Home / తెలుగు / భూమిని ముట్టుకో, ప్రళయమే! – ఎన్ వేణుగోపాల్
ayyappa society

భూమిని ముట్టుకో, ప్రళయమే! – ఎన్ వేణుగోపాల్

భూమితో మాట్లాడు, జ్ఞానమిస్తుంది’ అని బైబిల్‌లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఆధ్యాత్మిక అర్థం మాట ఎలా ఉన్నా అది గొప్ప మాట. అది ‘భూమి నాదియనిన భూమి పక్కున నవ్వు’ అని మన వేమన అన్న కాలానికి చాల ముందరి మాట. ఆ రెండు మాటలూ గడిచి ఇవాళ ‘భూమిని ముట్టుకో, ప్రళయమే’ అనే దగ్గరికి చేరినట్టున్నాం. భూమి నాది అనుకోగూడదన్న వేమనను దాటి సమాజం చాల “పురోగమించింది” గదా. భూమి నాదీ అనుకోవచ్చు, ఇతరులదని అనుకున్నా దాన్ని దురాక్రమించుకోవచ్చు. దురాక్రమణను అడ్డుకుంటామని ఎవరన్నా అంటే వారిని భూమిమీద లేకుండానూ చేయవచ్చు.

భూసంస్కరణలు అమలు జరుపుతానన్న నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని పడగొట్టడం దాకా, దున్నేవారికే భూమిని పంచాలన్న విప్లవకారులను కాల్చిచంపడం దాకా పోనక్కరలేదు. ప్రభుత్వానికీ విప్లవకారులకూ మొదలైన చరిత్రాత్మక చర్చలలో అక్రమంగా అన్యాక్రాంతమైన భూమి ప్రస్తావన రాగానే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి ఆ ప్రస్తావనను “అడ్డగోలు మాటలు”గా అభివర్ణించి, చర్చలకు ముగింపు పలికి నెత్తురుటేర్లు పారించిన చరిత్ర దగ్గరికీ పోనక్కరలేదు.

ఇవాళ్టికివాళ జరిగిన, జరుగుతున్న సంగతే చూద్దాం. అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూమిలో కొన్ని ఎకరాల భూమిని, వందలాది ఉదంతాలలో రెండు మూడు ఉదంతాలను ముట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందో లేదో పొరుగురాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి కుట్రలు ప్రారంభించింది. రాత్రికి రాత్రి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైదరాబాదు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని కత్తిరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో మాటల్లో చెప్పాలంటే హైదరాబాదును దాదాపుగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్రకు తెర లేపింది. అంటే ఇవాళ్టి మాట ‘భూమిని ముట్టుకో, కుట్రలూ, కుతంత్రాలూ’ అన్నమాట!

అయితే ఈ పని ఇంత నేరుగా, కళ్లకు కట్టినట్టుగా, అందరికీ తెలిసేట్టుగా జరగలేదు గనుక వివరంగా చెప్పుకోవలసి ఉంది.

కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 6న ఒక సర్క్యులర్ పంపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని సెక్షన్ 8 కింద గవర్నర్ కు సంక్రమించిన అధికారాలను వివరించడం కోసం విడుదల చేసినట్టుగా చెప్పుకుంటున్న ఆ సర్క్యులర్ తెలంగాణకూ, చట్టానికీ, సహజన్యాయానికీ వ్యతిరేకమైన భయానకమైన ఎత్తుగడ. అసలు మొదట ఆ చట్టం బిల్లు రూపంలో ఉన్నప్పుడే ఆ సెక్షన్‌కు ప్రమాదకరమైన పర్యవసానాలు ఉంటాయని, అది చట్టపరంగానూ, న్యాయపరంగానూ చెల్లదని, దాన్ని సవరించాలని నాతో సహా ఎంతోమందిమి వ్యాఖ్యానించాం.

