Home / TG History / Arts & Literature / పోలిక… Story of a Daughter – అల్లం వంశీ
3605161_blog

పోలిక… Story of a Daughter – అల్లం వంశీ

“ఈ పెళ్లి నాకస్సలు ఇష్టంలేదు”..
దయచేసి నన్ను బలవంతపెట్టి ఈ పెళ్లికి ఒప్పించకండి నాన్న… అని నిర్మొహమాటంగా చెప్పేసి తనగదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది ఆదితి..

తమ మాటను కొంచంకూడ లెక్కచేయకుండ నిర్లక్ష్యంగ లోపలికి వెల్లిన కూతురిని చూసి నోట మాట పెగల్లేదు కరుణ, అశోక్ ల కు.. ఇద్దరికీ కళ్ల్లలో గిర్రున నీళ్లు తిరిగాయి..

తను ఇదివరకెప్పుడు ఇలా ప్రవర్తించలేదు తమతో, కాని ఈ పెళ్లి సంబంధం చూసినప్పటినుండే ఇలా కొత్తగా ప్రవర్తిస్తుంది.. ఈ సంబంధం కుదర్చడానికి అశోక్ ఎంత శ్రమపడ్డాడో అతనికొక్కనికే తెలుసు, తమ తాహతుకు మించిన సంబంధమే అయినా ఒక్కగానొక్క కూతురుకదాని అన్ని కష్టనష్టాలకోర్చి ఈ సంబంధం ఖాయం అయ్యేల చేసుకోగలిగాడు.. కాని ఈ పెళ్లి ప్రస్తావన తేగానే అసహనంతోనే సమాధానమిచ్చి లేచి గదిలోకివెళ్ళి తలుపులు మూసుకుంటుంది అదితి.. రోజు రోజు కి ఆమెలో చికాకు, కోపం పెరిగిపోతున్నయ్.. దానికి కారణమేమయ్యుంటుందో వాళ్లకు అంతుబట్టడంలేదు.. పోని ఎవరినైన ప్రేమించిందేమో అనుకుంటే అలాంటిదేమిలేదనే చెప్తుంది.. ఆ తల్లిదండ్రుల ఆలోచనలు పరిపరివిధాలుగ సాగుతున్నయ్..

తన అంతరంగాన్నితల్లిదండ్రులే అర్థంచేసుకోకపోవడం అదితి కి మరింత బాధ కలిగిస్తుంది.. ఆమె కోపం వెనుక ఉన్నది బాధ అని, తను బాధపడ్తున్నది కూడ తన తల్లిదండ్రులకోసమే అన్నది ఆమెకుతప్ప మరెవరికి తెలియని నిజం..

***************************************
వాళ్లది మద్యతరగతి కుటుంబం. అశోక్ కి వచ్చే జీతంతో ఇంటిని నడపడంతోపాటు కూతురిని పెద్దచదువులు చదివించడమంటే అది ఖచ్చితంగా అతని తాహతుకు మించినపనే, కాని తనెప్పుడు డబ్బులు ఒక సమస్య అన్నట్టుగా ప్రవర్తించలేదు, అదితి చదువులకి వేలకివేలు ఖర్చు అయినా ఒక్కగానొక్క కూతురు కదాని ఇష్టంగానే తను కోరుకున్నంత వరకి చదివించారు.

ఇంకా చెప్పాలంటె తన యేఒక్క కోరికనికూడా యేనాడూ కాదనలేదు అమ్మానాన్న. అలా చదివించడంకోసం, తన సుఖవంతమైన జీవితం కోసం వాల్లెన్నిటిని వదులుకున్నరో యెన్నిటిని ఓర్చుకున్నరో తనకొక్కదానికే తెలుసు… ఆలోచిస్తుంటే ఙ్ఞాపకాలన్ని ఒక్కొక్కటిగా కళ్లముందుకదులుతున్నయ్..

అదితి పుట్టక ముందు అమ్మానాన్నల జీవితం ఎలా ఉండెనో తనకు తెలీదు కాని, తనుపుట్టినప్పటి నుండి ఈరోజువరకు ఏ ఒక్క నాడు కూడా వాళ్ళు సరదాలు, విలాసాలజోలికిపోయినట్టు అనిపించదు, హంగులు ఆర్భాటాలు లేని అతి సాధారణ జీవితం వాళ్లది..

