Home / తెలుగు / కళ్ళ ముందే ఇంత దుర్మార్గమా? – ఎన్ వేణుగోపాల్
Polavaram

కళ్ళ ముందే ఇంత దుర్మార్గమా? – ఎన్ వేణుగోపాల్

‘విరబూసే యాపిల్ చెట్ల సౌందర్యం కాదు, సత్యానికి తారుపూసే హిట్లర్ ఉపన్యాసాల బీభత్సం నా చేత కవిత్వం రాయిస్తోంది’ అని బెర్టోల్ట్ బ్రెహ్ట్ రాసినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆనందం కన్నా కేంద్ర ప్రభుత్వం, కోస్తా, రాయలసీమ కాంట్రాక్టర్-రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రత్యక్షంగా సాగించిన దుర్మార్గం, తెలంగాణ నాయకుల కుటిల మౌనం కలగలిసి ఖమ్మం జిల్లా ఆదివాసుల జీవితాల మీద జరగనున్న బీభత్సమే ఇవాళ రాయడానికి పురికొల్పుతున్నది.

నిజానికి పోలవరం ప్రాజెక్టు కేవలం మూడు లక్షల మంది ఆదివాసులను నిర్వాసితులను చేసే, వారి జీవితాలను ధ్వంసం చేసే పథకం మాత్రమే కాదు, దాన్ని వ్యతిరేకించడానికి మరెన్నో కారణాలున్నాయి. పోలవరం ఆనకట్ట ఏదో బహుళార్థ సాధక అభివృద్ధి పథకమనీ, అది కోస్తా, రాయలసీమలకు ఏదో మంచి చేస్తుందనీ, అన్ని “మంచి” పనులకూ ఏదో ఒక బలి ఇవ్వక తప్పదనే హిందూ బ్రాహ్మణ ఆచారం ప్రకారం ఆదివాసుల బలి తప్పదనీ చాల మంది అమాయకులు భావిస్తున్నారు. ఈ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అనే న్యాయమైన ఆకాంక్షను నెరవేర్చామనే ముసుగు వేసుకుని పాలకవర్గాలు పోలవరం ప్రాజెక్టును తీసుకువస్తున్నాయి.

పోలవరం ప్రాజెక్టు గురించి మొదటి ఆలోచన 1941లోనే వచ్చినప్పటికీ గత ఆరు దశాబ్దాలలో వేరువేరు ప్రభుత్వాలు ఎన్నో రూపాలలో అధికారిక సమాచారాలు ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ ఏ అబద్ధమూ లేని సమగ్ర సమాచారం దొరకడం లేదు. ప్రభుత్వం ప్రకటిస్తున్న లక్ష్యాలు వేరు, లోపాయకారీ లక్ష్యాలు వేరు. ప్రభుత్వం చెపుతున్న ఖర్చు వేరు, నిజంగా జరిగే ఖర్చు వేరు. ప్రభుత్వం చెపుతున్న జలాశయ సామర్థ్యం వేరు, వాస్తవ సామర్థ్యం వేరు. అసలు ఎంత ఎత్తు ఆనకట్ట కట్టబోతున్నారనేదే ప్రభుత్వం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెపుతున్నది. జలాశయం వల్ల నిజంగా జరిగే ముంపు బీభత్సానికీ, ప్రభుత్వం చెపుతున్న అంకెలకూ పొంతన లేదు. ఆ జలాశయం కింద ముంపుకు గురయ్యే అడవి గురించీ, మత, సాంప్రదాయిక, చారిత్రక స్థలాల గురించి సరైన సమాచారం లేదు. ఆ జలాశయం ఏర్పడబోయే భూమి అంత నీటి ఒత్తిడిని తట్టుకోగలుగుతుందా అనే ప్రశ్నకు జవాబు లేదు.

కేంద్ర జల వనరుల సంఘం వేసిన ప్రశ్నలలో సగానికి కూడ జవాబు చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం మాయ చేసిందో ఎవరికీ తెలియదు. సుప్రీంకోర్టులో రెండు పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక రాజకీయ పార్టీ వేసిన కేసులు ఇంకా విచారణలో ఉండగానే, సుప్రీం కోర్టు తీర్పు రాకుండానే ఇది “జాతీయ” ప్రాజెక్టుగా కేంద్ర నిధులు ఎలా పొందుతుందనే ప్రశ్నకు జవాబు లేదు. ఆ ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్‌లో కలపడానికి ఎన్ని కుట్రలు జరిగాయో లెక్కలేదు. ఇన్ని అక్రమాలతో, అస్తవ్యస్తతలతో, అర్ధసత్యాలతో, అసత్యాలతో ఒక ప్రాజెక్టు రూపొందుతుంటే మాట్లాడవలసిన వాళ్లలో అత్యధిక సంఖ్యాకులు మౌనంగా ఉండిపోతున్నారు. లేదా పాలకవర్గ అబద్ధాలను చిలకపలుకుల్లా వల్లిస్తున్నారు.

