట్టుకొని ఇంటికి వొయ్యేటోళ్ళు. “కాక వాళ్ళు ఈడెందుకు స్నానం చేస్తరు, వాళ్ళకి బాత్రూం లేదా అని నేనడిగితే, వాళ్ళకు ఉండనిక్కె రూమే లేదురా, శిన్న శిన్న గుడిశెలల్ల ఉంటరు, అందుకే ఈడికొచ్చి స్నానం చేస్తరు. ఈ చెరువే వాళ్ళకి దిక్కు” అన్నడు. వీళ్ళకి ఇంకా ఏమేమి కష్టాలుంటయి కాక అని అడిగిన, వద్దులేరా, చెప్పినా నీకర్థం కాదు, ఇంటికి పోదం నడువు అన్నడు. బీదరికం, పల్లె ప్రజల దీన స్థితి పై మొదటి పాఠం.
*****************************************************************
మల్త రోజు సాయంత్రం పోరళ్ళందరం ఇంట్ల దాపెట్కునే ఆటాడుకుంటున్నం. అభీ, నేను బైటికి వోతున్న రా పోదం అన్నడు మా కాక. నేను ఆడ్తలే అని అర్సుకుంట మా కాకెంబడి పోయిన. ముందు కుమ్మరోళ్ళ ఇంటికి కాడికి వోయినం. సూపు సక్కగలేక, నడుమొంగిపోయి, సావు పానం మీనికొచ్చిన ఒక ముసలాయన కుండలు చేస్తాండు.
కాక: ఏం తాతా, ఏమయింది కుండ, ఇత్తవా ఇయ్యవా ఇంతకి?
ముసలాయ్న: అయ్యా, కుండ చేసిన, ఇంత సేపు ఎండల వెట్టిన, బట్టీల కాల్సాలె, పొద్దుగాల కంత ఇస్తయ్యా.
కాక: శాతగాని ముసలోన్వి ఒక్కన్వే ఏంటికి తన్లాడుతున్నవ్? నీ కొడుక్యాడున్నడు?
ము: ఇంగ యాడ కొడుకయ్యా? ఈ ఊల్లె ఇంగేమి దిక్కెల్లక పోయిన వారమే పెండ్లాం తోని బొంబై వల్స వోయిండు కూలి పనికి.
కాక: వానికి పెండ్లయ్యి ఒక నెల గిట్ల కాలే గద రా అప్పుడే ఏంటికి తోలిచ్చినవ్?
ము: పోతే వోని ఊకో అయ్య, పెండ్లైనోడు, ఈడ ఉండి పొలం లేక, పని లేక, ప్రతి దినాము తిండికి దిక్కు లేక ఏం చేస్తడు? ఆడికి వొయ్యి కూలి పని చేస్కుంట రోజుకి రెండు మెత్కులన్న తింటదు. నేను సావుకాడికొచ్చిన, గా పని నాకు శాతగాదంటనని ఈడనే ఉన్న. యేడ్సుకుంట, ఇండ్లనే సావాలె నేను.
కాక: సరే మల్ల రేపట్కి ఒస్త లే, కిస్తి ల కెల్లి ఐదు రూపయలు తీసి, అభి, నీ కిస్తిల పైసలున్నయ?
నా దగ్గర ఐదు రూపయలునిండె, ఇచ్చిన. ఇగో, కుండ కి ఐద్రుపాయలు, ఈ పిల్లగాడు మా అన్న కొడుకు పట్నంల ఉంటదు, ఐదు రూపయలు ఇచ్చిండు.
ముసలి తాతకి పాపం కడుపు ల ఆకలి, కండ్లల్ల నీల్లు, ఆ గుడిసె తప్ప ఇంగేం లెవ్వు రా అన్నడు కాక.
నేను: కాకా, వలసంటె ఏంది కాక? అని అడిగిన. సూపిస్త దా అని బస్ట్యాండు దిక్కు తోల్కవొయ్యిండు.