నేను పుట్టడం మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టినా, నాకెప్పుడు ఏ లోటురానివ్వలేదువాళ్లు. ఒకవిధంగా చెప్పాలంటే నేను ధనవంతురాలిలాగానే పెరిగాననుకోవాలి. కాని అమ్మానాన్నలు మాత్రం మొదటినుండి ఒకేలాగ ఉన్నారు, వారిలో ఏ మార్పూలేదు..

నాకింకా గుర్తు నాన్న పొదుపు. తన చిన్నప్పటినుండి చూస్తుంది ఇంట్లో ఒక పాత మోడల్ స్కూటర్ ను, ఇన్నేళ్లయినా అది అమ్మేసి నాన్న కొత్త బైక్ కొనుక్కోలేదు, వాళ్ల స్నేహితుల్లో చాలమంది కొత్త బైక్లు, ఇంకొందరు కార్లు కూడ కొనుక్కున్నారు, ఇక సొంత ఇండ్ల సంగతి చెప్పనక్కరలేదు..
వాళ్లెపుడైనా ఇంటికివచ్చినప్పుడు ఎన్ని మాటలనేవారు నాన్నని!! నీకసలు బతకడం తెలీదురా అశోక్, అంత పిసినారితనం పనికిరాదు అంటు హేళనచేస్తూ వెకిలినవ్వులు నవ్వేవాళ్లు, కాని నాన్న చిరునవ్వే వాళ్లకు సమాధానంగా ఉండేది.
తన స్నేహితుల్లో చాలామందికి ఉన్నట్లుగా నాన్నకు ఏ ఒక్క దుర్వ్యసనమూలేదు. తనకి వచ్చే జీతంతో ఇవన్నీ సమకూర్చుకోవడం కూడా నిజానికి పెద్ద సమస్యకాదేమో, కాని నాన్న అలా చేయలేదు..
తను కొత్త బండి కొనుక్కోవల్సిన డబ్బుతో నా కాలేజి ఫీజు కట్టారన్న నిజం నాకు తెలియనిదికాదు. అందుకేనేమో ఎవరు ఎన్నిమాటలన్నా నాన్న చిరునవ్వే వాళ్లకు సమాదానం. ఆ నవ్వు వెనక “నేను నాకోసం కాకుండా నా కూతురికోసం” ఆ డబ్బులు ఖర్చుపెట్టాను అన్న తృప్తి, సంతోషం నాన్న మొఖంలో ఉండేదప్పుడు..

నువ్వు కాలేజికి వెళ్లే అమ్మాయివి, నీకు మంచిబట్టలుండాలి, హుందాగా కనపడాలి అంటూ ప్రతి పండక్కి, అడపాదడపా ప్రతీ నెలా నాకోసం బట్టలు కొనే నాన్నకు తన బట్టలమీద మాత్రం అస్సలు పట్టింపు ఉండదు.. ఇంతవరకి యే పండుగకీ, ఆఖరికి ఆయన తన పుట్టినరోజునాడయినా కొత్తబట్టలు కొనుకున్నట్టు తనకి గుర్తులేదు. ఖచ్చితంగా కొనుక్కోవల్సిన సంధర్భంవస్తేతప్ప నాన్న యెప్పుడు ఒక్క జత బట్టలో, చెప్పులో తనకు ఇవి కావాలి అని అసలు ఏదీ కొనుక్కోలేదు..

అసలు “సొంత” ఖర్చు అనేదే ఉండదు ఆయనకు. అప్పుడప్పుడు నేనో లేక అమ్మనో మీకోసం కొత్తబట్టలు తీస్కొండి అంటే మగవాన్ని నాకెందుకే ఈ సోకులన్నీ, అయినా నా అందం నా బట్టల్లో కాదే వ్యక్తిత్వంలో కనిపిస్తుందే పిచ్చిమొఖాలు అంటు నవ్వేసేవాడు.. అవును, నిజంగా ఎంత హుందా అయిన వ్యక్తిత్వం నాన్నది!

ఒక్కో ఙ్ఞాపకం నాన్నని ఎంతగా గుర్తుచేస్తుందో..
వందరూపాయలకోసం ఈ వయసులో కూడా దాదాపు ప్రతిరోజు ఆఫీసులో ఓ.టి (ఓవర్ టైం)చేస్తారు నాన్న.. ఆయనొక నిరంతర శ్రామికుడు.. ఎన్నిచేసారు పాపం తను నాకోసం.. తన సంపాదనలో ప్రతి ఒక్క పైసా నా చదువుకనో మరేదైన అవసరాలకనో ఖర్చుపెట్టడం, లేదంటే పెళ్ళికోసమని బ్యాంకులో దాచిపెట్టడం.. ఇంతే నాన్నకు తెల్సింది ..

