Home / తెలుగు / రోజూ తెలంగాణ కోల్పోతున్న విద్యుత్తు – 17.1 మిలియన్ యూనిట్లు!

రోజూ తెలంగాణ కోల్పోతున్న విద్యుత్తు – 17.1 మిలియన్ యూనిట్లు!

telangana power loss

-అప్పనంగా వాడుకుంటున్న ఏపీ సర్కార్
-మన వాటా మనకు దక్కితే కరెంటు కోతలే ఉండవ్!
-ప్రభుత్వ దృష్టి కి తీసుకెళ్లనున్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ

ఉమ్మడిగా ఉన్నన్నాళ్లు అధికారాన్ని చేతుల్లో పెట్టుకుని తెలంగాణ వనరులను దోచుకున్న సీమాంధ్ర పాలకులు రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా అదే పని చేస్తున్నారు. స్పష్టంగా ఒప్పందాలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ తెలంగాణకు ప్రతీ రోజు దక్కాల్సిన 17.1 మిలియన్ యూనిట్ల విద్యుత్తును దక్కకుండా చేసి, దానిని సీమాంధ్రకు మళ్లించుకుంటున్నారు. విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొరత ఉంది. ఫలితంగా విద్యుత్తు కోతలు పెరిగిపోయి ఇటు రైతాంగం, అటు సాధారణ జనం విలవిల్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయంగా రావాల్సిన విద్యుత్తు వస్తే తెలంగాణలో విద్యుత్తు కోతలే ఉండవని నిపుణులు చెబుతున్నారు. 

అంచనాల్లో తప్పులు

ఉమ్మడి రాష్ట్రం ఉన్నపుడు అనంతపురం, కర్నూలు జిల్లాలు తెలంగాణలోని ఏపీసీపీడీసీఎల్ పస్తుతం టీజీఎస్‌పీడీసీఎల్)లో భాగంగా ఉండేవి. రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ రెండు జిల్లాలను సీమాంధ్రలో కలిపారు. దాంతోపాటు టీజీఎస్‌పీడీసీఎల్ నుంచి రెండు జిల్లాలను ఏపీఎస్‌పీడీసీఎల్‌లో భాగంగా చేశారు. ఆ సమయంలో 2009-13 సంవత్సరాల మధ్య రెండు జిల్లాలు వినియోగించుకున్న విద్యుత్తు ప్రాతిపదికన రెండు జిల్లాలకు కలిపి 8.037శాతం విద్యుత్తు వినియోగం ఉంటుందని అంచనా వేశారు. అయితే, ఈ అంచనాలు తప్పుగా ఉండటంతో ప్రతీ రోజు తెలంగాణ 2.14శాతం మేర విద్యుత్తును నష్టపోతున్నది. ఈ లెక్కన ప్రతీ సంవత్సరం తెలంగాణ నష్టపోయే విద్యుత్తు 1,926 మిలియన్ యూనిట్లు ఉంటుందని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. 

తెలంగాణతో ఒప్పందాలున్నా…

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉన్న 600 మెగావాట్ల సామర్థ్యంగల సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు అన్నీ తెలంగాణతో ఉన్నాయి. విభజన చట్టంలో గతంలో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు భవిష్యత్తులో అలాగే కొనసాగుతాయని స్పష్టంగా ఉంది. అయినా, ఏపీ ప్రభుత్వం ఈ ఒప్పందాలను బేఖాతరు చేస్తోంది. రెండు జిల్లాల్లోని సంప్రదాయేతర వనరుల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును సీమాంధ్రకు మళ్లించుకుంటోంది. దీంతో తెలంగాణ ప్రతీ రోజు 4 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కోల్పోతున్నది. 