ముసాయిదా బిల్లును అప్పటి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 2013 డిసెంబర్ 4 మర్నాడే నేను, “కొత్త రాష్ట్ర రాజధాని ఏర్పాటయ్యేవరకూ పాత రాజధానిలో ఉండడం వేరు. ఉండవలసి రావచ్చు. కాని దానికి ఉమ్మడి రాజధాని అనే పేరు అవసరం లేదు. అది కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వపు తాత్కాలిక భవనాలకు పరిమితం కావచ్చు. మొత్తం నగరాన్నంతా చాపచుట్టిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి అవసరం లేదు. పైగా ‘ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజలందరి భద్రత, స్వేచ్ఛ, ఆస్తులకు సంబంధించి గవర్నర్ ప్రత్యేక బాధ్యతలను కలిగి ఉంటారు. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల భద్రత గవర్నర్ బాధ్యత’ అని అనడమంటే ఇకనుంచి దేశంలో ఒక రాష్ట్ర రాజధానిలో నివాసం ఉండే ఇతర రాష్ట్రాల వారందరికీ శాశ్వత ప్రమాదాన్ని తెచ్చిపెట్టడమే. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కొల్లగొట్టడమే. కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన అధికారాన్ని కైవసం చేసుకోవడమే. మాటవరుసకు ‘గవర్నర్ తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు’ అని ఉన్నప్పటికీ, దాని తర్వాత వాక్యమే ‘అంతిమ నిర్ణయం గవర్నర్‌దే’ అని ముసాయిదా అంటున్నది గనుక హైదరాబాద్ గవర్నర్ చేతుల్లో, అంటే కేంద్రం చేతుల్లో ఉండబోతున్నదన్నమాట. అంటే పేరుపెట్టకుండానే కేంద్ర పాలిత ప్రాంతం కాబోతున్నదన్నమాట” అని రాశాను.

ఆ ముసాయిదా ఏ మార్పులూ లేకుండానే ఫిబ్రవరిలో చట్టం కూడ అయిపోయి, రాష్ట్ర విభజన కూడ జరిగిపోయింది. సెక్షన్ 8 ఈ గవర్నర్ అధికారాలను చట్టబద్ధం చేసింది. అసలు రెండు రాష్ట్రాలకు ఒక ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్, ఆ గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఏ అవసరం వల్ల వచ్చాయి? అదే అసంగతమైనదంటే, దేశంలో ఎక్కడా లేనట్టుగా రాజధాని ప్రజల, ఆస్తుల భద్రత బాధ్యత గవర్నర్‌కు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? ఏ రాష్ట్ర రాజధానిలోనైనా మరొక రాష్ట్ర ప్రజలు లేరా, హైదరాబాదులో మాత్రమే ఇతర రాష్ట్ర ప్రజల భద్రత, స్వేచ్ఛ, ఆస్తుల రక్షణ గవర్నర్‌కు ప్రత్యేకంగా ఎందుకు కట్టబెట్టవలసి వచ్చింది?

ఆ ప్రశ్నలకు జవాబులు కావాలంటే కాస్త చరిత్ర లోకి, హైదరాబాద్ ప్రత్యేకతలోకి, హైదరాబాద్ భూముల అక్రమ కబ్జాల చరిత్రలోకి వెళ్లాలి. ఏ రాజరికమైనా తాను పాలించే దేశంలోని భూమి అంతా తనదే అనుకుంటుంది గాని అసఫ్ జాహి పాలకులు ప్రత్యేకంగా తమ రాజ్యంలోని పదోవంతు భూభాగాన్ని తమ సొంత భూమి (సర్ఫ్ ఎ ఖాస్ – సొంత సాదర ఖర్చుల భూమి) గా ప్రకటించుకున్నారు. దాదాపు ఐదు కోట్ల ఎకరాల హైదరాబాద్ రాజ్యంలో యాభై లక్షల ఎకరాలు ఇలా సర్ఫ్ ఎ ఖాస్ గా ఉండేది. ఈ భూమి చాల ఎక్కువగా ఔరంగాబాద్, భీడ్, పర్భని, బీదర్, గుల్బర్గా, ఉస్మానాబాద్ జిల్లాలలో వ్యాపించిన పదకొండు తాలూకాల లోను, అత్రఫ్ బల్దా జిల్లా మొత్తంలోని ఏడు తాలూకాల్లోను ఉండేది. మరో మాటల్లో చెప్పాలంటే రాజ్యం మొత్తంలో 1961 గ్రామాల్లో విస్తరించిన సర్ఫ్ ఎ ఖాస్ భూమిలో 593 గ్రామాలు అత్రఫ్ బల్దా జిల్లాలోనే ఉండేవి. అప్పటి అత్రఫ్ బల్దా జిల్లానే ఇవాళ్టి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలుగా మారింది.

సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను ఓడించిన తర్వాత భారత ప్రభుత్వం 1949 ఫిబ్రవరి 22న ఒక ఫర్మానా ద్వారా సర్ఫ్ ఎ ఖాస్ భూముల మీద రాజు అధికారాన్ని రద్దు చేసింది. ఆగస్టులో జాగీర్లను రద్దు చేసింది. ఆ రకంగా అప్పటిదాకా రాజుకూ, జాగీర్దార్లకూ, పాయెగాలకూ, సంస్థానాలకూ, దేశముఖ్‌లకూ చెందిన భూమి అంతా హైదరాబాద్ ప్రభుత్వ భూమి అయిపోయింది. అందులో కౌలుదార్లకు, అప్పటికి సాగుచేసుకుంటున్నవారికి కొంత భాగం దక్కినా తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూమి 1949లో హైదరాబాద్ ప్రభుత్వానికీ, 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ దక్కింది. అన్యాక్రాంతం కావడానికీ సిద్ధంగా తయారయింది.

నిజానికి ఈ భూమి అటు నిజాందీ, భూస్వాములదీ కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదీ కాదు. అది ఆ భూమిలో రెక్కలు ముక్కలు చేసుకుని పొట్టపోసుకుంటున్న లక్షలాది తెలంగాణ రైతుకూలీలది. భూసంస్కరణల గురించి ఎంతో గంభీరమైన ప్రకటనలు చేసిన ప్రభుత్వాలు ఆ రైతుకూలీలకు ఎకరం భూమి ఇవ్వడానికి సిద్ధపడలేదు గాని 1956 నుంచీ కోస్తా, రాయలసీమల నుంచి వచ్చిన భూస్వాములకు లీజుల పేరుమీద, ప్రజా అవసరాల పేరుమీద కట్టబెట్టడం ప్రారంభించాయి. ప్రభుత్వానికి ఎక్కడా లేనంత భూమి ఇక్కడ ఉంది గనుక లెక్కలేనన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సైనిక స్థావరాలు, పరిశోధనా సంస్థలు వచ్చి వేలాది ఎకరాల భూములను ఆక్రమించాయి. 1980ల తర్వాత ప్రభుత్వాలు లీజు నిబంధనలను కూడ పక్కనపెట్టి కారుచౌకగా అమ్మడం, ఉచితంగా పందారం చేయడం ప్రారంభించాయి. ఆ భూముల సంతర్పణ చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి పాలనలలో గరిష్ట స్థాయికి చేరింది.

