Home / Movies / మాయ తెర By: – దేశపతి శ్రీనివాస్

మాయ తెర By: – దేశపతి శ్రీనివాస్

ఉహ తెలిసిన నాటి నుంచి మనసును పట్టి ఊపుతున్న కాల్పనిక ప్రపంచం సినిమా. ఆలోచన, భావన సృజన అన్నింటినీ సినిమా తన్మయం చేసింది. జీవితం సినిమా అయిపోయినట్లు విషాదంలోనూ, వినోదంలోనూ ఒక బ్యాక్‌గ్రౌన్డ్ మ్యూజిక్ మోగుతున్నట్లే భ్రమ. చిన్నప్పుడు కొట్లాడుకుంటుంటే కూడా డిష్షుం డిష్షుం అనే చప్పుడు నోటి అప్రయత్నంగా వెలువడేది.

జానపదాలు చూసిన ప్రభావం చిన్నప్పుడు ఎంత వెంటాడేదంటే..చేతుల కళ్ళాన్ని పట్టుకొని నోటితోని గుర్రం గిట్టల ధ్వనిని చేసుకుంటు కాలొకటి ఎగరేసుకుంటు పంచకళ్యాణి మీద దూసుకపోవుడే కని మామూలుగా నడిచేదా? ఎలితెబద్దలకు సుతిలి దారాలుగట్టి బాణాలు తయారు చేసుకొని నుదుటికి ఆనించుకుని అచ్చం ఎన్టీ రామారావు వలనె మంత్రించి అస్త్రాలు వదిలితే రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ఫోటోగ్రఫీలో దూసుకపోతున్నట్టు అబ్బ చెప్పరాని సంబురం. వంకరటింకర కట్టె ఒకటి కనబడితె అదే చేతుల మంత్రదండంగా మారిపోయేది. రాజనాలంత భీకరంగా ‘సర్పకేశీ’ అని భూతాలను ఆవాహన చేసుడు. జ్వాలాదీప రహస్యాలను కనుక్కొని మంత్రగాని ప్రాణమున్న భరిణెను దొరికించుకొని చిత్రవధ చేసి వధించేంది.

దీపావళి తుపాకులు తీసుకొని గోడచాటుకు దాక్కుంటు నడుమ నడుమ తల బయటకు పెట్టుకుంట అచ్చం డిటెక్టివ్ సినిమాల వలనె తూటాలు పేల్చుడు, తూటాలను తప్పించుకునుడు. చిన్నతనం ఆటల మీద సినిమా వేసిన ముద్రలు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి దాకా సినిమా తిరిగిన మలుపులే తలపులు.

ఇప్పుడు పరాయికరణ విషపు నీడలను పోల్చుకుంటున్న సందర్భంలో వలసపాము వేయి పడగలలో ఒకటిగా కోరలు సాచి కనిపిస్తున్నది సినిమా. పెట్టుబడి నాపుట్టువడిని ఏమార్చింది. నా సహజత్వాన్ని, స్వాభావికతని, స్థానిక మూలాలను నా నుండి వేరు చేసింది. పురిటి శిశువుగా ఉన్ననాడే కల్తీ కలి నీళ్లను చల్లింది. ఏం సినిమాలు చూసినం, సినిమాల ఎవరి జీవితం చూసినం.

ఎన్నడు సినిమాల మన మొఖాలు కనపడలె. మన మహోజ్వల గతం వెండితెర మీద వెలుగలే. మన పోరాటాలు, ఆరాటాలు, జీవన సౌందర్యాలు, మనవైన ప్రేమలు, మనదైన భావుకతలు ఎక్కడా కనిపిన్చలే. మన ఊర్లు, మన పేర్లు మన భాష వేశం ఏది? ఎన్నడు మనం చూసుకోలే. కథ వాళ్లదే. వాళ్లే కథానాయకలు. నాయకులు ప్రతినాయకులు అంతా వాళ్లే. వాళ్ల సమాజం ఎట్లెట్ల మారితె సినిమా అట్లట్ల మారింది. కోస్తా సామాజిక పరిణామమే మనకు చిరపరిచితము, తెరపరిచితము అయ్యింది. తెలంగాణ సమాజం మాత్రం అపరిచితమైంది.

