Home / తెలుగు / తెలంగాణ ‘ఇంజనీర్సు డే’ గా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి (జులై 11)

తెలంగాణ ‘ఇంజనీర్సు డే’ గా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి (జులై 11)

nawab jungతెలంగాణ ఆర్థర్ కాటన్…నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి దేశవ్యాప్తంగా తెలియని వారుండరు. ఆయన భారతదేశం గర్వించదగ్గ ఇంజనీరు. భారతరత్న బిరుదాంకితుడు. భారతదేశంలో నీటి పారుదల రంగానికి పునాదులు వేసిన తొలి తరం మేధావి. అటువంటి మేధావికి సమకాలికుడు, అంతటి స్థాయి కలిగిన ప్రతిభావంతుడైన ఇంజనీరు నవాబ్ అలీ నవాజ్‌జంగ్. హైదరాబాద్ రాజ్యంలో పటిష్టమైన ప్రణాళికలు రచించి, అనేక భారీ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ తెలంగాణ సాగునీటి రంగానికి పితామహుడు.నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్‌గా ప్రపంచానికి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు పరిచితుడైన ఈయన అసలు పేరు మీర్ అహ్మద్ అలీ. 11-7-1877న హైదరాబాద్‌లో జన్మించాడు. హైదరాబాద్ రాజ్యంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మీర్ అహ్మద్ అలీ హైదరాబాద్ అబిడ్స్‌లోని సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసుకొన్నాడు. ఇంగ్లీషుతో పాటు లాటిన్ భాషను కూడా నేర్చుకొన్నాడు. ఆ తర్వాత నిజాం కాలేజీలో చేరాడు. అక్కడ నాలుగేండ్లు ఉన్నత విద్యను అభ్యసించి 1896లో ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌తో ఇంగ్లండ్‌లో ప్రఖ్యాతి గాంచిన కూపర్‌హిల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరి, సివిల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. కూపర్ హిల్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతిభావంతుడైన విద్యార్థిగా తన బ్యాచ్‌లో ప్రథముడిగా నిలిచి అనేక స్కాలర్‌షిప్‌లను అందుకున్నాడు.1899లో ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చి అదే సంవత్సరం హైదరాబాద్ ప్రభుత్వ ప్రజాపనుల విభాగంలో (పీడబ్ల్యూడీ)లో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరి, అంచెలంచెలుగా ఎదిగి చీఫ్ ఇంజనీరయ్యాడు. ఆ తర్వాత చీఫ్ ఇంజనీరు సెక్రటరీగా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశాడు. తర్వాత కూడా హైదరాబాద్ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి సాంకేతిక సేవలు అందించాడు. హైదరాబాద్‌లో ప్రభుత్వంలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరినపుడు ఆయన వేతనం రూ.400, పదవీ విరమణ సమయంలో ఆయన వేతనం రూ.3350.

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిర్వహించిన పదవులు
- అసిస్టెంట్ ఇంజనీర్ – గుల్బర్గా జిల్లా
- అసిస్టెంట్ ఇంజనీర్ – మహబూబ్‌నగర్ జిల్లా
- అసిస్టెంట్ ఇంజనీర్ – మెదక్ జిల్లా
- అసిస్టెంట్ ఇంజనీర్ – వరంగల్ జిల్లా
- అసిస్టెంట్ ఇంజనీర్ – హైదరాబాద్ మున్సిపాలిటీ
- అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఇంజనీర్, సాగునీరు
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సాగునీరు- హైదరాబాద్
- సూపరింటెండింగ్ ఇంజనీరు, సాగునీరు- హైదరాబాద్
- చీఫ్ ఇంజనీరు, సెక్రెటరీ, పి.డబ్ల్యూ.డి., సాగునీరు (1918 నుండి 1937 దాకా)
- నిజాం వ్యక్తిగత కన్సల్టింగ్ ఇంజనీర్ (1937-1938)

నవబ్ అలీ నవాజ్ జంగ్ రూపకల్పన చేసిన/నిర్మించిన ప్రాజెక్టులు
- ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ (హైదరాబాద్)
- పోచారం ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టు (నిజామాబాద్ జిల్లా)
- వైరా ప్రాజెక్టు, పాలేరు ప్రాజెక్టు (ఖమ్మం జిల్లా)
- ఢిండీ ప్రాజెక్టు, రాయనిపల్లి, సింగభూపాలం, తుంగభధ్ర కొయిల్ సాగర్ (మహబూబ్‌నగర్ జిల్లా)
- కడెం ప్రాజెక్టు (ఆదిలాబాద్ జిల్లా)

