Home / తెలుగు / అహంకారమా, భావప్రకటనా స్వేచ్ఛా?

అహంకారమా, భావప్రకటనా స్వేచ్ఛా?

భావ ప్రకటనా స్వేచ్ఛ మనిషికి ఉండే హక్కులలో అత్యున్నతమైనది. అందులో భిన్నాభిప్రాయం లేదు. ప్రతి మనిషికీ ఏ భావాలైనా కలిగి ఉండే స్వేచ్ఛ, వాటిని ప్రకటించే స్వేచ్ఛ తప్పనిసరిగా ఉండాలి. ఆ మాట అంగీకరిస్తూనే అసలు భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఏమిటో కూడ విశ్లేషించుకోవలసి ఉంది. మనిషి అంటే ఒంటరి రాబిన్సన్ క్రూసో కాదు, మరొకరు కనబడని ద్వీపం మీద లేడు. అసలు అలా ద్వీపం మీద ఉంటే భావాలు ప్రకటించవలసిన అవసరమే రాదు. మనిషంటే తోటి మనుషులతో నిత్య సంబంధంలో ఉండడమనే అర్థం. అందువల్ల ఒక మనిషికి ఉండే హక్కులన్నిటినీ తోటి మనుషులతో సంబంధంలోనే నిర్వచించాలి గాని వాటికి “మెరుగైన సమాజ నిర్మాతల”, “అక్షరాయుధ” ధారుల సొంత, అహంకారపూరిత నిర్వచనాలు కుదరవు. అందుకే “నా పిడికిలి ఊపే హక్కు నీ ముక్కు మొదలయ్యే దగ్గర ముగిసిపోతుంది” అని అమెరికన్ న్యాయనిపుణుడు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆలివర్ వెండెల్ హోల్మ్స్ అన్నమాట హక్కుల మీద హేతుబద్ధమైన పరిమితికి అద్దం పట్టింది.

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, “మెరుగైన సమాజం కోసం”, “కులరహిత సమాజం కోసం” పాటుపడుతున్నానని తనకు తాను చెప్పుకునే మహా ఘనత వహించిన ఒకానొక తెలుగు టెలివిజన్ ఛానల్‌కు వ్యతిరేకంగానూ, తన అక్షరం ప్రజల ఆయుధంగా చెప్పుకునే మరొక దినపత్రికకు వ్యతిరేకంగానూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో వ్యాఖ్యానించవచ్చునా, చర్యలు తీసుకుంటామని అనవచ్చునా, ఆ ఛానల్ ముందర నిరసన ప్రదర్శనలు జరపవచ్చునా, ఆ ఛానల్‌నూ, మరికొన్ని ఛానళ్లనూ ప్రసారం కాకుండా నిరోధించవచ్చునా అని గౌరవనీయ మిత్రులు కొందరికి ధర్మసందేహాలు కలుగుతున్నాయి. అతి భయంకరంగా దురుపయోగమవుతున్న పత్రికాస్వేచ్ఛ అనే ముసుగు కింద అత్యంత దారుణమైన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు చలామణీ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. ప్రచారసాధనాల మీద ప్రభుత్వ ఒత్తిడిని తప్పనిసరిగా ఖండించవలసిందే. కాని ఆ ప్రచారసాధనాల పనితీరు కూడ చర్చనీయాంశం కావలసిన ఒక ప్రత్యేక పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని కూడ గుర్తించవలసి ఉంది.
తెలంగాణ సమాజానికి, సంస్కృతికి, రాజకీయ, సామాజిక నాయకత్వానికి వ్యతిరేకంగా కొన్ని టెలివిజన్ ఛానళ్లు, పత్రికలు ఈ పత్రికా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ అనే ముసుగుల కిందనే ఎన్నో సంవత్సరాలుగా దుర్మార్గమైన ప్రచారాలు చేస్తూవస్తున్నాయి. చిన్నచూపు, అవహేళన, వెటకారం, దుష్ప్రచారం, అబద్ధం, అర్ధసత్యం, నింద వంటి దినుసులతో వండిన విష పదార్థాన్ని పంచిపెడుతున్నాయి. ఆ బేహద్బీ మీద వ్యతిరేకత కూడ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగమై, ఆ ఉద్యమం చివరకు విజయం సాధించింది. ఆ ఛానళ్ల, పత్రికల యాజమాన్యాలకు మర్యాద అనేది తెలిసి ఉంటే, తెలుగు మాట్లాడే ప్రజలు అన్నదమ్ముల్లా ఉండాలనే కోరిక ఉండి ఉంటే, కనీసం తెలంగాణ రాష్ట్రంలో తమ వ్యాపారం సాగాలన్నా పాత పద్ధతులు పనికి రావనే ఇంగిత జ్ఞానం ఉండి ఉంటే, ఆ పద్ధతులను సంస్కరించుకుని ఉండేవారు. కాని రాష్ట్రం ఏర్పడి, రాష్ట్రానికి స్వయం పాలనాధికారం వచ్చి, ఒక శాసనసభ, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడ ఆ ఛానళ్లు, పత్రికలు తమ అహంకారమే కమ్మదనం అనుకుంటున్నాయి. ఆ అహంకారం వదులుకోవడమంటే చేదు అనుకుంటున్నాయి. గాలివార్తలనూ నీలివార్తలనూ సృష్టించి ప్రచారం చేస్తున్నాయి. పాత పద్ధతిలోనే తెలంగాణ సమాజం మీద నోరు పారేసుకుంటున్నాయి. పాలకవిధానాలను విమర్శించడం ఒక ఎత్తు. ప్రజలను అవమానించడం మరొక ఎత్తు. మొదటి పని తప్పకుండా చేయవలసిందే. కాకపోతే ఆ పని హేతుబద్ధమైన, సవ్యమైన ప్రాతిపదికల మీద జరగాలి. రెండవ పని ఎప్పుడైనా, ఏ కారణంతోనైనా జరగగూడనిది.