అక్కడి జాతీయోద్యమం చెదురుమదురు ఘటనలే తొలినాటి సినిమాలు. ధవళేశ్వరం కట్టకింద పండిన వ్యవసాయ మిగులులోంచి జమీందార్లు, జమీందారుగారి అబ్బాయిలు దసరా బుల్లోళ్లు, సారా పెట్టుబడుల నుంచి పుట్టిన దొంగలకు దొంగలు, కేడీ నెం 1 మాఫియా సినిమాలు, ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచాన్ని ఏలుతున్న మిస్టర్ ఫర్ ఫెక్ట్ అన్నీ వారి లీలలే.

నలుపు తెలుపుల నాడే సినిమా మన అస్తిత్వాన్ని నలిపేసింది. కాలువ నీటిలో గూడ వేసుకుంటు “ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సలుపేమున్నది” అని నాగేశ్వరరావు, జమునలు పాడుకున్న ‘తోడికోడళ్లు’(1957)నాటికే వాళ్లు కాలువల్లో గూడ వేసి నీళ్లు తోడుకున్నరు. ఆడుతూ పాడుతూ పని చేస్తే అలుపు సొలుపేమున్నదని పాడుకున్నరు. కాల్వలకింద ఎవుసమాయె అలుపెట్లుంటది? సొలుపెట్లుంటది? ఏటికేతంబెట్టి ఎయిపుట్లు పండించినా ఎన్నడూ మెతుకెరుగని మన వెతలు వెండితెర కథలు కాలేదు. నోటిలో సిగార్, సూటుబూటుతో డుప్లెక్స్ ఇంటిలో ఇంటిమధ్యన మెట్లమించి దిగే ఎస్వీరంగారావు అటువంటి ధనికరైతులు మన జాగల ఇప్పటికీ పుట్టలే. మన దొరలకు గూడ అంత వైభోగం లేదు. ఇంగ్లీషు వాళ్ల వ్యవహారం వంటబట్టించుకున్నోళ్లాయె.

ఇంగ్లీషు కల్చర్‌ను అనుకరిస్తూ ఇంట్ల పియానో పెట్టుకుంటరు. హాలులో పియానో మీద వేళ్లు ఆడిస్తూ హీరో పాటలు బాల్కనీలో హీరోయిన్ అరమోడ్పు కన్నుల భావుకత లోకాలు మన జీవితాలలో ఎన్నడూ ఎరుగని దృశ్యాలు. కోస్తాగట్టులు, కొబ్బరిచెట్లు, మామిడితోపులు, మావా పిలుపులు మన బతుకును అతకని అసంబద్ధ సన్నివేశాలు. మత్తడిదూకే చెరువుల, అలుగును దాటుతున్న కచ్చురాలు, మోటచిమ్మల మీంచి దుంకి ఈదులాడే పిల్లలు, వెన్నెల రాత్రులలో కోలన్నలు, మన బతుకు రుచి, బతుకమ్మ సౌరభం, మన కంటికి కనపడకుండా చేసిన మాయపొర ఈ వెండితెర.

హరిత విప్లవం ఆంధ్రను అందలమెక్కిచింది. తెలంగాణను అణగదొక్కింది. ప్రాజెక్టులు రాలేదు కని ప్రాజెక్టు కింద పండే షావుకారు పంటలొచ్చినయి.

చేనుకు దాహమెక్కువైంది, భూముల పదన తక్కువైంది. పల్లెలల్ల పత్తి మిత్తై కూసింది. వరి రైతు మెడకు ఉరి బిగించింది. పజ్జొన్న పంటపోయింది. పిసికిల్లు మేసే పిట్టలు వలసపోయినయి.