నిజమైన నిస్వార్థ ప్రేమికుడు నాన్న…

అదితి కన్నీళ్లు ఆగడంలేదు..

ఇక అసలు అమ్మ సంగతి చెప్పనే అక్కరలేదు, అమ్మ ప్రతిక్షణం నాకోసమే ఆరాటపడ్తుంది. నాకోసమే పుట్టిన మనిషి తను.. నా ప్రతి ఒక్క అవసరం ఆమెకే తెలుసు. నాకు ఏది ఇష్టమో ఏది ఇష్టంలేదో తనకి తెలిసినట్టు ఇంకెవరికి తెలీదేమో..

నాకు ఏచిన్న కష్టమొచ్చినా తను విలవిలలాడిపోతుంది పాపం, ఎన్నిసార్లు నాకు దెబ్బతాకితే అమ్మ ఏడవలేదు! నాకు చిన్నదెబ్బతగిలినా ఆ నొప్పి అమ్మకే తెలుస్తుందేమో.. నాకెప్పుడైన జ్వరమొస్తే అది తగ్గేదాక అమ్మకు కంటిమీద కునుకు ఉండకపొయ్యేది. తన చిట్టి తల్లి కి జ్వరం త్వరగా తగ్గిపోవాలని, అది నవ్వుతు ఎప్పటిలాగా ఇల్లంతా సందడిచేయాలని ఎన్నివేలదేవుళ్లకు మొక్కుకుని ఎన్నెన్ని రోజులు ఉపవాసాలు ఉండేదో అమ్మ..

చిన్నప్పుడు నేను అల్లరిపనులు చేసొచ్చినప్పుడు పక్కింటివాళ్లు మీ అమ్మాయి అల్లరిపిల్ల అంటు చాడీలు చెప్పుకొస్తే ఎన్నిసార్లు నన్నువెనకేసుకొచ్చి వాళ్లతో గొడవపడలేదు..! పాపం పిచ్చి అమ్మ.. నేనేది చేసిన తనకి అందంగానే కనిపిస్తుంది. నేనొక “అద్భుతాన్ని” మా అమ్మకి. ప్రపంచంలో ఎవరు అందరికన్న గొప్ప అంటే నిస్సంకోచంగా మా చిట్టి అదితి నే అందరికన్న చాలా చాలా గొప్ప అంటుంది తను, ఎవరైనా కాదని అంటే వాళ్ళతో వాదించి గెలుస్తుంది కూడ..

అమ్మకసలు విశ్రాంతి అంటేనే తెలిదేమో. నా పరీక్షలప్పుడు నేను రాత్రంతా చదువుతూ ఉంటే, ఒక్కదాన్నే భయపడ్తానేమో అని తను కూడ నిద్రమేల్కొని నా పక్కనే ఉండేది. పాపం పొద్దుట్నుండి ఇంటిపని వంటపని అన్నిచేసుకుంటూఎంతగానో అలిసిపోయి ఉండే అమ్మ నాకోసం రాత్రంతా మెలకువతోనే ఉండి టీ చేసిస్తూ ఉండేది, నేను టెన్షన్ పడుతున్నా, భయపడుతున్నా, బాధలో ఉన్నా ఆ విషయం నేను చెప్పకపోయినా తనకి తెలిసిపోతుంది.. అప్పుడు తన ఒళ్లో నన్నుపడుకోబెట్టుకుని ధైర్యంచెప్పేది అమ్మ. అయినంతవరకే చదువుకోరా, నీకెన్ని మార్కులొచ్చినా మాకు సంతోషమే, ఎక్కువా తక్కువా అన్నవిషయం మేమెప్పుడు ఆలొచించమమ్మా అంటు దగ్గరికి తీసుకునేది, ఎంత మధురమైన క్షణాలవి.. పరిక్షలే జీవితంకాదు అని చెప్పేది, నిదానంగా చదుకో నాన్న నేనుతోడుంటా ఎంతసేపయినా అంటు తను రాత్రంతా మెలకువగా ఉంటుంటే నేను ధైర్యంగా చదువుకునేదాన్ని.. ఇవ్వాళ నేనిన్ని చదువులు చదవగలిగాను అంటే నాన్న ప్రోత్సాహం, అమ్మ ఇచ్చిన ధైర్యమేకదా కారణం..