అన్నిటికన్నా ఘోరంగా, “మీ రాష్ట్రంలో ఉంటే… ఆ గ్రామాలను ముంచి, ఆ ఆదివాసులను నిర్వాసితులను చేసి, ప్రాజెక్టు కట్టుకోవడానికి ఆటంకాలు సృష్టించేట్టున్నారు. కనుక ఆ గ్రామాలను మాకివ్వండి” అని కోస్తా పాలకవర్గాలు అడిగితే కేంద్రం అంగీకరించింది. “మీ దగ్గర ఉన్న మనిషిని చంపదలిచాను. మీ దగ్గర ఉంటే మీరు అభ్యంతరం చెపుతారు గనుక ఆ మనిషిని నాకు ఇచ్చెయ్యండి. నా మనిషిని నేను చంపుకుంటే మీకేం బాధ” అని ఎవడన్నా అంటే వాడి బేహద్బీకీ, దుర్మార్గానికీ, అమానుషత్వానికీ అసహ్యించుకుంటాం. కాని కోస్తా పాలకవర్గాలు చాల నాజూకుగా ఈ మాటలనే చెపితే కేంద్ర ప్రభుత్వమూ అంగీకరించింది. ఇది సరైన వాదనే అని చాల మంది బుద్ధిమంతులు కూడ భావిస్తున్నారు.

మొదట పోలవరం పేరు మీద ఊరేగుతున్న మహా అబద్ధాలను చూద్దాం. ఈ ప్రాజెక్టు అటు విశాఖపట్నం జిల్లా నుంచి ఇటు కృష్ణా జిల్లా దాకా కొన్ని లక్షల ఎకరాల వ్యవసాయానికి నీరు, విశాఖపట్నానికి మంచినీరు, ఆ పరిసరాలలో పరిశ్రమలకు నీరు ఇస్తుందని, ఆనకట్ట దగ్గర 960 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తుందనీ, కాలువల ద్వారా ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తుందనీ, గోదావరి వరదలను అడ్డుకోగలుగుతుందనీ, విజయవాడ ప్రకాశం బ్యారేజి దగ్గరికి తీసుకువచ్చి చేర్చే నీటి ద్వారా రాయలసీమకు కూడ నీరు అందించవచ్చుననీ పాలకులు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ పూర్తి అసత్యాలు కాదు గాని అర్ధసత్యాలు.
వీటిలో సాగు నీరు ప్రభుత్వం చెప్పినంత రాదు. వచ్చేదైనా అవసరమైన దుర్భిక్ష ప్రాంతాలకు రాదు. విశాఖపట్నం తాగునీటి అవసరాలకు ఈ వనరు అవసరం లేదు. జలవిద్యుత్తు కోసం ఆనకట్ట అంత ఎత్తు పెంచనవసరం లేదు. వరదలను అడ్డుకోవడానికి పైన కూడ చిన్న చిన్న ఆనకట్టలు కట్టవలసి ఉంటుంది గాని ఇలాంటి ఒక రాక్షస ప్రాజెక్టు కాదు. రాయలసీమకు నీరు అందిస్తామని చేస్తున్న వాగ్దానం ఎత్తగొట్టడానికే ఎక్కువ అవకాశాలున్నాయని గత చరిత్ర వేనోళ్ల మొత్తుకుంటున్నది.

మొత్తానికి ఇన్ని ప్రయోజనాలు చెప్పినప్పటికీ పూర్తి వాస్తవరూపం ధరించేవి విశాఖపట్నం – కాకినాడ మధ్య రాబోతున్న బహుళజాతి పారిశ్రామిక సంస్థల, పెట్రోకెమికల్ సంస్థల నీటి అవసరాలు తీర్చడం, ప్రకాశం బ్యారేజి దగ్గర నీటి నిలువను స్థిరీకరించి కృష్ణా – గుంటూరు జిల్లాల ఆయకట్టులో మూడో పంటకు వెసులుబాటు కల్పించడం. అంటే ప్రకటిత లక్ష్యాలు ఆరేడింట్లో నిజంగా నెరవేరేవి రెండు మాత్రమే. అవి అటు బహుళజాతి సంస్థలు, ఇటు కృష్ణా – గుంటూరు రైతాంగం అనే రెండు బలమైన లాబీల ప్రయోజనాలు కావడం వల్ల కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాలు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ వంటి జాతీయ పార్టీలు, తెలుగుదేశం వంటి ప్రాంతీయపార్టీ ఇంతగా ప్రత్యక్ష మద్దతు తెలుపుతున్నాయి. తెలంగాణ పార్టీలు కూడ ఏదో ఒక రకంగా తెలంగాణ వస్తే చాలుననే రాజీధోరణి ద్వారా ఈ దుర్మార్గం పట్ల మౌనం వహిస్తున్నాయి.