- మూసీ ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా)
- చంద్రసాగర్ ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా)
- రాజోలిబండ ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)
-పోచంపాడు ప్రాజెక్టు (నిజామాబాద్ జిల్లా)
- నందికొండ ప్రాజెక్టు (నల్లగొండ జిలా)
- పెండ్లిపాకు ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా)
- సరళాసాగర్ ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)
- పూర్ణా ప్రాజెక్టు (మహారాష్ట్ర)
- భీమా ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)
-దేవనూరు ప్రాజెక్టు (మెదక్ జిల్లా)
- పెన్‌గంగ ప్రాజెక్టు (మహారాష్ట్ర)
- ఇచ్చంపల్లి ప్రాజెక్టు (కరీంనగర్ జిల్లా)
-లోయర్ మానేరు ప్రాజెక్టు (కరీంనగర్ జిల్లా)

-ముప్పయి ఏండ్ల తన సుధీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో 18 ఏండ్లు చీఫ్ ఇంజనీరు, సెక్రెటరీగా పనిచేసిన రికార్డు అలీ నవాజ్ జంగ్‌దే. ఈ పదవీ కాలంలో ప్రజాపనుల విభాగాన్ని పటిష్టమైన పునాదులపై నిలిపాడు. ఆయన నేతృత్వంలో హైదరాబాద్ రాజ్యంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, వంతెనలు, భవనాలు నిర్మితమైనాయి. ప్రజాపనుల విభాగంపై తనదైన ముద్రను వేశాడు. ఆయన సాధించిన విజయాలకు హైదరాబాద్ రాజ్యంలోనే కాదు భారతదేశంలోనూ గుర్తింపు వచ్చింది.

ఆయన ప్రదర్శించిన సాంకేతిక నైపుణ్యాన్ని భారత ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి తమ రాష్ట్రాలలోని ప్రాజెక్టుల రూపకల్పనలలో, నిర్మాణ సమస్యలపై సంప్రదింపులు, సలహాల కోసం ఆహ్వానించేవి. అట్లా అలీ నవాజ్ జంగ్ సలహాలు సూచనలతో బొంబాయి, బీహార్, ఒరిస్సా, మద్రాసు, సింద్ రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో సాంకేతిక సమస్యలను అధిగమించాయి.

1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్లానింగ్ కమిటీ జవహర్‌లాల్ నెహ్రూ చైర్మన్‌గా ఏర్పాటైంది. ఈ ప్లానింగ్ కమిటి ‘సాగునీరు, నదుల మళ్లింపు’ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఒక సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటికి నవాబ్ అలీ నవాజ్ జంగ్ చైర్మన్‌గా నియమితులు కావడం ఆయన ప్రతిభకు నిదర్శనం. అలీ నవాజ్‌జంగ్ నేతృత్వంలోని సబ్ కమిటీ నదీ జలాల వినిమోగంపై, తాగునీటి పథకాలపై, జల విద్యుత్ పథకాలపై, వరద నియంవూతణ పథకాలపై, జలరవాణా పథకాలపై, కాలువలు, చిన్న నీటి చెరువుల నిర్మాణాలపై సమక్షిగమైన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మూడు విభాగాలున్నాయి. మొదటిది భారతదేశంలో సాగునీటి పథకాల నిర్మాణం, రెండవది నదుల మళ్లింపు-వరద నియంవూతణ పథకాలు, మూడవది జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం.

అలీ నవాజ్ జంగ్ ఇతర నిర్మాణాలు
నవాబ్ అలీ నవాజ్ జంగ్ సాగునీటి రంగంలోనే కాదు రోడ్లు, భవనాలు రైల్వేలు, టెలిఫోన్లు, వంతెనలు తదితర ఇతర రంగాలలో తన ప్రతిభను చాటుకున్నాడు. గోదావరి, కృష్ణా వంటి పెద్ద నదులపై ఆయన హయాంలో నిర్మితమైన రాతి వంతెనలు వందల సంవత్సరాలు సేవలందించాయి. గోదావరి నదిపై ఆదిలాబాల్ జిల్లా సోన్ గ్రామం వద్ద నిర్మితమైన వంతెన రెండేండ్ల కింద కొత్త వంతెన నిర్మించేదాకా సేవలందించింది. దాన్ని ఇప్పటికీ ‘అలీ నవాజ్ జంగ్ బ్రిడ్జి’గా పిలుస్తారు.