ఒకవైపు ప్రభుత్వాలు ఇలా చట్టబద్ధంగానూ, చట్టవ్యతిరేకంగానూ హైదరాబాద్ భూమిని ఆశ్రితులకు అప్పనంగా అప్పగిస్తుండగా, కోస్తా, రాయలసీమ భూస్వాములు, వ్యాపారులు, సంపన్నులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు అక్రమ కబ్జాలు కూడ ప్రారంభించారు. 1948కి ముందరి భూస్వాములలో కొందరు పాకిస్తాన్‌కు వెళ్లిపోవడం, చాలచోట్ల భూముల దస్తావేజులు సక్రమంగా లేకపోవడం, భూయాజమాన్యం వివాదాస్పదం కావడం, ఉమ్మడి భూములను, లావారిస్ భూములను బలప్రయోగంతో, అధికారం అండతో ఆక్రమించుకోవడం వంటి అనేక కారణాలు కలిసి హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో అపారమైన భూమి అక్రమంగా అన్యాక్రాంతమైపోయింది. ఇవాళ మూడు లక్షల ఎకరాలలో విస్తరించిన హైదరాబాదులో కనీసం ముప్పైవేల ఎకరాలు, పద్దెనిమిది లక్షల ఎకరాల రంగారెడ్డి జిల్లాలో కనీసం లక్ష ఎకరాలు ఇలా అక్రమ కబ్జాలో ఉండవచ్చు. ఈ అక్రమ కబ్జాదారులలో తెలంగాణవారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు కొందరు ఉండవచ్చు గాని తొంబై శాతం కోస్తా, రాయలసీమ సంపన్నులు, రాజకీయ నాయకులు, కంట్రాక్టర్లు, వ్యాపారులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడవద్దని, ఏర్పడినా హైదరాబాద్ మీద తమ పట్టు పోకుండా ఉండాలని కోరుకున్నది వారే. ఇక తెలంగాణ ఏర్పడక తప్పదని తేలినప్పుడు బిల్లు తయారీలో కుట్రలకూ కుహకాలకూ పూనుకుని హైదరాబాదును ఉమ్మడి రాజధాని చేయించి, గవర్నర్‌కు అదనపు అధికారాలు కట్టబెట్టేలా చేసిందీ వారే. ఇది కోస్తా, రాయలసీమ సాధారణ ప్రజలకు సంబంధించిన వ్యవహారం కూడ కాదు. కేవలం కొన్ని వందల మంది, లేదా వేల మంది కోస్తా, రాయలసీమ అక్రమ కబ్జాదారుల, భూబకాసురుల వ్యవహారం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఆ భూబకాసురులందరి పని పట్టలేకపోవచ్చు. అన్యాక్రాంతమైన భూమినంతా వెనక్కి తీసుకోలేకపోవచ్చు. కాని ప్రతీకాత్మకంగానైనా అక్రమ కబ్జాలలో రెండు మూడు సంఘటనలు తీసుకుని భూమి వెనక్కి తీసుకునే ప్రయోగ ప్రయత్నం ప్రారంభించింది. అలా భూమిని ముట్టుకోగానే ప్రళయం ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ మీద స్పందించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆఘమేఘాలమీద సర్క్యులర్ జారీ చేసింది. నిజానికి సెక్షన్ 8 ఇచ్చే అధికారాలను కూడ అతిక్రమిస్తూ విడుదలయిన సర్క్యులర్ అది.

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మీద గవర్నర్ అధికారాలను వివరిస్తున్నామనే పేరుతో, గవర్నర్ కు అదనపు అధికారాలను కట్టబెట్టడం, ఉమ్మడి రాజధానిగా గవర్నర్ అధికార పరిధిని రంగారెడ్డి జిల్లా ప్రాంతాలకు కూడ విస్తరించాలనడం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట నిబంధనలను కూడ అతిక్రమించడమే. అంటే ఈ సర్క్యులర్ చట్టవ్యతిరేకం. అక్రమంగా ఆక్రమించిన భూములను వెనక్కి తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే, ఆ అక్రమ ఆస్తుల పరిరక్షణ గవర్నర్ బాధ్యత అనడం, అందుకోసం ప్రభుత్వమూ, ప్రతి మంత్రీ, ప్రతి పోలీస్ స్టేషనూ తమ రోజువారీ పనిని గవర్నర్‌కు నివేదించాలనడం హాస్యాస్పదం, అర్థరహితం, అప్రజాస్వామికం, భారత రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. కేంద్రప్రభుత్వపు ఈ దుర్మార్గమైన చర్యను అన్ని రూపాలలో ప్రతిఘటించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ సమాజం ముందు ఉన్న తక్షణ, ప్రధాన కర్తవ్యం.

[ఆంధ్రప్రభ] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

11,385 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>