అప్పుడప్పుడు నేను బయటినుండి వచ్చినపుడు కోపంలోనో చిరాకులోనో అమ్మ మీదకు అరిచినా ప్రేమతో దగ్గరికి తీసుకుని లాలించిందే తప్ప, కోపంతో ఒక్కనాడుకూడా నన్ను దండించని కరుణామయి మా అమ్మ.
నాన్నకు లాగానే అమ్మకి కూడా “సొంతం” అంటూ ఏది ఉండకపోయేది..

అసలు వాళ్ల జీవితంలో “నా” అన్న ప్రసక్తే ఎప్పుడురాలేదేమో, వాళ్ళకు “నా” అంటే అదితి అంతే..

అందరు ఆడవాళ్లకి ఉన్నట్టుగానే అమ్మకు కూడ చీరలు నగలు అంటే మోజు ఉండేదికావొచ్చు, కాని నేను ఇప్పటివరకు అమ్మ ఎప్పుడూ నాన్నని ఒక పట్టుచీరకొనండనో ఒక నగ చేపించండనో అడిగినట్టు చూడలేదు.. తనదగ్గర ఉన్న ప్రతి ఒక్క పైసా నాకే ఇచ్చేది నీకే ఏమైన అవసరం ఉంటుందే అని, వద్దమ్మా అంటే ఇంట్లో ఉండేదాన్నినాకేమవసరం అంటూ బలవంతంగా అయినా ఆ డబ్బులు నా చేతుల్లోకుక్కేది.. ఇంతవరకూ నాకోసమే తప్ప తనకోసం యెప్పుడూ నాన్నని యేది అడగలేదు అమ్మ.. అప్పుడప్పుడు అమ్మని కూడ కొనుక్కొమ్మని నేను అడిగేదాన్ని కాని నాకెందుకే నా బంగారుతల్లి పెట్టుకుంటేనె నాకు సంతోషం రా అని నవ్వుతూ చెప్పేది అమ్మ.

తన నిర్మలమైన మొఖంలో ఎప్పుడు కూడ అసంతృప్తిని చూడలేదు నేను.. ఎంత నిండైన మనిషి మా అమ్మ..

నా ప్రతీ ఙ్ఞాపకంలోను అమ్మానాన్నలే..

“వాళ్లని వాళ్లు మర్చిపొయ్యి మొత్తంగా “నేన”యిపోయారు”.. వాళ్ల ప్రతి ఆశ నా మీదనే , ప్రతి ఆలోచన నా భవిష్యత్ గురించే. దేవుడు మనకు ప్రత్యక్షంగా కనపడకుండా అమ్మ నాన్నల రూపంలో నిరంతరం మనతోనే ఉంటాడట.. ఈ మాటలు ముమ్మాటికి నిజం..

వాళ్ల ప్రతి ఉచ్వాస నిచ్వాసల్లో నేనే నిండిపోయానని తెలుసు.. ఆలోచిస్తున్నకొద్దీ గుండెలు పిండేసినట్లుగా బాధ ఎక్కువకాసాగింది అదితికి..

చిన్నప్పటినుండి ఇప్పటివరకు నాకు అన్నీ వాళ్లే అయ్యారు, ఇప్పుడు పెళ్లిచేసి అత్తగారింటికి పంపాల్సిన సమయం రాగానే నాకు మంచి సంపాదనాపరుడు భర్తగా దొరకాలని, అతడికి మంచి ఉద్యోగము-ఇల్లు వసతి ఉండాలని వాళ్లు కోరుకుంటున్నరు..

వాళ్ల ఆలోచనలోని ఆంతర్యం నాకు తెలియనిదికాదు. చాలీచాలని సంపాదనతో వాళ్లు అనుభవించిన కష్టాలు నాకు రావొద్దనీ, తాము జీవితంలో అనుభవించని సుఖసంతోషాలను తమ బిడ్డ అయిన అనుభవించాలనీ , మంచి వసతి-ఆదాయం ఉన్న కుటుంబానికి నన్ను కోడలుగా పంపిస్తే నేను ఏ లోటూ లేకుండా సుఖంగా ఉంటానని వాళ్ల ఆశ. విదేశి సంబందం విషయంలో అయితే అత్తింటిపోరు కూడా ఉండదని అమ్మానాన్నల నమ్మకం…అందుకే కేవలం నా సుఖం కోసమే ఈ సంబంధం చూసారువాళ్లు…

**************************************************
అతనిపేరు చందూ. అమెరికాలో ఇంజనీరు , అక్కడే చదువు పూర్తిచేసుకుని మంచి ఉద్యగంలో సెటిల్ అయ్యాడు మొన్నీమధ్యనే… రెండుచేతులా సంపాదన… వాళ్ల్ల నాన్నగారు ఇక్కడ సిటిలో మంచి పేరు-పలుకుబడి ఉన్న మనిషి. వాళ్లది అర్థికంగా కూడ స్థిరత్వం ఉన్న కుటుంబం..

