Home / తెలుగు / 1956 ప్రాతిపదిక ఎందుకు?

1956 ప్రాతిపదిక ఎందుకు?

dora telanganaవందల ఏళ్లుగా ఇక్కడ విద్య విస్మరణకు గురైంది. సామాన్యుడికి అందని పండై ఉండిపోయింది. స్వాతంత్య్రానంతరం మన ప్రభుత్వా లు విద్యావ్యాప్తికి చర్యలు ప్రారంభించీ ప్రారంభించక ముందే ఉమ్మడి రాష్ట్రం పేరిట మరో దాస్యప్రపంచంలోకి తెలంగాణ నెట్టివేయబడింది. విద్యారంగం మీద మళ్లీ అమావాస్య కమ్మింది. ఆరు దశాబ్దాల కాలంలో ఈ రంగంలో జరిగిన అన్యాయం వల్లించడం చర్విత చరణమే అవుతుంది. ఇపుడు గ్రహణం విడిచింది కాబట్టి విద్యను సార్వజనీనం చేయడం ఆ రంగంలో దశాబ్దాల పాటు జరిగిన లోటు పాట్లను వేగంగా పూడ్చుకోవడం మన ముందున్న కర్తవ్యం. ఇన్నాళ్లూ నష్టపడ్డాం కనుక మనకే వందకు వంద శాతం ఫలాలు దక్కడం న్యాయం. అందుకు ఉమ్మడి రాష్ట్రం అంటించిన మరకలన్నీ తుడిచేయక తప్పదు. మా పిల్లలు ఇక్కడే పుట్టారు అంటూ లాజిక్కులు మాట్లాడే ప్రతివాడూ ఒకనాటి చొరబాటుదారుడే. అందుకే 1956 కటాఫ్ శాసనం!

1956 ప్రాతిపదికగా స్థానికతను నిర్ధారించడం మీద వివిధ వర్గాల్లో తీవ్ర స్థాయి చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మరీ కఠినంగా వ్యవహరిస్తున్నదని కొందరు అభిప్రాయపడుతుంటే కొంతమంది తెలంగాణవాదులు కూడా మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉద్యమంలో జీవన్మరణ సమస్యగా పోరాడినవారు మాత్రం ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. కాగా సీమాంధ్ర ఆధిపత్యాన్ని కొనసాగించి తీరాలని కంకణం కట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఇందులో రంధ్రాన్వేషణకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నది.

ఏపీకి చెందిన ఆ పార్టీ మంత్రులు తమ శాఖ పనులు వదిలిపెట్టి ఈ విషయం మీదే దృష్టి కేంద్రీకరించారు. దీన్ని దెబ్బ కొట్టేందుకు ఎన్డీఏ సర్కారు మీద ఒత్తిడి కూడా తెస్తున్నారు. వీరి చర్యలను ఖండించిన రాష్ట్ర విద్యామంత్రి జీ జగదీశ్‌రెడ్డి ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణను ఆక్రమించినవారి పిల్లలకు కూడాఫీజు రీయింబర్స్‌మెంటు ధనాన్ని తెలంగాణ ప్రభుత్వంతో కట్టించాలని తెలుగుదేశ ం తెగ ఆరాటపడుతున్నది అని చురకలంటించారు.

ఇందులో న్యాయాన్యాయాలు పరిశీలించాలంటే గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముల్కీ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో చాలా పాతదే అయినా ఆం ధ్ర, తెలంగాణల విలీనానికి, విభజనలకు కేంద్ర బిందువు ముల్కీ నిబంధనలే. 

1969 ఉద్యమం: ముల్కీ నిబంధలకోసం, ముల్కీ నిబంధనల అమలులో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగానే 1969లో జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. ముల్కీ నిబంధనలు చెల్లవని జస్టిస్ చిన్నపరెడ్డి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును నిరసిస్తూ తెలంగాణవాదులు నాడు వీధుల్లోకి వచ్చారు. మళ్లీ ముల్కీ నిబంధనలను సమర్థిస్తూ అక్టోబరు 1972లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక దాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో జై ఆంధ్ర ఉద్యమం జరిగింది.

ఆంధ్ర నాయకత్వం ఒత్తిడికి తలొగ్గిన నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆరు సూత్రాల పథకం ముల్కీ నిబంధనలను రద్దు చేసి, జోనల్ వ్యవస్థను తెచ్చింది. అందుకు అనుగుణంగా 1972 డిసెంబరు 23న పార్లమెంటులో చట్టం చేశారు. ఆరు సూత్రాల పథకం ప్రకారం 371డీని తెచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారు. ఇవన్నీ తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగినవే. మరోవైపు ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి చేసిన నియామకాలను ఇప్పటివరకు సరిదిద్ద లేదు. అందుకే ఇప్పుడు 1956 నుంచి దిద్దుబాటు చేయడం తప్పనిసరి అని 1969 ఉద్యమకారుడు కెప్టెన్ లింగాల పాండు రంగారెడ్డి అభిప్రాయపడ్డారు.

