Home / TG History / Arts & Literature / కాలం ఖరీదు.. – అల్లం వంశీ
Screen Shot 2013-10-09 at 11.09.53 PM

కాలం ఖరీదు.. – అల్లం వంశీ

పొట్టకూటికోసం కన్న తల్లిదండ్రుల్నీ, దోస్తులనూ, సొంతూరినీ అందర్నీ వదిలేసి పట్నానికి పొయి అక్కడే స్థిరపడిన ఒకతను చాన రోజుల తర్వాత వాళ్ల అమ్మానానల్ని కలిశొద్దామని సొంతూరికి పొయిండు.

ఒక రెండురోజులు వాళ్ల ముసలి తల్లిదండ్రుల్తోని గడిపినంక మళ్ల సిటీ కి బయల్దేరడానికి సిద్దమయితుండంగ వాళ్ల నాయిన అడిగిండు-

కొడుకా నీ నెల జీతమెంతుంటదిరా?

కొడుకు- గవ్వన్ని నీకెందుకు నాయినా?

నాయిన- అయ్యో చెప్పరాదు, నీ నెల జీతమెంతుంటది?

తండ్రి అట్లడగడం కొడుక్కు కోపం తెప్పించింది.

కొడుకు- గీ వయసుల సుత నువ్వింక పైసల్ గురించి ఆలోచిస్తున్నవేంది నాయినా? మీకెన్ని పైసల్ గావాల్నంటె అన్ని పైసల్ నేన్ పంపుతగద.. ఆరాం గ తిని మంచిగ ఉండక మళ్ల ఇయ్యన్నెందుకు నీకు.. (కసురుకున్నడు కొడుకు)

నాయిన- అర్రె గట్ల కోపానికెందుకస్తున్నవ్ బిడ్డా.. ఉత్తగనే అడుగుతున్న నీ జీతమెంతుంటదిరా నెలకు?

కొడుకు- అలవెన్సులు అయ్యీ ఇయ్యీ అన్ని కలిపి ఓ లక్ష రూపాల చిల్లరుంటది నాయినా. చెప్పినగదా, సాలా? ఇంగ మళ్ల విసింగించకు నన్ను. ఇంకింత కోపంతోని చెప్పిండు కొడుకు.

నాయిన- నాకొక ముప్పై వేలిస్తవా కొడుకా?

నాయిన మాటకూ, నాయిన అట్ల మాట్లాడుతున్నా కూడా ఏం సప్పుడు జెయ్యకుంట అవ్వ అట్లనే సూస్కుంట కూసుంటున్నందుకూ కొడుక్కు కోపం కట్టలు తెచ్చుకుంది.

కొడుకు- ఏం పెద్ద మనిషివి నాయినా నువ్వు. గింత వయసచ్చింది అయినా పైసల యావ తగ్గలేదా నీకింక. టీవీ, కూలరు, సెల్లు, గ్యాస్ పొయ్యి ఏదంటె అది సామాన్లుసుత అన్ని కొన్నిచ్చినకద! అప్పులుగుడ ఏంలెవుగా నాయినా మనకు, మిత్తికి తిప్పుతవా ఏంది?అసలేం ఔసరమచ్చింది నీకీ వయసుల?

కొడుకు కోపం చూషీ, అంటున్న మాటలు వినీ ఏ సమాధానం ఇయ్యలేకపొయిండు నాయిన. సైసు.. ఇగ పోనీ, ఊకుండురా అని మాత్రం అనగలిగిండు.

కోపంతోని బయటికిపొయ్యి ఒక సిగరెట్ ముట్టించుకుని తాగబట్టిండు కొడుకు. ఒక పది నిమిషాలు గడిశిపొయినయ్. అతనిలో కోపం తగ్గి ఆలోచన మొదలయ్యింది. ఎప్పుడు పైసలడగని నాయిన ఇయ్యాలెందుకో పైసలడుగుతున్నడేంది! ఏదన్న అక్కెరపడ్డదో ఏందో అనిపించసాగింది. నాయిన అట్ల అడుగుతుంటే అవ్వ కూడ ఏం సప్పుడు చేస్తలేదంటే పాపం నిజంగనే ఏదొ పెద్ద ఔసరమే ఉండవచ్చు అనుకున్నడు కొడుకు. ఆ అలోచనరాంగనే మిగిలిన సిగరెట్ అట్లనే పక్కకు పడేశిలోపటికి నడిశిండు.

లోపట అవ్వ ఏడుపు మొఖం పెట్టుకొని గడపముంగట కూసొని చాటల బియ్యంపోస్కోని రాళ్లూ, లక్కెపురుగులుంటె ఏరుతాంది . నాయిన గడ్డం కింద చేతులు పెట్కుని శూన్యంలకు సూస్కుంట గడంచెల కూసోనున్నడు.

అంతా నిశ్శబ్దంగున్నది. చీమ చిట్టుకుమన్న వినిపించేటంత నిశ్శబ్దం. కొడుక్కి ఆ దృశ్యమెందుకోగనీ చానా విషాదంగ అనిపించబట్టింది

కొడుకు- నాయినా ఇప్పుడు జేబుల అన్ని పైసల్లెవ్వుగనీ, జర సెపైనంక పక్క ఊళ్లెకు పొయి ఏ టి ఎం ల నుంచెళ్లి ఓ నలభై వేలు డ్రా చేశి పట్కచ్చిస్తా సరేన. ఇంక కావాల్నంటె నన్నడుగు, నా దగ్గర చాన్నే పైసలున్నయ్.