కరుణా, అశోక్ లకు యేయే అర్హతలున్న అల్లుడుకావాలనుకున్నారో సరిగ్గా అటువంటిసంబంధమే ఇది.. పైగా చందూ మంచి అందగాడు కూడా.. వాస్తవానికి ఇది వాళ్ల తాహతుకు మించిన సంబంధమే అయినా అదితి ఫొటో చుసి చందూ మనసు పారేసుకోవడంతో సంబంధం కుదరడం కాస్త తేలిక అయింది..

అదితి కంప్యూటర్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.. పైగా గోల్డ్ మెడలిస్ట్.. కాబట్టి అమెరికాలో తనుపనిచేసేచోటే ఏదొ ఒక ఉద్యోగంలోకి ఆమెని రిక్రూట్ చేసుకోవడం అతడికి తేలిక,పైగా ఇద్దరు ఒకేచోట కలిసిపనిచేస్తూ హాయిగా ఆనందంగా సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో కట్నం కూడ పెద్దగా ఆశించకుండా పెళ్లికి ఒప్పుకున్నాడతను.

అబ్బాయి ఒప్పుకున్నాడన్న సంతోషంలో, అదితి కూడా తమ మాటకాదనదన్న భరోసాతో నిశ్చితార్థానికి యేర్పాట్లు చేసేస్కున్నారు కరుణ, అశోక్ లు .. ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి.. బంధుమిత్రులందరిని నిశ్చితార్తానికి పిలిచారు….

ఇల్లంతా సందడిగ ఉంది.. నిశ్చితార్తపు చీరకొనడానికి బయటకు షాపింగ్ కు వెళదామని అదితిని తయారుకమ్మంది కరుణ… తనకీ పెళ్లి ఇష్టంలేదని చెప్పినా వాళ్ళు వినిపించుకోక తమపని తాము చేసుకుపోతుండడంతో ఆమెలో అసహనం మరింత పెరిగింది.. అమ్మకి సమాధానం ఇవ్వకుండా టి.వి చూస్తు కూచుంది తను.. అప్పుడే అశోక్ వచ్చి ఏమ్మా తయరయ్యవా బయల్దేరుదాం అనడంతో ఆమెలో కోపం కట్టలుతెంచుకుంది..

“ఈ పెళ్లి నాకస్సలు ఇష్టంలేదు”..
దయచేసి నన్ను బలవంతపెట్టి ఈ పెళ్లికి ఒప్పించకండి నాన్న…
నిర్మొహమాటంగా చెప్పేసి తనగదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది ఆదితి..

బిడ్డ ప్రవర్తన వాళ్ళిద్దరికీ కన్నీళ్లుపెట్టించింది… ఆమెకు ఏదైన సమస్య ఉందని చెపితే తాము దానికొక పరిష్కారం ఆలొచించగలరు.. కాని అటువంటిదేంలేదంటుంది అదితి.. మరి ఎటువంటి సమస్యాలేకున్న పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడంలేదో వాళ్లకు అంతుచిక్కడంలేదు.. ఇంతమంచి సంబంధం వదులుకుంటే మళ్ళి ఇటువంటి సంబంధం దొరకదేమో అని వాళ్ల బాధ..
ఆమెకు ఎలా సర్దిచెప్పాలో, పెళ్ళికి ఎలా ఒప్పించాలో వాళ్లకు అర్థంకావడంలేదు…

****************************************************************************************
గదిబయట కరుణ అశోక్ లు ఈ పెళ్లి జరిగితే కూతురికి బంగారు భవిష్యత్ ఉంటుందని కలలుకంటుంటే, గదిలోపల అదితి అసలు ఈ పెళ్లి తర్వాత అమ్మానాన్నల భవిష్యత్ ఏమిటా ఆలోచించసాగింది..