భవన నిర్మాణ రంగంలో ఆయన ప్రతిభకు తార్కాణాలు
- ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం, హాస్టల్ భవనాలు.
-ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనం (1933-34).
- ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్.
- ఫతేమైదాన్‌లో మహబూబియా గ్రాండ్ స్టాండ్.
- పబ్లిక్ గార్డెన్స్‌లోని ఉస్మానియా జూబ్లీహాలు.
- అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనం.
- మక్కా మసీదు దగ్గర సదర్ నిజామియా షఫాఖానా.
- మహబూబియా బాలికల పాఠశాల.
- నాందేడ్ సివిల్ హాస్పిటల్.
- సైన్యం కోసం రెండవ లాన్సర్స్ బిల్డింగ్స్, కేవలరీ ట్రెయినింగ్ స్కావవూడన్, చాంద్రాయణ గుట్ట, మల్లేపల్లి లైన్స్.
- నిజాంసాగర్, నిజాం చక్కెర కర్మాగారం.

సాగునీటి రంగంలో, నిర్మాణ రంగంలో ఆయన ప్రతిభావంతుడన్న దానికి తిరుగులేని నిదర్శనాలు పైన చూశాం. ఆయన ముందు చూపు కలిగిన ఓ ఆర్థికవేత్త, గొప్ప పరిపాలనాదక్షుడు కూడా. నిజామాబాద్ జిల్లా ముఖచిత్రాన్ని మార్చివేసిన రెండు ప్రధాన నిర్మాణాలకు అలీ నవాజ్‌జంగ్ దార్శనికతే కారణం. అవి మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు, బోధన్‌లో నిర్మించిన నిజాం చక్కెర కర్మాగారం. 2,75,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగించడానికి మంజీరాపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు 1933 నాటికే పూర్తయ్యింది. మొత్తం హైదరాబాద్ రాజ్యంలోనే నిజామాబాద్ జిల్లా ఈ ప్రాజెక్టు కారణంగా సంపద్వంతమైన జిల్లాగా మారింది. మొత్తం దేశానికి, తెలంగాణకు గర్వకారణంగా రూపొందించిన నిజాం చక్కెర కర్మాగారం ఆనాటికే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్యాక్టరీ. దీనికి అవసరమయ్యే చెరుకును పండించడానికి నిజాం కాలువల కింద వందల ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. చంద్రబాబు నాయుడు అమలు పరిచిన ప్రైవేటీకరణ విధానాలతో నిజాం చక్కెర కర్మాగారం మూతపడింది. నిజాంసాగర్ ప్రాజెక్టులో భాగంగా అలీసాగర్ బ్యాలెన్సింగ్ జలాశయం కూడా నిర్మితమైంది. అది అలీ నవాజ్ జంగ్ పేరుమీద ‘అలీసాగర్’గా ప్రసిద్ధి చెందింది.

వరద జలాల అంచనాకు ఫార్ములా
భారతదేశంలోని నదులపై గరిష్ట వరద ప్రవాహం అంచనాకు అత్యంత సాధారణంగా ఉపయోగించేవి డికెన్స్ ఫార్ములా, రైవ్స్ ఫార్ములా. ఈ ఫార్ములాలను ఉపయోగించి లెక్కించిన గరిష్ట వరద ప్రవాహం అంచనా వాస్తవ వరద ప్రవాహం పరిమాణానికి చాలా పెద్ద అంతరం ఉండటం అలీ నవాజ్ జంగ్ గమనించాడు. ఈ సూత్రాలకున్న పరిమితుల కారణంగానే ఈ అంతరాలున్నట్లు గమనించి వాస్తవ పరిస్థితులకు సరిపోయే విధంగా ఒక ఫార్ములాను అలీ నవాజ్‌జంగ్ రూపొందించారు. ఇదే ‘అలీ నవాజ్‌జంగ్ ఫార్ములా’గా ప్రసిద్ధి చెందింది. హైడ్రాలజీ పాఠ్యపుస్తకాలలో ఈ ఫార్ములాను డికెన్స్, రైన్స్ ఇతర ఫార్ములాల సరసన చేర్చి విద్యార్థులకు బోధిస్తారు.

తను రూపొందించిన ఫార్ములా సమర్థతను డింఢీ ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహాన్ని అంచనా కట్టి, మిగతా ఫార్ములాల కన్న తన ఫార్ములా వాస్తవిక వరద జలాల పరిమాణానికి ఎంత దగ్గరగా ఉందో నిరూపించాడు. డింఢీ డ్యాం స్థలం వద్ద 1513 చదరపు మైళ్ల పరీవాహక విస్తీర్ణం కలిగి ఉన్న ఢిండీ నదిలో గరిష్ట వరద ప్రవాహం 2,76,000 క్యూసెక్కులని తేలింది. అలీ నవాజ్‌జంగ్ ఫార్ములాతో లెక్కిస్తే అది 2,71,500 క్యూసెక్కులు.