అప్పటిదాంక నీరసంగ ఉన్న అవ్వనాయినల మొఖాలు కొడుకు మాటతోని కళ వడ్డయ్. వాళ్లిద్దరికి మస్తు సంబురమైంది.

నాయిన- నువ్వుపొయి గా డబ్బపట్కరాపోయే అని అవ్వతోని అన్నడు.

అవ్వ పొయ్యి ఒక పాత ఇనుపరేకు డబ్బా పట్కచ్చింది.

నాయిన మొల్దారానికున్న చిన్న తాళంచేత్తోటి ఆ డబ్బకున్న తాళం తీషిండు.

దాంట్లె ఏమున్నయో చూశినంక పరేషాన్ అవుడు కొడుకు వంతయ్యింది.

దాన్నిండ పైసలకట్టలున్నయ్.

కొడుకును పక్కకున్న కుర్చీల కూసోమనిచెప్పి ఒక్కొక్క కట్టనే బయటికి తీసి లెక్కవెడ్తుండు నాయిన. కొన్ని పది రూపాయల నోట్ల కట్టలూ, కొన్ని యాభై రూపాల నోట్ల కట్టలూ, ఇంకొన్ని వంద రూపాయల నోట్ల కట్టలూ ఒక్కొక్కటిగా బయటకు తీశి లెక్కబెడ్తుండు. అవ్వ మళ్ల లోపటికిపొయ్యి ఇంకేదో పెద్ద డబ్బలకెళ్ళి కొన్ని ఐదువందల నోట్లూ, వెయ్యి రూపాల నోట్లూ పట్కచ్చింది..
ఆ జరిగే కథంత సూషుడుతోటే కొడుక్కు మళ్ల మస్తు కోపమచ్చింది.

ఏంది నాయినా మీరిగ మారరా? వయసు పెరిగినా కొద్ది మీకింక పైసల యావ పెరుగుతనే ఉంది. ఎనుభైయేండ్లకున్నరు, పిలగాండ్లు సెటిల్ అయిన్లని సంబురం లేదు, మనవలూ మనవరాల్లు మంచిగున్నరా లేదా అని లేదు.. ఎప్పుడు సూడూ పైసలూ.. పైసలూ… ఛీ.. గింట్లుంటారెక్కడ్నన్న.. కసురుకున్నడు కొడుకు…

ఆ మాటలు వినిపించుకోనట్టుగనే మొత్తం పైసలన్నీ లెక్కబెట్టేదాక ఏం మాట్లాడలే అవ్వనాయినలు.

కొడుక్కి నిమిష నిమిషానికి అసహనం పెరిగిపోవట్టింది. ఇంకో సిగరెట్ ముట్టించిండు.

ఇగో బిడ్డా మొత్తం డెబ్బయిరెండువేల నలభై రూపాలున్నయిరా మా తాన.

పైసలన్నీ ఒక నల్ల రంగు కూరగాయల కవర్ల ముల్లె సుట్టి కొడుక్కిచ్చింది అవ్వ.

ఒక్క నిమిషం కొడుక్కేం సమజ్ కాలే..

ఏందే ఇది? సిగరెట్ పడేశి కొడుకడిగిండు.

నాయిన- వడ్లమ్మిన పైసలూ, కౌలు పైసలు, అప్పుడప్పుడు నువ్విచ్చిన పైసలూ అన్ని కలిపి గీ డెబ్బయి రెండువేల నలభై రూపాలైనయ్ బిడ్డా. మాకోసం ఒక్క రూపాయి సుత ఖర్చుపెట్టలే..

కొడుకు- ఇవి నాకెందుకిస్తున్నవ్ నాయినా? నేనెప్పుడన్న నిన్ను లెక్కలడిగిన్నా..? ఇయ్యన్నీ ఎందుకు లెక్కలేస్తున్నవో నాకైతె సమజ్ కాలె!!

నాయిన- నీతోనొక నెలరోజులు గడిపి దగ్గెర దగ్గెర ఇర్వయేండ్లయిందిరా. నా మనువలు మనవరాల్లు మనింటికచ్చి సుత పదేండ్లు దాటింది. ఓపికున్నన్ని రోజులు పొలాలు, గొడ్లు, బర్రెలను పట్కోనే ఉండి మీకాడికి మేం రాలె. ఇప్పుడు ముసలొల్లయి కాల్ రెక్కలు ఆడకుంటయినంక మీతోటి ఉండాల్నన్నున్నా ఉండే తందుకు వీల్లేనట్టుంది, ఈ ఊరొదిలేశి మాకేడికి రాబుద్దిసుత కాదు. ప్రయాణాలు చేశే ఓపికసుత లేదిగ. అందుకే ఓ లచ్చ రూపాలు జమచేశి నీకిత్తె మేం సచ్చేలోపుట మీ పెండ్లాం పిల్లలనందరిని తీస్కచ్చి ఒక నెల రోజులన్న మాతోనుండి మమ్ముల సంబురపెడ్తవని ఇత్తున్నం బిడ్డా..

అవ్వ- నీ నెల జీతానికంటె ఒక ముప్పైవేలు తక్కువపడ్డయ్ నాయిన. నువ్విత్తా అన్నయ్ సుత కలిపి నువే ఉంచుకో బిడ్డా.. కని మాతోని ఒక్క నెల రోజులన్న ఉండు కొడుకా….

కొడుకు సమధానం ఆ కొడుక్కే తెలుస్తే చాలు ..!

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,283 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>