బిడ్డనుకని ఇన్నేళ్లు కష్టపడి పెంచి, చదివించి పెద్దచేసిన అమ్మానాన్నలకోసం నేను చేసిందేమిలేదు, నా చదువుకి సరిపోయే మంచి ఉద్యోగం త్వరలోనే ఇక్కడే వస్తుంది, ఒకటీ రెండేళ్లలో ఆర్థికంగ నిలదొక్కుకోవొచ్చు, అపుడు మన తాహతుకి తగ్గ సంబంధం ఈ ఊరిలోనే చూసుకుని పెళ్ళి చేసుకుంటే ఇక జీవితాంతం అమ్మానాన్నలకు చేరువలోనే ఉండి వాళ్లకు ఏ లోటు రానివ్వకుండా చుసుకోవచ్చనేది తన ఆలోచన.

కాని ఈ ఆలోచనలు అమ్మనాన్నలకి చెప్తే చిన్న పిల్లవి నీకేమి తెలియదని నన్నే తిడతారు. నువ్వు సంతోషంగా ఉంటే మాకది చాలమ్మా మేంకూడ బాగుంటాము అంటూ నచ్చచెపుతారు.. ఎందుకంటే వాళ్లకు నా సుఖ-సంతోషకరమైన జీవితమే ముఖ్యం కనుక.

ఎంత మంచి వాళ్లు మా అమ్మానాన్నలు..ఏమిచ్చి వాళ్ల రుణంతీర్చుకోను! నిష్కల్మశము, అతి పవిత్రమైన అమ్మానాన్నల నిస్వార్థ ప్రేమ నన్ను రోజురోజుకీ వాళ్ళకి మరింత చేరువచేస్తుంది..

అదితి కళ్లలో కన్నీళ్లు ఆగడంలేదు, మనసునిండా అవే ఆలోచనలు.. ఏవేవో ప్రశ్నలు తనని తీవ్రంగా వేధిస్తున్నాయి.

నిస్వార్థప్రేమికులైన తల్లిదండ్రులను వదిలి కనిపించనంత దూరంగా విదేశాలకు వెళ్ళగలనా అన్నది ఆమె మొదటి ప్రశ్న.. దీనికి సమాధానం ఆగకుండా నిరంతరంగా ప్రవహిస్తున్న తన కన్నీళ్ళే.. వాళ్లకి దూరంగా వెళ్ళిపోవడమనే ఊహకూడా భరించలేనిదిగా ఉంది..

నా మంచికోసమే ప్రతిక్షణం ఆలోచించే అమ్మనాన్నలు వృద్ధాప్యానికి చేరువయ్యే సమయంలో వాళ్లనిలా ఒంటరిగా ఇక్కడ వదిలి కేవలం నా సుఖంకోసం పెళ్ళిపేరుతో విదేశాలకు వదిలివెళ్ళిపోవడం న్యాయమేనా?
రేపు నాన్న రిటైర్మెంట్ తర్వాత వాళ్లిద్దరే ఈ ఇంట్లో ఒంటరిగా కేవలం నా ఙ్ఞాపకాలనే నెమరువేసుకుంటూ ఇప్పటిలా సంతృప్తితో ఉండగలరా?
నేనువెళ్ళిపోతే భవిష్యత్ లో వాళ్లకి ఏదైనా అనారోగ్యంవస్తే వాళ్లని చూసుకునేదెవరు?
వాళ్ల జీవితమే నేనుగా బ్రతికిన అమ్మానాన్నలు నేను అంతదూరంవెళ్లిపోతే అసలు సంతోషంగా ఉండగలరా??

ప్రశ్నలు..
ప్రశ్నలు..

మదినిండా ఇలాంటివే ఎన్నెన్నో ప్రశ్నలు.. ప్రతి ప్రశ్నా అమ్మానాన్నల భవిష్యత్ గురించే.. వాళ్ల సంతోషం గురించే..
అన్ని ప్రశ్నలకి సమాధానం ఒక్కటే..
తన మది అంతరాల్లో ఆమెకు సమాధానం తేలికగానే దొరికింది..
తనువాళ్లని వదిలివెళ్ళడం న్యాయంకానేకాదు..అమ్మానాన్నల వృద్ధాప్యంలో వాళ్ళకు నేనే “అమ్మ”నయి తోడుండాలి. అలా వదిలివెళ్లిపోతే వాళ్ళ బిడ్డనేకాదు,అసలు నేను మనిషినేకాదు.. ఈ సంబంధం ఖాయంచేసుకోవడానికి ముందే తన తల్లిదండ్రుల గురించి, తన కెరీర్ గురించిన ఆలోచనలన్నిటిని ని చందూ కి ఈ మెయిల్ లో పంపింది తను..