అదే హరితవిప్లవం పుట్టించిన పైసల ఆంధ్రాల అందాల ‘సోగ్గాడు’ శోభన్‌బాబు పుట్టిండు. సోగ్గాడు సినిమాల శోభన్‌బాబు మెరుపుల మెరుపుల అంగీ వేసుకొని హైద్రాబాద్‌లో ఆదర్శరైతు అవార్డు తీసుకుంటడు. ఆంధ్రల ఆదర్శరైతులు పుట్టిన క్రమానికి తెలంగాణ రైతు ఆత్మహత్యలకు దగ్గరయిన క్రమానికి మధ్య ఉన్న చిత్రమేందో ఇప్పుడు అర్థమవుతున్నది. సూపర్ స్టార్ కృష్ణ ‘పాడి పంటలు’ సినిమాల మనం చూసింది ఎవని పాడి? ఎవని పంట? ఊరంతా సంక్రాంతి అసలైన పండుగ అని డ్యాన్సు రాకున్నా ఎగురుతుంటే మనమెందుకు సంబురపడ్డం? మన పండుగ దసర గదా? పాలపిట్టల జూసిన పారవశ్యాలు, జొన్నకపూరల జెండాల జులాస్‌లు, జంబి పంచుకుని అలాయ్ బలాయ్ తీసుకునే ఆత్మీయతలు ఎన్నడన్న ఎప్పుడన్న ఏ సినిమాలన్న జూస్తిమా? తెలంగాణ జీవన సంస్కృతి ఎన్నడూ కానని అంధత్వం ఆంధ్ర సినిమాది.

సోగాళ్లు మాత్రమే కాదు, గళ్లలుంగీ జాలి జాలి అంగీ, ముఖం మీద పులిపిరి, మెడల పులిగోరు ఈ రౌడీలు మన ప్రాంతంల పుట్టిన్రా. పుట్టే అవకాశముందా? ఈ బెజవాడ రౌడీలే ముదిరి అసెంబ్లీరౌడీలైన్రు. ఇయ్యాల తెలంగాణకు ఎట్లన్న అణగవట్టాలెనని చూస్తున్నరు.

పాత సినిమాలల్ల పట్నం అంటే చెన్నాపట్నమే తప్ప మన హైద్రాబాద్ కాదు. సినిమా పేరేందో యాదికొస్తలేదు 1956 తర్వాత వచ్చింది. అండ్ల మొదటిసారి విలన్ హీరోయిన్ హైదరాబాద్‌కు ఎత్తుకొస్తడు. కాపాడెటందుకు బయలుదేరిన హీరో రామారావుతో తల్లి ‘అయ్యో హైద్రాబాద్ వంటి పరాయి ప్రాంతానికి పోతున్న కొడుకును చూసి గాభారాపడుతది. దానికి హీరో రామారావు ఫర్వాలేదులే అమ్మా ఇప్పుడక్కడ మనవాళ్లు చేరిపోయిన్రని భరోసా ఇస్తడు. విలీనం తర్వాత హైదరాబాద్‌పై వలసవాద వ్యక్తీకరణ అది. 1957లో వచ్చిన ఎమ్మెల్యే సినిమాల ఆరుద్ర రాసిన ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము అనే పాట వలసకు తొవ్వజూపిస్తున్నట్లుంటది. 1969 ఉద్యమాన్ని వేర్పాటువాదంగా చిత్రీకరించేందుకు ఎన్టీఆర్ సినిమాను ప్రయోగించిండు. ‘తల్లా పెళ్ళామా’ సినిమాల “తెలుగుజాతి మనదీ” అనే పాట సమైక్యవాదులకు ఆయన అందించిన ఆయుధమే.

రామారావు పాలన ఆలంబనగా వలస హైదరాబాద్‌ను అనకొండ చుట్టినట్టు చుట్టింది. రామారావు రాజకీయ ప్రవేశానికి పత్రికలు, సినిమాలే వాతావరణ కల్పన చేసినయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను బఫూన్‌ల వలె చూపిస్తూ సినిమాలు వచ్చినయి. హైద్రాబాద్‌కు సముద్రం కావాలెనని డిమాండ్ చేసేంత మూర్ఖులు తెలంగాణ నాయకులు అన్నట్లు సినిమాల్లో పాత్రలు సృష్టించిన్రు. ప్రగతిశీల సినిమాలు తీసిన టి. కృష్ణ కూడా ప్రతిఘటన సినిమాల వెంకటస్వామిని పోలిన పాత్రను పెట్టి వెక్కిరించిండే తప్ప ఆ సినిమాకు కాసులు సమకూర్చిన వలసవాదాన్ని ప్రతిఘటించలేదు.