ప్రజలను అవమానించడం అనే ఆ రెండో పని జరిగిన నేపథ్యంలో ప్రస్తుత భావప్రకటనా, పత్రికాస్వేచ్ఛ చర్చ జరగవలసి ఉంది. ఏ చర్చ అయినా శూన్యంలో జరగడానికి అవకాశం లేదు. నిర్దిష్ట దేశ, కాల, పాత్రల సందర్భంలోనే జరుగుతుంది. ఏదైనా మొదలైన దగ్గర మొదలు పెట్టడం మంచిది. ప్రస్తుత వ్యవహారమంతా ఎక్కడ మొదలైంది?
టివి 9 అనే టెలివిజన్ వార్తా ఛానల్‌కు బులెట్ న్యూస్ అనే, వ్యంగ్యం పేరుతో నడిచే వెకిలి, చౌకబారు, మొరటు కార్యక్రమం ఒకటుంది. దాదాపు అన్ని ఛానళ్లకూ ఇటువంటి నీచమైన కార్యక్రమాలు ఉన్నాయి గనుక, యజమానుల, అధిపతుల నీచ ప్రవృత్తులను వీక్షకుల మీద ఇరవై నాలుగు గంటలూ రుద్దడం జరుగుతున్నది గనుక దీనికిదిగా పెద్ద వార్త కాదు. కాని తెలంగాణ శాసనసభలో ప్రమాణస్వీకారాల గురించి, తొలిరోజున శాసన సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన లాప్ టాప్ కానుకల గురించి జూన్ 10న ఆ కార్యక్రమంలో ఒక వార్తావ్యాఖ్య చదివారు, కొన్ని దృశ్యాలు ప్రచారం చేశారు. ఆ అసహ్యకరమైన వ్యాఖ్య ఉటంకించవలసి వచ్చినందుకు సిగ్గుగా ఉంది. కాని, మన మేధావులకు, రచయితలకు, ప్రచారమాధ్యమాల అధినేతలకు ఉన్న వర్గ, కుల, ప్రాంతీయ అహంకారాలకు అద్దం పట్టే ఆ వ్యాఖ్యను పూర్తిగా చదివితేనే, దాన్ని భావప్రకటనా స్వేచ్ఛ అనవచ్చునా లేదా తేలుతుంది గనుక ఉటంకిస్తున్నాను. చూడండి:
“టూరింగ్ టాకీసుల పాత సినిమాలు సూశెటోల్లను పట్టుకొచ్చి మల్టిప్లెక్స్‌ల హాలివుడ్ సినిమా సూపెడితె ఎట్లుంటది? ఇగో ఇట్లనే ఉంటుండొచ్చు. అసెంబ్లీని ఫస్టుసారి దగ్గర్నించి సూశినందుకు సంతోషవడాల్నో, ఏడవాల్నో ఏంజేయాల్నో తెలవక, భయపడాల్నో అర్థంకాక, బిత్తరసూపులు సూశిండ్రట మన లీడర్లు. ఈళ్ల ప్రవర్తనే కాదు, ప్రమాణ స్వీకారం ఎపిసోడు కూడా కామెడి కామెడీ అయిందట…. పాశి కల్లు తాగెటోనికి ఫారిన్ మందు ముందల బెట్టినట్టే ఉన్నది మన తెలంగాణ ఎమ్మెల్యేల కత. ఓట్లేశి మరీ షార్ట్ కట్ల సక్కగ తీస్కపోయి అసెంబ్లీల కూసోబెడితె ప్రమాణస్వీకారం కాడ్నే పర్ఫార్మెన్స్ అదరగొట్టి జనాలే దడుసుకునే తీరు చేసిండ్రు. మొకం గడుక్కోని వచ్చిండ్రు బానే కని ప్రమాణ స్వీకారం అయితె చెయ్యిండ్రి అనంగనె కాయితం సూసుకుంట సదువెతందుకు కూడ కొందరు తడవడ్డరు. అంతేనా, ఇట్ల సూసుకుంటనే సదవరానోళ్లకు తలా ఒక లాప్ టాప్ ఇచ్చిండ్రట. లంగోటి కట్టుకునేటోనికి లాప్ టాప్ ఇస్తే మడిశి యాడ్నో పెట్టుకున్నట్టు మరేంజేసుకుంటరో, ఏడ అమ్ముకుంటరో ఆళ్లకే తెలవాలె. కనిఇగ అవ్వి ఇయ్యంగనె తాగుబోతోనికి తొక్కు పచ్చడి దొరికినట్టు సంకలల్ల వెట్టుకోని అయితె పొయ్యిండ్రు. అసెంబ్లి లోపలికి పోయిన కాడికెల్లి ఒకటే కన్ఫ్యూజన్, ఏడ కూసోవాలె, ఎట్ల కూసోవాలె, బాత్ రూములు ఎటు, కాయితాలు ఏం జేసుకోవాలె, ఏసిలు ఎట్ల బంజేయాలె. ఇట్ల ఏం అర్థం కాక మస్తు కష్టాలు పడ్డరట ఇంక కొంతమంది అసెంబ్లీలకు అడుగుపెట్టంగనే అదేదో అంతరిక్షంలోకి పోయినట్టు పిచ్చి సూపులు సూసుకుంట నిలవడ్డరట…”