చందూ చదువుకున్నవాడుకనుక తన ఆలోచనలను అర్థంచేసుకుని తన అభిప్రాయాన్ని గౌరవిస్తాడనీ, అతనే తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని వాళ్ల పేరెంట్స్ తో చెప్పి ఈ సంబంధం రద్దుచేసుకుంటాడనే ఆమె ఆశ.. కాని దాదాపు నెలరోజులైన అతనినుండి రిప్లై రాకపోయెసరికి ఆమెకు ఇక ఆ ప్రయత్నం వృధా అని అర్థమయిపోయింది..
ఒకే ఇల్లు..
గదితలుపులకి కి అటువైపు, ఇటువైపు.. రెండు పార్స్వాలు.. మనుషులు-మనసులు.. కలలు-కన్నీళ్లు..
కాకపోతే వాళ్లలో ఒక్క పోలిక.. ఆ ఇంట్లో అందరు కోరుకుంటున్నది సంతోషాన్నే..
అమ్మానాన్నలు బిడ్డ సంతోషాన్ని, బిడ్డ అమ్మానాన్నల సంతోషాన్ని.. వాళ్లందరిలో ఇదే పోలిక..

ఆఖరికి…

తను చివరి నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు తన కళ్లళ్లో కన్నీళ్లు లేవు, కేవలం ఆత్మవిశ్వాసపు జాడలు తప్ప.. రేపటి బంగారు భవిష్యత్ వెలుగులు వెన్నంటిరాగా గది తలుపులు తెరుచుకున్నాయి.
అదితి ముఖం ఇప్పుడు అత్యంత ప్రశాంతంగానూ, నిర్మలంగానూ ఉంది..
ఏం జరిగిందో అర్థంకాక కరుణ, అశోక్ లు అయోమయంగా చూస్తుండగా, అదితి అంది-
అమ్మా, నాన్నా..
“నేను మీతో మాట్లాడాలి”..

**************
తను ఆ మాట అన్నదోలేదో అప్పుడే గేట్ తెరుచుకుని లోపటికి వచ్చాడో ఆరడుగుల ఆజానుబాహుడు.. అందగాడు..
అంత షాక్ లోనూ అతన్ని తేలికగానే గుర్తుపట్టగలిగారు ఆ ముగ్గురు.. ఫొటోలొ చూసినదానికన్నా బాగున్నాడు.. అతను అమెరికానుండి వచ్చినట్టు కూడ వీళ్లకు తెలియదు, సెలవుదొరకనందున నిశ్చితార్తానికి రాకుండా నేరుగ పెళ్లికి ఓ వారం రోజులముందు వస్తాడని చెప్పారు అతని తల్లిదండ్రులు..ఇలా హఠాత్తుగ వచ్చేసరికి ఏం చేయాలో పాలుపోలెదు ముగ్గురికి..

ఇదేనా బాబు రావడం? ఒక్క ఫోన్ చేసుంటే నేనే మీదగ్గరికి వచ్చి తీసుకువచ్చేవాడినికదా.. తేరుకుని అన్నాడు అశోక్ ..
నిన్ననే ఇండియా కి వచ్చాను.. మిమ్మల్ని ఇబ్బందిపెట్టొద్దనే చెప్పకుండా వచ్చానంకుల్..

ఇంటిదగ్గర అంతాకులాసాయేనా బాబు.. కరుణ అడిగింది..

ఆ అందరు బాగున్నారాంటీ..

మంచినీళ్లు తీస్కొస్తాను అని లోపలికి వెళ్ళింది కరుణ..
అలాగే కాఫీ కూడా తెమ్మన్నాడు అశోక్..

