Home / తెలుగు / సౌర విద్యుత్‌ను ఉపయోగించుకోవడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలి
solar telangana

సౌర విద్యుత్‌ను ఉపయోగించుకోవడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలి

-సౌరశక్తికి రాష్ట్రంలో విస్తృత పరిధి.. 
-తక్షణ విద్యుత్ అవసరాలను తీర్చే వనరు
-సోలార్‌పై ఔత్సాహికులు, సంస్థలు సిద్ధం
-వేల కోట్ల పెట్టుబడులకు, ఉపాధికి అవకాశం
-ఆసక్తి కనబరుస్తున్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు
-విధి విధానాల్లో స్వల్పమార్పులతో అన్నీ సాధ్యమంటున్న నిపుణులు
-ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు, ప్రతి సబ్‌స్టేషన్‌కు ఒక సౌర విద్యుత్ ప్లాంట్.. 
- ఇదీ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక సౌర విద్యుత్ నిపుణుడి సూచన.

తెలంగాణకు విద్యుత్ కష్టాలు తొలిగించే ప్రత్యామ్నాయ వనరుల్లో సౌరశక్తి (సోలార్ పవర్) ప్రధానంగా కనిపిస్తున్నది. తక్షణ విద్యుత్ అవసరాలు తీర్చడం, వ్యవస్థాపనకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఔత్సాహికులు, సంస్థలు ఈ రంగానికి బంగా రు భవిష్యత్తును కల్పిస్తున్నాయి. మరోవైపు ఈ రంగం పై పలువురు ఎన్‌ఆర్‌ఐలు కూడా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో విధి విధానాల్లో స్పల్ప మార్పులుచేస్తే విస్తృతస్థాయిలో సౌర విద్యుచ్ఛక్తిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని, తద్వారా తెలంగాణ సౌర తెలంగాణ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

సంప్రదాయేతర ఇంధన వనరుల్లో తెలంగాణ జిల్లాలు సౌరశక్తికి అనువుగా ఉన్నాయి. దేశంలో సూర్య తాపం- గ్లోబల్ హారిజంటల్ ఇరాడియన్స్(జీహెచ్‌ఐ) కనిష్ఠంగా చదరపు మీటర్‌కు 1.33 ఉండగా, గరిష్ఠంగా 7.37 వరకు ఉంది. అదే తెలంగాణలో కనిష్ఠంగా 4.88, గరిష్ఠంగా 6.91 జీహెచ్‌ఐ ఉండడం గమనార్హం. మొత్తంగానే గ్యాస్, బొగ్గు లభ్యత నానాటికీ తగ్గిపోతున్న కారణంగా వాటి ఆధారంగా ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయేతర ఇంధన వనరుల (సోలార్, హైడల్, విండ్, బయోమాస్)లో ప్రైవేటుకు ప్రో త్సాహం కల్పించడం ద్వారా విస్తృతస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంది. అయితే.. తెలంగాణలో పవన విద్యుత్తుకు అవకాశాలు లేవు.

జల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశాలున్నప్పటికీ పరిమితమే. ఈ క్రమంలో సౌర విద్యుచ్ఛక్తిపై దృష్టి సారించాలని నిపుణులు అంటున్నారు. వచ్చే మూడేళ్ళలో ఇరవై వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికోసం సర్కారు నిర్దేశించుకున్న లక్ష్యానికితోడు ప్రైవేటురంగంలో విద్యుత్ ఉత్పత్తికి అపారమైన అవకాశాలనుకూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ పొందాలంటే అందుకు హైటెన్షన్ విద్యుత్ లైన్లు కిలోమీటర్ల పొడువునా వేయాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం రెండేళ్లు పట్టే అవకాశాలున్నాయి. అదే సౌర విద్యుత్ ప్లాంటులైతే కేవలం ఆర్నెల్లలో పని పూర్తయిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భవనాల్లో ఉన్న సంక్షేమ హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు, కాలేజీలలో విద్యుత్‌దీపాలు, వంట, వాటర్ హీటర్లకు సోలార్ పవర్‌ను ప్రవేశపెట్టేందుకు అవకాశాలున్నాయి. అంతేకాకుండా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడానికి వీలుకాని ఎత్తయిన ప్రాంతాలు, మారుమూల అటవీ గ్రామాల్లో గిరిజనులకు విద్యుత్ వెలుగుల కోసం సోలార్ పవర్‌ను సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. అయ్యే ఖర్చును ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి తీసుకునే వెసులుబాటూ ఉంది.