పట్నం శివారుల్ని చాపచుడుతున్న ఆంధ్ర నయా జమీందార్ల కన్నా కోడిరామకృష్ణకు, కొత్తదాసు, ముక్కా నరసింగరావు తరహా చోటా మోటా దాదాలలోనే ఎక్కువ విలనిజం కనిపించింది. రామిరెడ్డి వేషానికి రౌడీ ముసుగు తగిలించాడు. రాంగోపాల్‌వర్మ కాలానికి హైద్రాబాద్‌లో బెజవాడలు లేచినయి. ఎక్కడ చూసినా గుంటూరు బస్సులు, ఆంధ్రా మెస్సులు బందరు లడ్లు, స్వగృహా పుడ్లు మొలిచినయి. హైద్రాబాద్ పూర్తిగా బెజవాడకాలేదని రాంగోపాల్‌వర్మకు మా చెడ్డ చిరాకు. విజయవాడ కన్నుతోటి హైద్రాబాద్‌ను చూసే రాంగోపాల్‌వర్మ ఇక్కడి ఆటోవాళ్లను తన సినిమాలల్ల వెటకారం చేస్తడు. ‘శివ’ సినిమాల నాగార్జున ఆంధ్రా నుంచి వచ్చి నిజాం కాలేజీలో చదువుతుంటడు. కాలేజీ క్యాంటీన్ల సర్వర్ యాదగిరి తెలంగాణ యాసల రామాయణం చెప్పుతుంటే తన విజయవాడ దోస్తులతోని కలిసి కక్కెడ కక్కెడ నవ్వుతడు. అది చూసి తెలంగాణ ప్రేక్షకులు నవ్విన్రు. ఆహా ఏమి దర్శకత్వ ప్రతిభ? సినిమా తెలంగాణ జీవితాన్ని ఎంత పరాయికరించిందో చెప్పేందుకు ఇంతకంటే బీభత్సం ఏం కావాలె?

ఇప్పుడు తెలుగు సినిమాలకు విలన్లు హైద్రాబాద్ యాదవులు. వీళ్లు ఆంధ్రావాళ్ల దృష్టికి దిష్టిబొమ్మల వలె కనిపిస్తున్నరు. రాజమౌళి ‘సై’సినిమాల భిక్షుయాదవ్ బర్రెల మధ్య బర్రె వలె ఉంటడు. కారుకు కూడా కొమ్ములు పెట్టుకొని తిరుగుతడు. సినిమాలలో యాదవుల పశుపాలన సంస్కృతిని అడుగడుగునా హేళన చేస్తున్నరు. రుమాలు చుట్టుకునుడు, కల్లు తాగుడు హైద్రాబాద్ విలన్లకు ఉండే అసహ్యకరమైన లక్షణాలు. హైద్రాబాద్ యాదవులు ఎంత పశువుల తీరుగ కనిపించకుంటే వి.వి.వినాయక్ విలన్‌కు ‘గొడ్డేశు’ అని పేరు పెడుతడు. హైద్రాబాద్ యాదవ స్త్రీలు రౌడీ శకుంతల వలె కనిపిస్తున్నరు వీళ్ల కండ్లకు. యాదగిరి పేరు జోకరుకు, సింహాద్రి పేరు హీరోకు పెడుతరు. గుంటూరు నుంచో గూడూరు నుంచో వచ్చిన హీరో హైద్రాబాద్ యాదవులను 15 రీళ్లు తన్నీ తన్నీ కంగాళగ ఉన్న హైద్రబాద్‌ను శుభ్రపరిచి శుభం కార్డు వేస్తడు. ఇది మన పాలిట సినిమా. ఇంకెన్నాళ్లు చూడాలె.

రామారావు కాంగనె బాలకృష్ణను నాగేశ్వరావు కాంగనె నాగార్జునను, నాగచైతన్యను, చిరంజీవి కాంగనె చిరుతను. అవును వాళ్లు చిరుతలు, మనం మిడుతలం. ఇగ చాలు మా నీళ్లు మాగ్గావాలె, మా భూములు మాగ్గావాలె అన్నట్లే మా సినిమాలు మాగ్గావాలెనని గర్జిద్దాం. తెలంగాణ సినిమా యుగాన్ని, సినిమాలలో తెలంగాణ యుగాన్ని తెప్పిద్దాం. ఉద్యమ, ప్రవాహాలతో పునీతమైన మన నేల మీద మన మట్టిరంగుల సినిమాని మనమే నిర్మిద్దాం.

[Courtesy: నమస్తే తెలంగాణ]

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,281 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>