కృష్ణపట్నం…

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో 800 మెగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టు దాదాపుగా పూర్తి కావచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నుంచి 200 మెగావాట్ల అస్థిర విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. కొనుగోలు ఒప్పందం ప్రకారం దీంట్లో 110 మెగావాట్లు తెలంగాణకు రావా లి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మొత్తం విద్యుత్తును ఆ ప్రాంతంలోనే వినియోగించుకుంటోంది. నిజానికి దేశవ్యాప్తంగా ఏ ప్రాజెక్టు నుంచి అస్థిర విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నా కొనుగోలు ఒప్పందాల ప్రకారం ఆయా రాష్ర్టాలు పంచుకుంటాయి. దీనికి నిదర్శనంగా తమిళనాడు రాష్ట్రంలోని కూడంకుళం ప్రాజెక్టును పేర్కొనవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అవుతున్న అస్థిర విద్యుత్తును తమిళనాడుతోపాటు కేరళ, కర్ణాటక పంచుకుంటున్నాయి. అయినా, కృష్ణపట్నం నుంచి న్యాయంగా రావాల్సిన విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ ఇవ్వకపోతుండటం వల్ల తెలంగాణ 110 మెగావాట్ల విద్యుత్తును కోల్పోతున్నది.

అప్పర్, లోయర్ సీలేరు…డొంకరాయి…

అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు, డొంకరాయి ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం ప్రతీ రోజు 400 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. కుదిరిన ఒప్పందాల ప్రకారం దీంట్లో తెలంగాణ వాటా 215 మెగావాట్లు. అయితే, జల విద్యుత్తును ఇవ్వాల్సిన అవసరం లేదం టూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్తును కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే వినియోగించుకుంటోంది. దీంతో తెలంగాణ ప్రతీ రోజు 215 మెగావాట్ల విద్యుత్తును నష్టపోతోంది. తెలంగాణలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును సైతం ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. 

ఏకపక్ష నిర్ణయంతో…

రాష్ట్ర విభజనకు ముందు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ తెలంగాణ ప్రాంతంలో 400 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టటానికి ముందుకు వచ్చింది. దానికి అప్పటి ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది. తెలంగాణ ఏర్పడగానే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఎలాంటి కారణం చూపించకుండా ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు మారుస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ 400 మెగావాట్ల విద్యుత్తును కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవల ఎన్‌టీపీసీ సంస్థ గజ్జర్ నుంచి కేటాయించిన విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్‌కు 177 మెగావాట్లు, తెలంగాణకు 100 మెగావాట్లు ఇచ్చింది. నిజానికి గత సంవత్సరం తెలంగాణ వాటా 180 మెగావాట్లుగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌కు వంద మెగావాట్లుగా ఉంది. దీనిని తారుమారు చేయటంతో తెలంగాణ 80మెగావాట్ల విద్యుత్తును నష్టపోయింది. ఇలా నాలుగు మార్గాల ద్వారా తెలంగాణకు రావాల్సిన విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగరేసుకుపోవటంతో రోజుకు 17.1 మిలియన్ యూనిట్ల విద్యుత్తును తెలంగాణ రాష్ట్రం నష్టపోతోంది. 

కోతలు ఉండకపోయేవి…

ప్రస్తుతం రోజుకు 16 మిలియన్ యూనిట్ల లోటు ఉండటంతో తెలంగాణవ్యాప్తంగా అధికారులు కోతలు విధించిన విషయం తెలిసిందే. ఇటీవలి వరకు హైదరాబాద్‌లో మూడు గంటలపాటు విద్యుత్తు కోత ఉంటే ఇప్పుడు దానిని నాలుగు గంటలకు పెంచారు. ఇక, పల్లెల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. తెలంగాణకు రోజుకు రావాల్సిన 17.1మిలియన్ యూనిట్ల విద్యుత్తు వస్తే కోతలే ఉండవని అధికారులు చెబుతున్నారు. 

ప్రభుత్వ దృష్టి కి…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుట్రల కారణంగా తెలంగాణ నష్టపోతున్న విద్యుత్తుకు సంబంధించి నివేదికను తయారు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మకు అందచేయనున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కో-ఆర్డినేటర్ రఘు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మన రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన విద్యుత్తు వచ్చేట్టు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

11,279 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>