పాలసీలోనూ కుట్రలు

ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం సోలార్ పవర్ పాలసీ-2012 రూపకల్పన సమయంలో ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే సోలార్ పాలసీ వల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనే విషయాన్ని గుర్తించిన నాటి పాలకులు సోలార్ ఔత్సాహికులను నిరాశపరిచే రీతిలో వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ప్రైవేటురంగంలో సౌర విద్యుత్తుకు యూనిట్‌కు రూ.6.45 చొప్పున ప్రభుత్వం ధర నిర్ణయించడంతో ఆదిలోనే పారిశ్రామికవేత్తల కాళ్ళకు బంధం వేసినట్లయ్యింది.

వ్యాపారదృక్పథంతో ఈ రంగంపై ఆసక్తి చూపినవారంతా ధరను చూసి వెనుకకు వెళ్లారు. ఫలితంగా గత ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల సోలార్‌పవర్ ఉత్పత్తి కోసం అధికారికంగా పిలిచిన టెండర్ల(బిడ్స్)కు నామమాత్రపు స్పందన లభించింది. 400 మెగావాట్ల మేరకు కూడా ఎవ్వరూ ముం దుకు రాలేదు. ఈ విషయంలో కొత్త తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపితే పారిశ్రామికవేత్తలు మళ్లీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌కు ధర నిర్ణయమే ఈ రంగం భావి వృద్ధికి కీలకాంశంగా ఉంది. సౌర విద్యుత్ తయారు చేసేందుకు ఉత్సాహంతో ఉన్న కంపెనీలకు ధర విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సింగిల్ ఫేజ్‌లోనూ నెట్‌మీటరింగ్

ఇప్పటి వరకు సోలార్ రూఫ్-టాప్‌పాలసీ కింద కేవలం త్రీఫేజ్ వినియోగదారులకు మాత్రమే నెట్‌మీటరింగ్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. సింగిల్ ఫేజ్ వినియోగదారులకు కూడా వర్తించేసే అంశాన్ని ఆతర్వాత ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నా దానిపై తుది నిర్ణయం చేయలేదు. ఔత్సాహికవేత్తల రూఫ్-టాప్ ఏర్పాట్లకు అయ్యే మొత్తం వ్యయంలో మూడు కిలోవాట్ల వరకు 50% సబ్సిడీ సదుపాయం ఉంది. దీంతో రూఫ్-టాప్ పాలసీకింద బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్యసముదాయాలతో పాటు సాధారణ గృహ వినియోగదారులు సైతం సౌర ఉత్పత్తి అవకాశాలను వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది.

ప్రభుత్వపరంగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా, మండల కేంద్రాలతోపాటు హైదరాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, ఇటు గృహ సముదాయాలద్వారా ఈ ఏడాది చివరికి నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణను సైతం సిద్ధం చేసింది.