నిజానికి ఇది తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఆటంకం కలిగించే ప్రాజెక్టు. బచావత్ ట్రిబ్యునల్ అంగీకరించిన ముఖ్యమంత్రుల ఒప్పందం ప్రకారం గోదావరి జలాలలో పాత ఆంధ్రప్రదేశ్ వాటా 1480 టిఎంసిలు కాగా, ఏ న్యాయసూత్ర ప్రాతిపదికన చూసినా దానిలో తెలంగాణ వాటా 900 టిఎంసిలు, ఆంధ్ర వాటా 580 టిఎంసిలు కావాలి. ఆంధ్ర వాటాలో ఇప్పటికే 320 టిఎంసి వినియోగం జరుగుతున్నది. అంటే ఆంధ్రకు ఇంకా 260 టిఎంసి కన్న ఎక్కువ వాడుకోవడానికి అవకాశం లేదు. కాని పోలవరం ప్రకటిత వినియోగమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు వెబ్ సైట్ 2010లో రాసిన ప్రకారం 301.38 టిఎంసి కాగా, అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు నీటిపారుదల శాఖ 1986లో తయారు చేసిన సమగ్ర ప్రణాళిక ప్రకారం అది 336.57 టిఎంసిలు. కె. బాలగోపాల్ 2005లో వేసిన లెక్క ప్రకారం పోలవరం ఆనకట్ట ఎత్తును బట్టి ఈ జలాశయం నుంచి 500 టిఎంసి వాడుకునే అవకాశం కూడ ఉంది. ఈ లెక్కలలో కనీస సామర్థ్యపు వాటా కూడ ఆంధ్రకు లేదు. కాని ఒకసారి కేంద్ర నిధులతో ఆనకట్ట కట్టినతర్వాత, ప్రిస్క్రిప్టివ్ రైట్స్ (అక్రమంగానైనా, సక్రమంగానైనా సంపాదించినవారిదే సంపాదన మీద హక్కు అని చెప్పే న్యాయసూత్రం) ఆధారంగా ఈ అదనపు వినియోగం కూడ వారిదే అవుతుంది. అంటే ఆ మేరకు తెలంగాణ నష్టపోతుంది.

పోనీ అది ఆంధ్ర ప్రాంత రైతాంగానికైనా ఏమైనా మేలు చేస్తుందా అంటే అది కూడ వాస్తవం కాదు. అక్కడి ప్రజలను రెచ్చగొట్టి, ఈ అన్యాయానికి సమర్థన తెచ్చుకోవడానికి పాలకులు అబద్ధాలు చెపుతున్నారు గాని ఆ ప్రాజెక్టు వల్ల కృష్ణా – గుంటూరు ఆయకట్టులో మూడవ పంటకు తప్ప మిగిలిన జిల్లాల రైతాంగానికి జరగబోయే మేలేమీ లేదు.

అయినా ఇంకా తక్కువ ఎత్తు ఆనకట్ట కట్టి, తక్కువ ముంపుతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని వస్తున్న ప్రత్యామ్నాయ డిజైన్లను కూడ పక్కనపెట్టి, అసలు ప్రాజెక్టు అవసరమే లేదంటున్న వాదనలను కొట్టివేసి మూడు లక్షల మంది ఆదివాసులను నిర్వాసితులను చేసి ఈ భారీ జలాశయం నిర్మాణానికి పాలకులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ జలాశయం వల్ల విలువైన అడవి మునిగిపోతుంది. ఆ అడవిలోని ఆదివాసుల సాంస్కృతిక, చారిత్రక స్థలాలెన్నో మునిగిపోతాయి. శబరి నది జలాశయ గర్భంలో అంతర్ధానమై పోతుంది. పాపికొండలు కనబడకుండా పోతాయి. ఈ ప్రాంతం అతి సున్నితమైన భూకంప సంభావ్యతా క్షేత్రంలో ఉండడం వల్ల ఇక్కడ ఇంత పెద్ద జలాశయం నిర్మిస్తే ఆ ఒత్తిడికి భూకంపం సంభవిస్తే రాజమండ్రి, కాకినాడ నగరాలతో సహా వేలాది గ్రామాలు జలసమాధి అవుతాయి.
అయినా సరే నిర్మించవలసిందే అని, దానివల్ల వేల కోట్ల రూపాయలు ఆర్జించే కంట్రాక్టర్లు, వారినుంచి వందల కోట్ల రూపాయలయినా ముడుపులు పొందే రాజకీయనాయకులు, సాంకేతిక పరిజ్ఞానం తప్ప సామాజిక జ్ఞానం లేని సాంకేతిక నిపుణులు, తెలిసీ తెలియని ‘మేతావులు’ అనుకుంటే అనుకోవచ్చు గాని ఆలోచనాపరుల సంగతేమిటి? కనీసం సహ మానవుల జీవన్మరణ విషాదమైనా కదిలించలేనంత మొద్దుబారిపోయాయా మన ఆలోచనాపరుల హృదయాలు?

Source: ఎన్ వేణుగోపాల్ (Andhraprabha)

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,897 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>