Home / తెలుగు / మూడేళ్లలో 30 ప్రాజెక్టులు; 40 లక్షల ఎకరాలను సాగు
Srisailam Left Bank Canal SLBC project
Srisailam Left Bank Canal SLBC project

మూడేళ్లలో 30 ప్రాజెక్టులు; 40 లక్షల ఎకరాలను సాగు

-40 లక్షల ఎకరాలకు నీరు
-పూర్తయ్యే వాటికి తొలి ప్రాధాన్యత
-రైతుకు త్వరితంగా నీరందించడమే లక్ష్యం
-ఏటా రూ.5,500 కోట్ల వ్యయం
-కృష్ణలో 132 టీఎంసీల సద్వినియోగం
-ఇంత వరకూ 50 టీఎంసీలకే పరిమితం

పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యత నివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో దాదాపు 30 ప్రాజెక్టులు కొద్దిపాటి నిధులతో పూర్తయ్యే అవకాశమంది. వీటిని పూర్తిచేస్తే సుమారు 40 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావొచ్చు. నిపుణుల సలహా మేరకు వీటిని ముందుగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు జరపాలని నిర్ణయించింది. 

ప్రాధాన్యతా రంగాలకు పెద్ద పీట వేసే క్రమంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూపొందిస్తున్న బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి దాదాపు 5,500 కోట్ల రూపాయలను కేటాయించనుంది. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వం రూపొందిస్తోంది.

మూడు ప్రాజెక్టులకే భారీ వ్యయం..

జలయజ్ఞం పథకం కింద రాష్ట్రంలో మొత్తం ముప్పయి మూడు ప్రాజెక్టులను చేపట్టగా వాటి కోసం మొత్తం రూ. 76,643 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. ఇందులో ప్రాణహిత-చేవెళ్ల, కాంతనపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టుల వ్యయమే అధికం. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి 40 వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. ఈ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం కషి జరుపుతోంది. దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా దాదాపు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా ఉన్నా అసలీ ఈ ప్రాజెక్టు అవసరమా? అనే విషయంపై అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. మరో ప్రాజెక్టు కాంతనపల్లి కి కూడా సుమారుగా 10 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావిస్తున్నారు.

30 ప్రాజెక్టులకు ముందు నిధులు.. ఒకేసారి ఇన్ని భారీ ప్రాజెక్టులు చేపట్టే బదులు ప్రస్తుతానికి ఈ మూడు భారీ ప్రాజెక్టులను మినహాయించి మిగితా ముప్పయి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందిస్తే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.ఆ మూడు ప్రాజెక్టులు మినహాయిస్తే మిగిలిన ముప్పయి ప్రాజెక్టుల నిర్మాణానికి 14,667 కోట్ల రూపాయలు సరిపోతాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,500 కోట్లు కేటాయించే అవకాశముంది. ఇదే మోస్తరుగా నిధులిస్తే మూడేళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

తెలంగాణ ప్రాంతంలో ఆయా ప్రాజెక్టుల కింద ఇప్పటికి దాదాపుగా 36,757 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరో 14వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తే కల్వకుర్తి ఎత్తిపోతలు, రాజీవ్ భీమా లిఫ్ట్, నెట్టెంపాడు లిఫ్ట్, దేవాదుల, ఎస్‌ఎల్‌బీసీ, శ్రీపాదసాగర్, ఎల్లంపల్లి, ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఫేజ్2, ఎస్‌ఎఫ్‌సీ-ఎస్‌ఆర్‌ఎఫ్‌సీ ఫేజ్1, కోయిల్‌సాగర్, నీల్వాయి, కొమరం భీం, కిన్నెరసాని, కాళేశ్వరం లిఫ్ట్, నిజాంసాగర్ మోడరనైజేషన్, లెండి, చౌటపల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్, రాలివాగు, గొల్లవాగు, జగన్నాథపూర్ సమీపంలో పెద్దవాగు, మత్తడివాగు, గడ్డన్న సుద్దవాగు, మోడికుంట వాగు, పాలెం వాగు తదితర ప్రాజెక్టులు పూర్తవుతాయి. సుమారు 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది.