ముల్కీ నిబంధన ఒకటి ప్రకారం అంటే ఎ) పుట్టుకతో హైదరాబాద్ రాష్ట్రపౌరుడు అయి ఉండాలి. బి) హైదరాబాద్‌లో స్థిర నివాసం కలిగినవారై ఉండాలి. సి) అతడు లేక ఆమె పుట్టేనాటికి వారి తండ్రి హైదరాబాద్‌లో 15 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి ఉండాలి. డి) ఆమె ఒక ముల్కీకి భార్య అయినా అయి ఉండాలి. ముల్కీ నిబంధన 3 ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలో కనీసం పదిహేను సంవత్సరాలు స్థిరనివాసం ఉండి ఉండాలి. తన మాతృప్రాంతంతో తనకిక ఎటువంటి సంబంధం లేదని మెజిస్ట్రేట్ నుంచి ఒక ధృవీకరణ పత్రం సమర్పించాలి.

పెద్ద మనుషుల ఒప్పందంలో ముల్కీ నిబంధనలను 12 సంవత్సరాలకు కుదించారు. ఆ ప్రకారంగానే రాజ్యాంగంలో పొందు పరిచారు. 371(1) ప్రకారం ముల్కీ నిబంధనలకు రాజ్యాంగ బద్ధత కల్పించారు. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్-1957ని కూడా చేశారు. 

కానీ వీటన్నింటినీ ఉల్లంఘించి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతవాసులు 1956 నుంచి 1969 వరకు తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు సంపాదించారు. అప్పట్లో 23,780 మంది అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారని నిర్ధారించారు. ఈ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభం కాగానే వీరిని బదిలీ చేయడానికి కాసు బ్రహ్మనందరెడ్డి ప్రభుత్వం జీవో 36 జారీ చేసింది. కానీ వారు కోర్టుకు వెళ్లారు. స్టేలు తెచ్చుకున్నారు. కోర్టు ఈ కేసుల విచారణ సందర్భంగానే ముల్కీ నిబంధనలు చెల్లవని హైకోర్టు చెప్పింది. అంతేకాదు ముల్కీ నిబంధనలు హైదరాబాద్ పౌరులకు వర్తించవని, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వర్తిస్తాయని మరో తీర్పు చెప్పింది. తెలంగాణ నిరుద్యోగులు దీంతో మరింత ఆగ్రహోదగ్రులయ్యారు అని 1969 ఉద్యమ నాయకుడొకరు చెప్పారు.

సీమాంధ్ర ఆధిపత్యంలోని ప్రభుత్వాలు ఎప్పుడూ ముల్కీ నిబంధనలను గౌరవించలేదు. నిజాయితీగా ఉల్లంఘనలను సరిదిద్దే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత కూడా ఉల్లంఘనలు ఆగలేదు. ఇంకా పెరిగాయి. హైదరాబాద్‌ను కాలనీగా మార్చుకునే ప్రయత్నం చేశారు. 610 మనకు తాజా ఉదాహరణ. ఎంతమంది బయటి ప్రాంతంవారో నిర్ధారించడానికి రెండు దశాబ్దాలు పట్టింది. తెలంగాణలో సుమారు 59 వేల మంది ఆంధ్రప్రాంతంవారు అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారని జయభారత్‌రెడ్డి కమిషన్ గుర్తించింది.

గిర్‌గ్లానీ కమిటీ అక్రమార్కుల సంఖ్య లక్షకు పైగా ఉంటుందని నిర్ధారించింది. వారిని గుర్తించిన తర్వాత బయటికి బదిలీ చేయడానికి ప్రయత్నిస్తే ఒక్కరు కూడా ఇక్కడి నుంచి కదల్లేదు. కోర్టులకెళ్లి, ట్రిబ్యునల్‌లకు వెళ్లి స్టేలు తెస్తారు. ప్రభుత్వం వారిని వెనుకేసుకువస్తుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క అన్యాయాన్ని కూడా సరిద్దిలేదు. ఇప్పుడు కూడా సరిదిద్దకపోతే తెలంగాణ వచ్చి ప్రయోజనం ఏమిటి? అని టీఎన్‌జీవో నాయకుడు ఒకరు ప్రశ్నించారు. 

ముల్కీ నిబంధనల ఉల్లంఘన యాభై ఆరేళ్లుగా జరుగుతూ వచ్చింది. తెలంగాణ చాలా నష్టపోయింది. వాటిని సరిదిద్దాలంటే ఒక్కరోజుతో అయ్యే పనికాదు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ దిశగా తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థిస్తున్నాం. 610 జీవో ప్రకారం ఇక్కడ అక్రమంగా ఉద్యోగాలు సంపాదించినవారిని ఒక్కరిని కూడా కదిలించలేకపోయిన చంద్రబాబునాయుడు కానీ, ఆ తర్వాత వచ్చిన వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు కానీ ఇప్పుడు ఏముఖం పెట్టుకుని 1956 ప్రాతిపదికను వ్యతిరేకిస్తారు? సీమాంధ్ర ఆధిపత్య ప్రభుత్వాలు చేసిన పాపాలకు ఇప్పుడు ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని అధ్యాపక శాసన మండలి సభ్యుడు ఒకరు అన్నారు.

- కట్టా శేఖర్‌రెడ్డి

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,283 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>