Home / తెలుగు / బయ్యారంపై చిగురిస్తున్న ఆశలు

బయ్యారంపై చిగురిస్తున్న ఆశలు

-ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సిద్ధమని సెయిల్ ప్రకటన.. 
-సరిపడా విద్యుత్, నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ
-శరవేగంగా నివేదికలు సిద్ధం చేస్తున్న అధికారులు.. 
-మరో పదిరోజుల్లో స్టీల్ ప్లాంట్‌పై స్పష్టత

తెలంగాణ సిరుల గడ్డపై మరో మణిమాణిక్యం మొగ్గ తొడగనుంది. పరాయి పీడనలో అక్రమార్కుల చేతుల్లో లూటీకి గురైన బయ్యారం గనులపై.. ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. స్వీయ పాలనలో ఉక్కు కర్మాగారానికి చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్లాంట్ ఏర్పాటుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆమోదం తెలిపింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గత నెల 21, 22 తేదీల్లో ఖమ్మం జిల్లా పాల్వంచ, బయ్యారం, కొత్తగూడెం ప్రాంతాల్లో సెయిల్ బందం పర్యటించి అధ్యయనం చేసింది. కర్మాగార ఏర్పాటుకు వాతావరణ పరిస్థితులను అంచనా వేసింది.

బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటిస్తూ సెయిల్ సంస్థ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖకు లేఖ పంపింది. కాగా, ప్లాంట్ ఏర్పాటుకు సెయిల్ బందం మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది. అందులో పాల్వంచ మండలం వెలమనూరు, కొత్తగూడెం మండలం కూనారం, బయ్యారం మండల కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు సెయిల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతకుముందు ఈ ప్రాంతంలో ఐరన్‌ఓర్, లైమ్‌స్టోన్, డోలమైట్ గనుల నిల్వలపై స్పష్టత ఇవ్వాలని నిర్దేశించింది. వీటిలో తమ సంస్థకు ఏ మేరకు లీజుకు ఇస్తారని అడిగినట్లు తెలిసింది. ప్లాంట్ ఏర్పాటుకు 750 మెగావాట్ల విద్యుత్, 1.5 టీఎంసీల నీరు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ప్రభుత్వం సెయిల్ కంపెనీ అడిగిన వాటిని సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే బయ్యారంలో స్టీలుప్లాంటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కతనిశ్చయంతో ఉంది. దాంతో కంపెనీ అడిగిన వాటిని సమకూర్చేందుకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావన్న అభిప్రాయం వినిపిస్తున్నది. యుద్ధప్రాతిపదికన ప్లాంటు ఏర్పాటుకు కావాల్సిన అన్ని నివేదికలు తయారు చేయించేందుకు కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ నుంచి గనులు, భూగర్భ వనరులు, నీటి పారుదల, తెలంగాణ సీపీడీసీఎల్, మెట్రోలాజికల్ తదితర శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆయా శాఖలు ప్రాజెక్టుకు అవసరమైన అంచనాలను రూపొందించనున్నాయి. ఏయే శాఖ ఎంత అన్నది లెక్క తేలితే ప్లాంటు ఏర్పాటు ఖాయమైనట్లు భావించవచ్చునని అధికారులు చెప్తున్నారు. మరో పది రోజుల్లోనే సెయిల్ బందం, రాష్ట్ర పరిశ్రమల అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. అప్పట్లోగానే నివేదికలను సిద్ధం చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలోనే ప్లాంట్ ఏర్పాటు విషయంపై స్పష్టత రానుందని సమాచారం.

బయ్యారం గనులతో రాజకీయ ఆట: ఖమ్మం జిల్లాలోని బయ్యారం, పాల్వంచ, కొత్తగూడెం మండలాల్లో ఐరన్ ఓర్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని దశాబ్దాలుగా వినిపిస్తున్నదే. 1959లోనే జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్సై) సర్వే చేపట్టగా.. 1974లోనూ అదే సంస్థ మరోసారి సర్వే చేసింది. ఇందుకు 230 ఎకరాల్లో 14 డీటీహెచ్ బోర్లు వేసి.. ఐరన్ ఓర్ నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయో లెక్క తేల్చింది. ఏ స్థాయిలో నిల్వలు ఉన్నాయన్న విషయం నాటినుంచి రహస్యంగానే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం ఇక్కడి ఐరన్ ఓర్ కేవలం 12 మిలియన్ టన్నులకు మించదంటూ దుష్ప్రచారం జరిగింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండానే.. స్టీలు ప్లాంట్ ఏర్పాటు చేసుకునే స్థాయిలో నిల్వలు లేవంటూ కేంద్రానికి పలుమార్లు నివేదికలు సమర్పించారు. 

దీంతో బయ్యారం ఉక్కు కార్మాగారం మరుగునపడింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రక్షణ స్టీలుకు వేల హెక్టార్ల భూములు లీజుకు ఇవ్వడం దుమారాన్ని రేపింది. అవినీతి, అక్రమాలు జరిగాయంటూ పెద్దఎత్తున ప్రచారం జరగడంతో.. లీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. సెయిల్ వంటి కంపెనీలు ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అప్పట్లో ముందుకొచ్చినా.. ఖనిజ నిల్వలు లేవంటూ నిరుత్సాహపరిచినట్లు తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పైగా ఒక ప్లాంట్ నెలకొల్పి కనీసం 50 సంవత్సరాలు కొనసాగించాలంటే.. 100 మిలియన్ టన్నుల నిల్వలైనా ఉండాల్సి ఉంటుందంటూ తెలంగాణవాదులను మభ్యపెట్టారు. ఒక్క మిలియన్ టన్ను నిల్వ కూడా లేని విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనసాగుతుండగా.. వేలాది ఎకరాల్లో ఐరన్ ఓర్ నిల్వలు ఉన్న బయ్యారంలో నెలకొల్పేందుకు ఇన్నేళ్లుగా కుంటిసాకులు చెప్పారు. తెలంగాణ రాష్ర్టావిర్భావంతో మరోసారి స్టీలు ప్లాంట్ అంశం తెర మీదికి వచ్చింది. మరో పది రోజుల్లో ప్లాంట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు వెల్లడి కానున్నాయి.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,280 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>