రూఫ్‌టాప్‌తో ఎంతో మేలు

సొంత విద్యుత్ అవసరాలను తీర్చుకోవడంతోపాటు మిగులు విద్యుత్తును విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే వెసలుబాటు రూఫ్ టాప్ పద్ధతిలో ఉంటుంది. అయితే ఇందుకు సంబంధిత విద్యుత్ సంస్థ(డిస్కమ్) అనుమతి తప్పనిసరి. రూఫ్‌టాప్ ద్వారా అయ్యే విద్యుత్ ఉత్పత్తి, వినియోగదారుడి వినియోగం మినహా మిగులు విద్యుత్తును డిస్కమ్‌కు సరఫరా చేసే అంశాల పరిశీలనకు ప్రత్యేకంగా విద్యుత్ మీటర్ల ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

మీటర్ల ఏర్పాట్లు, వాటి నిర్వహణ, రీడింగ్ నమోదువంటి అంశాలు విద్యుత్ యంత్రాంగం పరిధిలో ఉంటాయి. రూప్‌టాప్ విధానం ద్వారా గృహాలు, వ్యాపార సముదాయాలు, వాణిజ్య సముదాయాలతోపాటు గ్రామాల్లో రైతుల విద్యుత్ అవసరాలు తీరుతాయి. సొంత ఇంటి కలలను సాకారం చేసుకునే యజమానులు అతి తక్కువ ఖర్చుతో రూఫ్‌టాప్ ప్యానెళ్ళను ఏర్పాటుచేసుకోవడం ద్వారా కరెంటు కోతలకు చెక్ పెట్టవచ్చు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు సంయుక్తంగా ప్రభుత్వ సబ్సిడీలను పొంది రూఫ్‌టాప్ విధానాన్ని అనుసరించినట్లయితే నిరంతర విద్యుత్‌తో నిరాటంకంగా వ్యాపారాలను కొనసాగించుకునే వెసలుబాటు కలుగుతుంది.

సోలార్ పార్కులు అవసరం

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో భాగంగా సోలార్ పార్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు ప్రవాస భారతీయులు కోరుతున్నారు. సోలార్ రంగంలో పెట్టుబడులకు ఎంతోమంది తెలంగాణ ప్రవాస భారతీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణలోని పది జిల్లాల పరిధిలో కనీసం జిల్లాకు వంద మెగావాట్ల చొప్పున సోలార్ పార్కుల దిశగా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించాలని సూచిస్తున్నారు. ఇందుకు పారదర్శకంగా అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ బిడ్స్ (టెండర్లు)ను ఆహ్వానించేందుకు, సౌర రంగంలో విదేశీ సంస్థలు, విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ఎంతో బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చైనా, తైవాన్, జపాన్, జర్మనీ దేశాల సోలార్ సెల్, సోలార్ ప్యానెల్ ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరిపి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సోలార్ పార్కులకు అవకాశం కల్పించడం ద్వారా ఏడాది కాలంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలు తీరే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఆసక్తి కనబరచిన ఎన్‌హెచ్‌పీసీ

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) సైతం దాదాపు 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం విశేషం. దీనిపై రాష్ట్ర ఇంధన శాఖతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 300 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణనూ పూర్తిచేసింది. ప్రభుత్వపరంగా సోలార్ ప్లాంట్‌నుంచి దగ్గర్లోని సబ్‌స్టేషన్లవరకు పంపిణీ లైన్ల (ఎవాక్యుయేషన్) నిర్మాణాలను ట్రాన్స్‌కో ఏర్పాటుచేయాలని ఎన్‌హెచ్‌పీసీ సూచించింది. ఒకదశలో ఇందుకు అయ్యే వ్యయంపై ట్రాన్స్‌కో అధ్యయనం కూడా చేసింది.