ఇక మన నీరు మనకే…

కష్ణా నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల కింద తెలంగాణలో పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకోవాలని ప్రభుత్వం కతనిశ్చయంతో ఉంది. ట్రిబ్యూనల్‌లు కేటాయించిన 132 టీఎంసీల జలాలను తెలంగాణ పూర్తి స్థాయిలో వినియోగించుకున్న దాఖలాలు లేవు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం వల్ల 50 నుంచి 60 టీఎంసీల వరకే తెలంగాణ వినియోగించు కోగలిగింది. సీమాంధ్ర నేతల కుతంత్రాల వల్ల ఇప్పటిదాకా అధిక నీరు ఆ ప్రాంత ఆయకట్టుకే చేరింది. తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసుకుని పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించేందుకు ఇపుడు అవకాశం వచ్చింది. తాగునీటి పేరుతో ప్రతి సంవత్సరం సీమాంధ్ర పాలకులు నీటిని సీమాంధ్ర ప్రాంతానికి మళ్లించి నార్లు (సీడ్ బెడ్స్) పోసుకునేవారు. ఆ తరువాత నార్లు ఎండిపోతున్నాయని గగ్గోలు పెట్టి మరోసారి నీటిని మళ్లించుకునే వారు. ఫలితంగా తెలంగాణకు ఎప్పుడూ రావాల్సిన నీరు రాలేదు. 

సాగర్ నీటికోసం ఎత్తుగడలు..

ఇటీవల సీమాంధ్ర సర్కార్ తాగు నీరు కోసం 10 టీఎంసీల నీరును నాగార్జునసాగర్ నుంచి విడుదల చేయాలని చేసిన డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. తాగు నీటి కోసం రెండు టీఎంసీల నీళ్లు సరిపోతాయని తెలంగాణ ప్రభుత్వం వాదించగా 10 టీఎంసీలు కావాల్సిందేనని ఆంధ్రా సర్కార్ కోరటంతో ఈ వివాదాన్ని పరిష్కరించటానికి కేంద్ర జలవనరుల సంఘం జోక్యం చేసుకుంది. దీంతో 3.5 టీఎంసీల నీరు మాత్రమే విడుదల చేసేందుకు నిర్ణయించారు. 

గవర్నర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సీమాంధ్ర తాగునీటికి 10 టీఎంసీల నీరు విడుదల చేయాలనే ప్రతిపాదన వచ్చింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో మొత్తంగా 43 టీఎంసీల నీరు ఉండగా 10 టీఎంసీలు సీమాంధ్ర తాగునీటికి మరో 10 టీఎంసీలు ఎడమ కాల్వ, 13 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, మరో 10టీఎంసీలు కుడి కాల్వ ఆయకట్టుకు విడుదల చేయాలని నిర్ణయించారు. గవర్నర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిర్ణయానికి అనుకూలంగానే నీటి విడుదల కావాలనే డిమాండ్‌తో సీమాంధ్ర సర్కార్ ముందుకొచ్చింది. అయితే, తాగు నీరు పేరుతో సీడ్ బెడ్స్ చేసుకుని నీటిని దుర్వినియోగం చేస్తారనే వాదన రావటంతో కేంద్ర జలవనరుల సంఘం కూడా దానిని సమర్థించి కేవలం 3.5 టీఎంసీల నీటి విడుదలకే ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో ఇక ముందు అటు శ్రీశైలం ప్రాజెక్ట్ ఇటు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటి విడుదల విషయంలో ఖచ్చితంగా వ్యవహరించే అవకాశముంది. కేంద్ర బలగాలను రక్షణగా పెట్టి నీటిపారుదల బోర్డు ఆదేశాల మేరకే భవిష్యత్తులో ఆయా ప్రాజెక్టుల కింద కాల్వలకు నీరు విడుదల చేసేలా ఖచ్చితమైన ఆదేశాలను కేంద్రం రూపొందించింది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇష్టానుసారంగా నీరు విడుదలకు కూడా ఇక ముందు అవకాశముండదు.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,280 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>