హైదరాబాద్ రాజ్యంలోని దాదాపు అన్నీ చిన్న, పెద్ద నదులపై అలీ నవాజ్ జంగ్ సర్వేలు చేశాడు. నివేదికలు సిద్ధం చేసి ఉంచాడు. ఏ నదిపైన ఎప్పుడైనా నివేదిక అందించడానికి సిద్ధంగా ఉండేవాడు. ఉదాహరణకు 1951లో ప్లానింగ్ కమీషన్ కృష్ణానదిపై నందికొండ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను ఇమ్మని అడిగినప్పుడు అప్పటికే అలీ నవాజ్ జంగ్ కృష్ణానదిపై సంపూర్ణమైన సర్వేలు చేసి ఉన్నాడు. ఆయన ఆనాటికి బతికి లేకున్నా నెలరోజుల్లోనే ప్లానింగ్ కమీషన్‌కు ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను హైదరాబాద్ ఇంజనీర్లు అందించగలిగారు. పోచంపాడ్ ప్రాజెక్టుపై అప్పర్ కృష్ణా ప్రాజెక్టుపైన కూడా అలీ నవాజ్ జంగ్ జరిపి ఉంచిన సర్వేలు తర్వాత కాలంలో ఆ ప్రాజెక్టుల రూపకల్పనలో ఎంతగానో ఉపయోగపడ్డాయి.

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువుల నిర్మాణం
1908లో మూసీనదికి వచ్చిన వరదలు, హైదరాబాద్ నగరంలో అవి సృష్టించిన బీభత్సం, సంభవించిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అందరికీ తెలిసిందే. 28 సెప్టెంబర్ 1908న మూసీకి వచ్చిన వరద ఇప్పటికీ రికార్డే. ఆ వరద బీభత్సానికి మూసీ దక్షిణపు ఒడ్డున అర చదరపు మైలు విస్తీర్ణంలో సుమారు 19 వేల ఇండ్లు కూలిపోయాయి. 8000 వేల మంది నిరాక్షిశయులయ్యారు. మూడు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. పది నుండి పదిహేను వేల మంది వరదల్లో కొట్టుకుపోయి, చనిపోయినట్లు అంచనా. మూసీకి తరచుగా వస్తున్న వరదల నియంవూతణకు నివారణా చర్యలు సూచించమని మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌కు ఆహ్వానించాడు. హైదరాబాద్ విచ్చేసిన విశ్వేశ్వరయ్య తనకు సహాయకారిగా ఉండేందుకు ఎంపిక చేసుకున్న ఇంజనీర్లలో ప్రథముడు కూపర్ హిల్ విద్యార్థి అయిన అలీ నవాజ్ జంగ్. అప్పటికే ఆయన ప్రజాపనుల శాఖకు చీఫ్ ఇంజనీరుగా (సాగునీరు) వ్యవహరిస్తున్నాడు. వారిద్దరి మేథో మధనంలోంచి ఉద్భవించినవే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువులు. ఈ రెండు చెరువులు మూసీ నదిలో వరదలని నియంవూతించడమే కాక నగరానికి శాశ్వత తాగునీటి వనరులుగా ఇప్పటికీ సేవలందిస్తున్నాయి.

ఉస్మాన్‌సాగర్ చెరువు మూసీనదిపై, హిమాయత్‌సాగర్ చెరువు మూసీకి ఉపనది అయిన ఈసీపై ప్రతిపాదించారు. ఉస్మాన్‌సాగర్ పేరు నిజాంమీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ పేరుతో, హిమాయత్‌సాగర్‌ను బేరార్ రాకుమారుడు హిమాయత్ అలీఖాన్ బహదూర్ పేరుతో నిర్మించారు.

6 డిసెంబర్ 1949న అలీ నవాజ్ జంగ్ చివరి శ్వాస విడిచినప్పుడు ఆయన అంతిమయావూతలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌తో పాటు అనేకమంది ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు.
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం సందర్భంగా పురాతన తవ్వకాలలో దొరికిన, తెలంగాణ గర్వించదగిన కోహినూర్ వజ్రం నవాబ్ అలీ నవాజ్ జంగ్. ఆయన జీవితం, ఆయన సాధించిన విజయాలు తెలంగాణ ఇంజనీర్లకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. దానితోనే తెలంగాణ సర్వీసు ఇంజనీర్లు , ఇంజనీర్లు (అ)విక్షిశాంత ఇంజనీర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమవుతున్నారు. ఆయన సమున్నత వారసత్వాన్ని కొనసాగించడానికి వారంతా సమాయత్తమవుతున్నారు.

- నిశాంత్ దొంగరి 
( శ్రీధర్ రావు దేశ్ పాండే గారి రచన ‘తెలంగాణా సాగునీటి రంగ పితామహుడు -నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్’ లోంచి )

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,281 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>