Home / Opinion / కేసీఆర్ కు ప్రజలే ప్రతిపక్షం!
kcr rayalatelangana bandh

కేసీఆర్ కు ప్రజలే ప్రతిపక్షం!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారపగ్గాలు చేపట్టడంతో కోస్తాంధ్ర పెట్టుబడిదారి వర్గాల కళ్లు మండుతున్నాయి. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నలుమూలలకు తీసుకెళ్లి ..సబ్బండ వర్గాలను తెలంగాణ ఉద్యమంలోకి నడిపించి ..తెలంగాణ ఎందుకు కావాలి ? ఎందుకు రావాలి ? అన్నది సూక్ష్మంగా అందరికి వివరించి తెలంగాణ సాధించిన కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వస్తాడని చంద్రబాబు అనుకూల ..చంద్రబాబు కొమ్ముకాసే సీమాంధ్ర మీడియా మాఫీయా ఏ మాత్రం అంచనా వేయలేదు. కలలో కూడా వారు ఈ విషయాన్ని ఊహించలేదు.

ఎందుకంటే గత 14 ఏళ్లుగా కేసీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి, తెలంగాణ ఉద్యమాన్ని తెరమరుగు చేయడానికి, తెలంగాణ రాష్ట్ర సమితిని అతలా కుతలం చేయడానికి వారు చేయని ప్రయత్నం లేదు. ఇంకా ముఖ్యంగా కేసీఆర్ 11 రోజుల నిరహార దీక్ష 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రకటన తరువాత ఈ వర్గంలోని అహంభావం, వికృత స్వభావం, తెలంగాణ వ్యతిరేక భావన జడలు విప్పింది. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు వీరు చేయని ప్రయత్నం ..మొక్కని దేవుడు ..ఎక్కని గడప లేదని చెప్పాలి.

ఈ కుట్రలను ..ఈ కుతంత్రాలను చేధించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించి పెట్టాడు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చి చూయించాడు. ఇంత చేసిన కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే తెరమరుగు చేసేందుకు ప్రయత్నించారు. తెలంగాణ వచ్చింది ..ఇక కేసీఆర్ తో పని ఏముంది అని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విఫలయత్నం చేశారు. కాంగ్రెస్ లేదా టీడీపీ – బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే తమ అక్రమవ్యాపారాలకు ..తమ అక్రమ నిర్మాణాలకు సంపూర్ణ భద్రత ఉంటుందని ఈ సాహసానికి ఒడిగట్టారు.

కానీ కేవలం తెలంగాణ ప్రజల మీద నమ్మకం ..తెలంగాణ ప్రజల మీద ఉన్న విశ్వాసంతో కేసీఆర్ ఎన్నికల గోదాలోకి ఒంటరిగా అడుగుపెట్టారు. రోజుకు 10 సభల చొప్పున 100కు పైగా సభల్లో పాల్గొని టీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించి ..ఒప్పించి అధికారం చేజిక్కించుకున్నారు. అధికారం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ మీద బురదజల్లే ప్రయత్నాలు పెట్టింది సీమాంధ్ర మీడియా మాఫియా. జర్నలిజం విలువలను నడిబజార్లో వదిలేసి నగ్నంగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని చిన్నతనం చేసేందుకు ప్రయత్నించి తన కురచబుద్దిని చాటుకుంది. కేసీఆర్ వ్యతిరేక వర్గాలను ప్రభుత్వం మీదకు ఉసిగొలిపే ప్రయత్నం చేసింది. కానీ ఈ మీడియా మాఫియాకు కేసీఆర్ పెట్టాల్సిన మందే పెట్టారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ తన దారిన తాను సాగిపోతున్నాడు.

కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సహా …మహమూద్ అలీ, రాజయ్య, ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి జోగు రామన్న తదితరులతో పాటు, ఎంపీలు వినోద్ కుమార్, కవిత, కడియం శ్రీహరి, బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్, ఎపి జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇక ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాల్ రాజు, లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, బొడిగె శోభ, యాదగిరి రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్ గౌడ్, అంజయ్యయాదవ్, గొంగిడి సునీత, దాస్యం వినయ్ భాస్కర్, స్పీకర్ మధుసూదనా చారి ఇలా కొందరు మినహా అందరూ తెలంగాణ ఉద్యమంలో మమేకమయిన వారే. తెలంగాణ ఉద్యమంలో ఆటు పోట్లు ఎదుర్కొన్నవారే. ప్రభుత్వ అణచివేతను ..పెట్టుబడి దారి వర్గాల హేళనలను తట్టుకుని ఉద్యమంలో నిలబడ్డవారే. తమ ఆస్తులను తెలంగాణ ఉద్యమం కోసం ధారపోసిన వారే.

వీరందరికీ తమ తమ జిల్లాలోని, నియోజకవర్గంలోని ప్రజలతో విస్తృతస్థాయి సంబంధాలు ఉన్నాయి. ఉద్యమంలో ప్రజలతో మమేకమయి గడిపిన నేపథ్యం వీరికి ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలోని తప్పు ఒప్పులను నేరుగా వీరికి చెప్పే సానిహిత్యం తెలంగాణ ఉద్యమకారులకు ఉంది. ఇంతటి సానుకూల అంశం ఇప్పటివరకు దేశంలో ఏర్పడిన ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకపోవచ్చు అన్నా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విశ్లేషణాత్మకంగా ప్రజలు ఈ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోగలుగుతారు. తెలంగాణలోని టీఆర్ఎస్ వ్యతిరేక రాజకీయ పార్టీల కంటే బలంగా ఈ ప్రజలే వారికి ప్రభుత్వ లోపాలను ..అనుకూలతలను చెప్పగలిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక గత 14 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో ఉత్తాన పత్తానాలు చూసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ అవసరాలు ..తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద స్పష్టమయిన అవగాహన ఉంది. ఈ నెల రోజుల పాలనలో ఆయన విజన్ ఏమిటి ? అన్నది కూడా అందరికీ తెలిసిపోయింది.  అందుకే తెలంగాణలోని తొలి ప్రభుత్వానికి ప్రజలే ప్రతిపక్షం. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలే అండా దండా.

- సందీప్ రెడ్డి కొత్తపల్లి

One comment

  1. M.N.VASANTH KUMAR.

    KCR is KCR! No one can replace Him .He is the TORCH ,GUIDE for NAVYA TELANGANA. TELANGANA Asha jyoti…KCR…

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,281 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>