Home / తెలుగు / MSOల మీద కేంద్రం పెత్తనమేంది?

MSOల మీద కేంద్రం పెత్తనమేంది?

ప్రైవేటు చానళ్ల కోసం మా గొంతుమీద కత్తి పెడతారా? భయపెట్టి ప్రసారాలు చేయించడం ప్రభుత్వాలు చేయాల్సిన పనేనా?.. ఇవీ శనివారం ఇక్కడ జరిగిన తెలంగాణ ఎంఎస్‌వోల సమావేశంలో వ్యక్తమైన ఆగ్రహావేశాలు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఎంఎస్‌వోలు ఇక్కడ సమావేశమై అంతర్గతంగా చర్చించుకున్నారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 

బడుగు జీవులమైన తమపై చూపుతున్న ఈ దాదాగిరీ పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్న డీటీహెచ్‌ల మీద చేయగలరా? అని వారు ప్రశ్నించారు. డీటీహెచ్‌లు వారికి నచ్చిన చానళ్లు ప్రసారం చేస్తే నోరెత్తని కేంద్రం తమ విషయంలో మాత్రం ఎందుకు నిర్బంధం విధిస్తున్నదని నిలదీశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కేంద్రం విస్మరించడం దారుణమన్నారు. బయపెడితే బెదిరిపోం…చావుకైనా వెనుకాడేది లేదు. ప్రజలు కోరుకోని చానళ్ళను చూపబోం, భయభ్రాంతుల్ని చేసి నిర్బంధం పెట్టాలని చూస్తే ఉద్యమం మరింత పెరుగుతుంది అని ఎంఎస్‌వోలు చెబుతున్నారు. దేనికైనా సిద్ధం కావాలని వారు స్పష్టతకు వచ్చారు. సోమవారం మరో దఫా సమావేశమై భవిష్యత్తు కార్యచరణ రూపొందించాలని నిర్ణయించారు. 

అన్ని చానళ్లు ఇవ్వడం ఎవరి వల్లా కాదు..

హైదరాబాద్ కొన్ని ప్రాంతాలు, తొమ్మిది జిల్లాల్లో డిజిటలైజేషన్ అమల్లో ఉంది. ఇందులో ఏ ఎంఎస్‌వో అయినా 107 చానళ్ళ వరకే ప్రజలకు అందించ గలుగుతాడు… అన్ని చానళ్ళు చూపడం ఎవరి తరంకాదు అని తెలంగాణ ఎమ్మెస్‌వోల గౌరవ అధ్యక్షుడు కులదీప్ సహాని పేర్కొన్నారు, ఎయిర్‌లో 750 చానళ్ళు అందుబాటులో ఉంటాయి. మేము అవలంబిస్తున్న అనలాగ్ సిస్టం ద్వారా 107 చానళ్ళు మాత్రమే చూపే అవకాశముంది. అందులో 70 వరకు పే చానళ్ళు ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, స్పోర్ట్స్ చానళ్ళు వాటిలో ఉన్నాయి.

పైగా ప్రభుత్వం దూరదర్శన్ చానళ్ళను తప్పనిసరి అంటూ చట్టం తెచ్చింది. నాలుగు నుంచి ఆరు చానళ్ళను అందరూ అందిస్తున్నారు. మిగతా వాళ్లంతా ఇలాగే బెదిరిస్తే ఎవరివి చూపించాలి? అని ఆయన ప్రశ్నించారు. తెలుగులో న్యూస్ ఛానళ్ళు 17 లేదా 18 ఉన్నాయని, అన్ని చానళ్లు ఎవరూ చూపరని వివరించారు. వాటిలో ప్రజలు కోరుకున్న వాటినే చూపిస్తున్నామని చెప్పారు. మేము చేసేది వ్యాపారం, క్యారేజి ఫీజు చెల్లించిన ఛానళ్లతోనే మాకు ఒప్పందాలున్నాయి. వాళ్ల చానళ్లను చూపిస్తున్నాం.. చూపిస్తాం. సహారా చానల్ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఎంఎస్‌వోలు వ్యాపారం చేస్తున్నారని, క్యారేజీ ఫీజు చెల్లించిన వారితో మాత్రమే ఒప్పందం చేసుకుంటారని, ఏయే చానెల్‌ను ప్రసారం చేయాలో వారే నిర్ణయించుకుంటారని న్యాయస్థానం పేర్కొందని సహానీ గుర్తు చేశారు.

టీవీ- 9 కాని, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కాని ఎంఎస్‌వోలకు ఎలాంటి క్యారేజీ ఫీజు చెల్లించలేదు.. ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. పైసా చెల్లించకుండా బెదిరించి ప్రసారాలు చేయాలని మామీద ఒత్తిడి చేయడం ఏమిటి? మేము చేస్తున్నది వ్యాపారం. ప్రజలతోనే మాకు సంబంధం. వారు డబ్బులు ఇస్తారు కాబట్టి వారు కోరిన చానళ్లు వ్యయభారమైనా ప్రసారం చేస్తుంటాం. వద్దని చెప్పిన చానళ్లు ఉచితంగా వచ్చినా ప్రసారం చేయం. అందులోనూ మాకు డబ్బులు చెల్లించని వారు మా ప్రసారాలు చేయాలని నిర్బంధించే హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 

ఈ విషయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హైకోర్టుకు అప్పీలుకు వెళ్ళగా కోర్టు దాన్ని తోసి పుచ్చిన విషయం ప్రజలకు తెలిసిందేనని అన్నారు. కుళ్ళిపోయిన రాజకీయాలు మా ప్రసారాల మధ్యలో తేవద్దని ఆయన అన్నారు. కేంద్రం తమను ఫలానా చానళ్ళను చూపిస్తారా? చస్తారా? అని భయపెడితే చావుకైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకోని, ఇష్టపడని చానళ్ళను చూపబోమని ఆయన తేల్చి చెప్పారు. అలా చేస్తే మా వ్యాపారాలు దెబ్బతింటాయని అన్నారు. భయభ్రాంతుల్ని చేసి నిర్బంధం పెట్టాలని చూస్తే ఉద్యమం తప్పదని అన్నారు.

ప్రజలకు అవసరం ఉన్న చానళ్ళు, వారు కోరుకున్న చానళ్ళను ప్రసారం చేయడమే తమ వ్యాపారం, తమకు ఇష్టం లేని చానళ్ళను ప్రసారం చేస్తే డబ్బు చెల్లించబోమని ప్రజలు మొండికేస్తే బాధ్యత ఎవరిదని నిలదీశారు. అయినా వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం తాము చెప్పిన చానళ్ళను చూపిస్తారా? చస్తారా? అని బెదిరిస్తుందా? ఇదేం పద్ధతి? అని ప్రశ్నించారు.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,258 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>