Home / తెలుగు / తెలంగాణ ఆత్మ ఆవిష్కరణ

తెలంగాణ ఆత్మ ఆవిష్కరణ

KCR-speechతెలంగాణ రాష్ట్రం వస్తే ఏమవుతుందో ఇన్నాళ్లూ కలల్లో బతికిన తెలంగాణ ప్రజానీకం ఇప్పుడు వాస్తవాలను కళ్లారా చూస్తోంది. కళ్లముందే భూములను కాజేస్తుంటే.. కుంభకోణాలు చేసేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బతికిన సగటు తెలంగాణ జీవి ఆక్రోశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తనదిగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. రాజు సరిగ్గా ఉంటేనే ప్రజల నడవడిక సరిగ్గా ఉంటుందనే నానుడికి తగ్గట్లుగా కేసీఆర్ తన దారిని ఎంచుకుని చూపించారు. సమైక్యరాష్ట్ర పాలనలో ప్రతి పథకం కుంభకోణమేనని ధైర్యంగా ప్రకటించిన కేసీఆర్ రాబోయే రోజుల్లో తెలంగాణను బంగారంగా మార్చుతామని స్పష్టం చేశారు. భూదాన యజ్ఞబోర్డు భూములను, దేవాదాయ భూములను, ఇతర ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నవారినెవ్వరినీ వదిలిపెట్టేది లేదని చెప్పారు. అలాంటి అక్రమాలకు పాల్పడినవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్పగించాలని, లేకుంటే వారికి జైలు జీవితమే గతి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

ల్యాంకో సంస్థ ఇతర సాఫ్ట్‌వేర్ సంస్థల పేరుతో రక్షణ పొందేందుకు ప్రయత్నిస్తే కుదరదని, దీనిపై తాము వెనుకకుపోయేదిలేదని తేల్చిచెప్పారు. ఇక గత పాలకులు చేపట్టిన ప్రతి పని కుంభకోణమే అంటూ ఉదాహరణలతో వెల్లడించారు. గృహనిర్మాణ పథకం, రేషన్‌కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ.. ఇలా అన్ని పథకాలూ కుంభకోణాల మయమేనని స్పష్టం చేశారు. అదే సమయంలో తెలంగాణకు అనుకూలంగా ఉన్న వాటిని కొనసాగిస్తామని కూడా ప్రకటించి, వాటి గౌరవాన్ని కాపాడారు. కుంభకోణాల్లో బాధ్యులైన అధికారులనూ వదిలిపెట్టబోమంటూ స్పష్టం చేశారు. ప్రధానంగా కుంభకోణాలు, కబ్జాలతో అల్లాడిన యావత్తు తెలంగాణ ప్రజానీకం మోముపై చిరునవ్వులు చిందించేలా కేసీఆర్ క్యాబినెట్‌లో నిర్ణయాలు తీసుకున్నారు. నిర్లక్ష్యానికి, అణిచివేతకు గురైన ఆరు దశాబ్దాల పౌరులు ఇదీ మా ప్రభుత్వం అని చాటుకునేలా వ్యవహరిస్తున్నారు. 

కేవలం ఈ అంశాలే కాకుండా తెలంగాణ ప్రజానీకం మెచ్చేలా క్యాబినెట్‌లో మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 500 జనాభాకు మించిన ప్రజానీకం ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా చేస్తామని ప్రకటించారు. గత సమైక్య పాలకులపై ఎన్నోసార్లు తిరుగుబాట్లు, ధర్నాలు, ఆందోళనలు, వినతిపత్రాలు ఇచ్చినా స్పందించిన దాఖలాలు లేవు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో గతంలో ఇచ్చిన నిర్ణయాన్ని నిలబెట్టుకున్నారు. ఇక లక్షలాదిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కొన్నేండ్లుగా కేసీఆర్ చెప్తున్న మాటను నిజం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇచ్చేందుకు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ప్రకటిస్తూనే, మరోవైపు ఇక్రిమెంట్‌కు కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 

దళిత, గిరిజనులకు సాయం

దళిత, గిరిజనుల ఇండ్లలో పెండ్లి అంటే సాదాసీదాగా జరుపుకొనే తంతుకు ఫుల్‌స్టాప్ పెట్టేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పథకాన్ని రూపొందించారు. ఎవరూ ఊహించని విధంగా కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. దళిత, గిరిజన అమ్మాయి వివాహానికి ప్రభుత్వం రూ.50వేల ఆర్థిక సాయం అందించనుంది. వీరితోపాటు వృద్ధులు, వికలాంగులకు పింఛన్లను పెంచుతామన్న ఎన్నికల ప్రణాళికలో హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారు. వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 ఇచ్చేందుకు ఓకే చెప్పారు. వీరితోపాటు బీడీ కార్మికులకు ఇస్తామన్న భృతిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మైనార్టీల కోసం కమిషన్, దానికి వెయ్యికోట్ల బడ్జెట్, వక్ఫ్‌బోర్డుకు జిల్లా జడ్జీ నేతృత్వంలో వక్ఫ్ ట్రిబ్యునల్ వంటి ప్రత్యేక నిర్ణయాలను తీసుకున్నారు. విద్యార్థులకు న్యాయం చేసే లక్ష్యంతోపాటు, తెలంగాణ విద్యార్థులకు మరింతగా ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనికి ఫాస్ట్ అనే పేరు పెడుతూ సరికొత్త పతకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పనతోపాటు, హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థను మెరుగుపరిచి, శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. నిరుద్యోగులకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జర్నలిస్టుల కోసం జర్నలిస్టు భవన్, గీత కార్మికుల కోసం కల్లు దుకాణాలను తెరవడం, ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పులు, మధ్యప్రదేశ్‌లో అమల్లో ఉన్న స్థానికత విధానం ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ, అధికారం ఉంటుందని, తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వపరంగా ఆర్థికసాయం అందిస్తామని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారు.

ఇక తొలిదశ, మలిదశ ఉద్యమంలో అమరులైన 1500 మందికిపైగా అమరులైన విద్యార్థి, యువతీయువకుల కుటుంబాలను ఆదుకోవడంలో వెనుకకుపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూనే.. మంచికి మంచిగా ప్రతిస్పందిస్తూ, చెడుపై ఉగ్రనరసింహుడిగా కేసీఆర్ విరుచుకుపడ్డారు. జూదరంగంపై తీవ్ర చర్యలు తప్పవని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగంలో పటిష్ఠ పోలీస్ వ్యవస్థతో ద్వారా ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదని తన ప్రసంగంతో తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరించేలా 45 రోజుల కేసీఆర్ పాలన ఉందని మేధావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,255 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>