ఈ వ్యాఖ్య ఏమి చెపుతున్నది. టూరింగ్ టాకీసుల వాళ్లు ఒక వర్గం, మల్టిప్లెక్సుల వాళ్లు మరొక వర్గం. పాచికల్లు తాగేవాళ్లు ఒక వర్గం, ఫారిన్ మందు తాగేవాళ్లు మరొక వర్గం. కాగితం చూసి సరిగ్గా చదవలేనివాళ్లు ఒక వర్గం. చదివేవాళ్లు మరొక వర్గం, లంగోటి కట్టుకునేవాళ్లు ఒక వర్గం, లాప్ టాప్ బ్యాగులు పట్టుకునేవాళ్లు మరొక వర్గం. ఎక్కడ కూచోవాలో, ఎట్లా కూచోవాలో, బాత్ రూములు ఎక్కడో, కాగితాలు ఏం చేసుకోవాలో, ఏసీలు ఎట్లా ఆపు చేయాలో తెలియని వాళ్లు ఒక వర్గం. అవన్నీ తెలిసినవాళ్లు మరొక వర్గం. ఈ రెండు వర్గాలనూ కావాలంటే బడుగుకులాలు, అగ్రకులాలు అనుకోవచ్చు. నిరక్షరాస్యులు, విద్యావంతులు అనుకోవచ్చు. తెలంగాణ వాళ్లు, ఆంధ్రవాళ్లు అనుకోవచ్చు. వీరిలో మొదటివర్గానికి రెండో వర్గపు పనులు చేసే అర్హత లేదు. అనుకోకుండా (షార్ట్ కట్‌లో అని స్పష్టంగానే అన్నారు!) ఆ అవకాశం వస్తే “వర్ణ సంకరం”,“ధర్మగ్లాని” జరిగిపోతుంది. ఈ గీత చెదిరితే గొల్లుమనిపోతారు. ఇది టివి9 వ్యాఖ్యా రచయిత బుర్రలో పుట్టిన ఆలోచన కాదు. ఇది కుల, వర్గ, ప్రాంతీయ, ఆధిపత్య అహంకారం. భారత పాలకవర్గాల, సంపన్నవర్గాల సహజ అహంకారం. ఈ అహంకార ప్రదర్శనను భావప్రకటనా స్వేచ్ఛతో ముడిపెట్టడం భాషకే అవమానం. అలాగే ఒక పత్రిక తెలంగాణ ప్రభుత్వం అసమర్థమైనదనీ, తప్పుడు పనులు చేస్తున్నదనీ, తప్పటడుగులు వేస్తున్నదనీ చెప్పడానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి లేని వార్తలు కల్పిస్తున్నది. తన విద్వేషాన్ని వార్తలుగా వండి వడ్డిస్తున్నది. ఇంకా సరిహద్దులు, చెక్ పోస్టులు సక్రమంగా ఏర్పడకముందే, రెండు రాష్ట్రాలలోనూ బడ్జెట్లు ప్రవేశపెట్టి పన్నుల విధానాన్ని నిర్ధారించకముందే సరుకుల రవాణా పన్నుల గురించి భయవిద్వేషాలు రెచ్చగొట్టే వార్తలు రాసి ప్రచారం చేస్తున్నది. ఇది మరొకరకం అహంకారం.