అదితికేమో ఈ పెళ్లి ఇష్టంలేదు, అబ్బాయేమొ ఇంటికొచ్చేసాడు.. ఈ పరిస్థితిలో అసలేం మాట్లాడాలో అర్థంకావడంలేదు అశోక్ కు..
హాల్ లో కొంచంసేపు అందరు నిశ్శబ్దం..
లీవ్ ఎన్నిరోజులు దొరికింది బాబు.. ఏం మాట్లాడాలో తెలీక ఆ ప్రశ్న అడిగాడు అశోక్..
ఏ సమాధానం ఇవ్వలేదు చందూ..
ఛ ఛ అలా అడగాల్సిందిలేకుండే, అనవసరంగా అసంధర్భమైన ప్రశ్నవేసాను.. అశోక్ బాధపడ్డాడు తనలో తానే..
ఇంతలో కాఫీ తీసుకొచ్చింది కరుణ..
కాఫీ తాగుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు చందూ..
పెళ్లిచేసుకొని మళ్ళి వెళ్లిపోవడంకోసం కాదంకుల్ ఇక శాశ్వతంగా ఇక్కడే స్థిరపడిపోవాలని వచ్చేసాను…
ఆ మాటలు విన్న ముగ్గురికీ ఒక్కనిమిషం అతను ఏం చెపుతున్నాడో అర్థంకాలేదు..
అతనే మళ్లి చెప్పసాగాడు, అదితి నాకు ఒక మెయిల్ పంపింది, అందులో మీ కుటుంబం గురించి, మీ పెంపకమూ- ప్రేమానురాగాల గురించి, అలాగే తనభవిష్యత్ ప్రణాళికల గురించీ.. తన ప్రతి ఒక్క ఆలోచనని అందులో వివరంగా రాసింది…
ఆ మెయిల్ చదువుతుంటే నాకు మా అమ్మానాన్నలే గుర్తొచ్చారు..నా బాల్యం కళ్లముందు కనిపించింది.. అందులో తను మీ గురించి చెప్తే నాకు మా అమ్మనాన్నల్ని చూస్తున్నట్టే అనిపించింది.. . అదంతా చదువుతూ ఉంటే నాకన్నీళ్లు ఆగలేదు, ఎందుకంటే మా అమ్మానాన్నల గురించే తనురాసినట్టుగా ఫీల్ అయ్యాను నేను… మీరు అదితి ని పెంచినట్టుగానే మా పేరెంట్స్ నన్నూపెంచారు… కాని, అదితి మీ బాగోగుల గురించి ఆలోచించినట్టుగా నేను మా పేరెంట్స్ గురించి ఇన్నాళ్ళూ ఆలోచించలేదు… తను మెయిల్ పంపిన తర్వాతే నాలో ఆలోచనమొదలైంది…
అమెరికాలో డబ్బుసంపాదనే జీవిత ధ్యేయంకాదనిపించింది…అమ్మానాన్నలకన్నా, వారి ప్రేమకన్నా విలువైంది ఏముంటుంది ఈ ప్రపంచంలో…! అందుకే అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసేసి శాశ్వతంగా ఇండియా కు వచ్చేసానంకుల్..

తొందరపడి నిర్ణయంతీసుకోలేదుకద బాబు? మళ్లీ ఆలోచించమన్నట్టుగా అడిగాడు అశోక్ ..

లేదంకుల్ ఇది తొందరపడి తీసుకున్న నిర్ణయంకాదు.. ఎన్నోరోజులు ఆలోచించి చివరగా ఈ నిర్ణయానికొచ్చాను.. డబ్బుకన్నా మానవసంబంధాలే అత్యంత విలువైనవనిపించింది… నా చదువుకి ఇక్కడకూడా మంచి ఉద్యోగమే దొరుకుతుంది, ఆనందకరమైన జీవితంగడపాడానికి ఆ జీతం సరిపోతుంది… తన ఆలోచనని, చివరి నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాడు చందు..

అదితికి ఇదంతా కలలా ఉంది, తన చెవుల్ని తానే నమ్మలేకపోతుంది… ఇక కరుణ, అశోక్ ల సంగతి చెప్పక్కర్నేలేదు..
మళ్లి చందూనే అన్నాడు- మీ అమ్మయి నాకు నచ్చింది, తన అభిప్రాయాలు తెల్సినతర్వాత ఇంకా మనస్పూర్థిగా నచ్చింది…. తనకి కూడా నేను నచ్చితేనే పెళ్ళి… కావాలంటే ఇదే ఊర్లో ఇద్దరికి మంచి ఉద్యోగాలు దొరికినతర్వాతే పెళ్లి చేసుకుంటాం…

అతని మాటలింకా పూర్తవనేలేదు మళ్ళీ గదిలోకివెళ్లి తలుపు మూసేసుకుంది అదితి…

కాకపోతే ఈసారి సిగ్గుతో… సంతోషంతో…. సంతృప్తితో…

అతనికి కూడా తమ కుటుంబంతో పోలిక కలిసింది… అవును నిజమే.. అతనుకూడ మానవ సంబంధాలవిలువ తెలుసుకున్నాడు.. పక్కవాళ్ల సంతోషంలో తన సంతోషాన్ని వెతుకుంటున్నాడు… జాతకాలు కలవడంకంటే ఈ “పోలిక”లు కలవడమే మనుషులని దగ్గరచేస్తుంది.. పోలిక కలిసిన తర్వాత ఇక పెళ్లికి అభ్యంతరమేముంది….

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,280 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>