ఇయ్యాల బస్ట్యాండు కాడ మొత్తం లొల్లి లొల్లి ఉన్నది. బొంబాయి వయా నారాయణపేట బోర్డేస్కోని రెండు ఎక్స్ ప్రెస్స్ బస్సులు ఉన్నయి ఆడ. ప్రతి వారం ఊరికెల్లి బొంబాయి కి రెండు డైరెక్టు బస్సులు. బస్సుల నిండ, బస్సు సుట్టూ మస్తు మంది నిలవడిన్రు. వోల్లని బస్సెక్కించు కుంట ముసలోళ్ళు యేడుస్కుంట కనవడిన్రు. అంద్లకెల్లి ఒక ముసల్ది కాలికున్న యెండి కడెం తీస్కుంట మన్మడి కాలికేస్తున్నది. శెవి కమ్మలు, ముక్కు పోగులు అన్నీ తీసేసి కోడలికి ఇచ్చింది. ముసల్ది, దాని కొడుకు, కోడలు, ఆ చిన్న పోరడు అందరూ ఒకర్నొకరు వట్కోని యేడుస్తాండ్రు. “ఎక్కుండ్రి వయ్య జల్ది జల్ది ఎక్కుండ్రి, ఇంగా మస్తు దూరం వొయ్యేదున్నది, ఇంగా మస్తు యేడిసేదున్నది అని కండక్టర్ అర్షిండు. “ఇంద్ల కెల్లి ఎంత మంది తిరిగిగొత్తరో, ఎంత మంది దుమ్ము, సిమెంటు పెయ్యికి వడక, మీనికెల్లి జారి పడి, గోడకూలి మీన వడి సత్తరో ఏమో, ఇంగెన్ని దినాలో ఇట్ల” అని అన్నడు.
ముసల్దాంకి పంచె సందులకెల్లి ముదిరిపోయిన రెండు ఒంద రూపాయల నోట్లు తీసి ఇచ్చిండు కొడుకు, ” అమ్మా నీకసలే పానం బాగలేదు, గీ రెండొందలు తీసి పెట్కోనే, పనికొత్తయి, వద్దనకే”
” నాకేమిట్కి బిడ్డా రెండొందలు, నేనిగ షాన దినాలు బత్కను, నాకేమిట్కి రా దుడ్లు, ఒద్దు నాయినా, సన్న పోరడున్నడు, ఊరు గాని ఊరు వోతాండ్రు, మీకే దుడ్లు గావాలె బిడ్డా” అనుకుంట కోడలికిచ్చింది. అట్ల యేడ్సుకుంట యేడ్సుకుంటనే బస్సు బయల్దేరింది. అది వొయ్యినాక గూడ ఆడ ముసలోల్లు కింద గూకొని యేడుస్తానే ఉన్నరు. నాకు మా కాక కి గిట్ల కండ్లల్ల నీళ్ళు.
చిన్నప్పుడు ఊకె పిచ్చి పిచ్చి ప్రశ్నలడిగే నాకు ఎన్నో కొత్త ప్రశ్నలు. కృష్నా నది దగ్గరగా ఉన్నా, మన ఊరికి నీరెందుకు లేదని, పొలమెందుకెండిందని, ఊరెందుకు వలస వొయ్యిందని, బతుకెందుకు చెడిందని, కడుపెందుకు మండిందని. ముసలోడు, ముసల్దాని పరిస్థితేందని ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నల ప్రతిఫలమే ఇయ్యాలటి ఈ నేను.

******* ఆ తర్వాత ఒక వారం దినాలకే ముసలోడు, ముసల్ది సచ్చిపోయిండ్రు, ఊల్లె ఉన్నోళ్లే శవాలని కాలవెట్టిండ్రు*******

2 comments

  1. Excellent Abhi…

  2. Heart touching article…

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,282 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>