ఈ అహంకారాన్ని తుత్తునియలు చేయకతప్పదు. ఔను, ఇవాళ ఈ వెటకారానికి గురవుతున్న మొదటివర్గం మనుషుల్లో కొందరు ఇవాళ కేవలం ప్రతీకాత్మకంగాశాసనసభలో ప్రవేశించారేమో గాని, మొత్తంగానే అధికారపీఠాలనూ, రాజకీయాలనూ, సమాజాన్నీ, సంస్కృతినీ, సకల రంగాలనూ ఆక్రమించే రోజొకటి వస్తుంది. మొదటి వర్గంశ్రమ వల్లనే రెండో వర్గానికి ఈ నాజూకులూ, పరిజ్ఞానాలూ, మేధస్సులూ, విలాసాలూ సమకూరాయి గనుక, ఏదో ఒకరోజు ఆ మట్టికాళ్లు ఈ ఎర్రతివాచీలను తొక్కక తప్పదు. ఆఇంద్ర భవనాలు నిర్మించిన చేతులు ఆ భవనాల బయట అస్పృశ్యులుగా ఉండే స్థితి నుంచి, ఆ భవనాలలో నిజమైన కాపురస్తులు కాకతప్పదు.

ఇటువంటి అహంకారపూరిత, తప్పుడు వార్తలను కూడ భావప్రకటనా స్వేచ్ఛ పేరు మీద అనుమతించాలని వాదించేవారి సహనానికి జోహార్లు. అవతలివాడుచితకబాదుతున్నప్పుడు చెయ్యి అడ్డం పెట్టడం కూడ తప్పని వాదించే అహింసావాదులకు జోహార్లు. చరిత్రను చూడకుండా, ఒక ఘటనను వేరుచేసి చూసి, దాని మంచిచెడులను అపార సునిశితత్వంతో విశ్లేషించగల మహామేధావులకు జోహార్లు.
హర్యానాలో బంధువా ముక్తి మోర్చా నాయకుడు స్వామి అగ్నివేశ్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల కింద ఒక వినూత్న పోరాటరూపాన్ని ప్రవేశపెట్టారు. వెట్టికార్మికులను,మట్టిమనుషులను వందలాదిగా తరలించుకువచ్చి, ఢిల్లీలోని ఐదు నక్షత్రాల హోటళ్లను ముట్టడించారు. ఆ విలాసవంతమైన హాళ్లనూ, నడవాలనూ, గదులనూ ఆ బరిబాతల బురద పాదాలతో పవిత్రం చేశారు. అటువంటి పోరాటరూపాలూ, చరిత్ర పాఠాలూ మరిచి పోతున్నామనడానికి గుర్తు ఇవాళ ఆ టివి వ్యాఖ్యాత వెటకారం. మనంమరిచిపోయినా, వెటకరించినా చరిత్ర గమనం ఆగదు.

–ఎన్ వేణుగోపాల్ [AndhraPrabha]

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,282 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>