ట్రాన్స్‌కో కసరత్తు…

గతంలో వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ పవర్ ఏర్పాట్లపై ట్రాన్స్‌కో దృష్టిసారించింది. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ కనెక్షన్లు 32 లక్షల వరకు ఉండగా, అందులో ఉచిత విద్యుత్తు కింద 30లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. వాటిల్లో తెలంగాణలోని పది జిల్లాల్లో 18లక్షల మేరకు ఉండడం గమనార్హం. వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్తు కల్పిస్తే పగటి పూట వ్యవసాయ బావుల నుంచి నీటిని తోడి పంటలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం దశలవారీగా ఇస్తున్న కరెంటు సరఫరా సమస్యకూడా సమసిపోతుంది. ఎంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయానికైనా వరుసగా ఐదు గంటలకుమించి నీరు పారించాల్సిన అవసరం ఉండదు. అంతేకాక రైతు తన అవసరాల మేరకు విద్యుత్తును వినియోగించుకుని మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు అందించే అవకాశం కూడా ఉంటుంది. రైతులు ఇచ్చే మిగులు కరెంటుకు ఎంతో కొంత ధర నిర్ణయిస్తే రైతాంగానికి రెండు విధాలుగా లాభం చేకూరుతుందని అధికారులు అప్పట్లో ఆలోచనలు చేశారు. ఈ మిగులు సౌర విద్యుత్తు గ్రామీణ ప్రాంతాల్లోని ఇతర గృహ, కుటీర పరిశ్రమల విద్యుత్ అవసరాలకు ఉపయుక్తంగా ఉంటుందని అంచనాలు సైతం రూపొందాయి.

వ్యవసాయ వినియోగం

రాష్ట్రంలో ఒక హెచ్‌పీ మోటరు సామర్థ్యానికి 1.734 వాట్స్ విద్యుత్ వినియోగం జరుగుతుంది. తెలంగాణలోని 18 లక్షల ఉచిత వ్యవసాయ కనెక్షన్లకు ఏటా 10 లక్షల మిలియన్ యూనిట్ల వాడకం నమోదు అవుతున్నట్లు అంచనా. తెలంగాణలోని రెండు విద్యుత్ సంస్థలు(డిస్కమ్స్) ప్రతిరోజు వ్యవసాయానికి గరిష్ఠంగా దాదాపుగా 2,600 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి. సోలార్ పవర్‌కు కేంద్ర ప్రభుత్వం 30%, రాష్ట్ర ప్రభుత్వం 20% సబ్సిడీ అందిస్తున్నాయి. మిగతా 50% నిధులను బ్యాంకుల నుంచి రైతాంగానికి రుణాలు ఇప్పించి ప్రభుత్వం ఉచిత విద్యుత్తు కింద ఇచ్చే సబ్సిడీని బ్యాంకులకు జమ చేయడం ఎంతో పారదర్శకంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఉచిత విద్యుత్ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న నగదు బదిలీ పథకాన్ని రైతులకు ఆధార్ కార్డు ద్వారా అనుసంధానం చేస్తే మరెంతో మేలు జరిగే అవకాశాలున్నాయి. ఉచిత కరెంటు కింద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రుణం తీసుకున్న రైతుల పేరిట బ్యాంకులకు జమచేయడం ద్వారా రైతు పంట సామర్ధ్యాన్ని బట్టి ఐదు లేదా పది సంవత్సరాల కాలంలో బ్యాంకు రుణం తీరిపోతుంది. సౌర విద్యుత్తు యూనిట్ శాశ్వతంగా రైతుకు చెందుతుంది.

తెలంగాణలో ఉన్న 3హెచ్‌పీ, 5 హెచ్‌పీ పంపుసెట్లకు సోలార్ పవర్ ఏర్పాట్లు చేయడం ద్వారా అటు రైతాంగానికి, ఇటు ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో కొందరు ఔత్సాహిక రైతులు తమ వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ పవర్ వినియోగం ద్వారా పగటివేళ పంటలకు నీరు అందిస్తున్న విషయాన్ని గతంలో విద్యుత్ సంస్థలు(ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు) పరిగణలోకి తీసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో వ్యవసాయ బావులు, బోర్లకు ఉపయోగిస్తున్న సోలార్ పవర్ ద్వారా 200 అడుగుల(ఫీట్ల) వరకు నీటిని తోడే వీలు కలుగుతున్నది.

సోలార్ సబ్సిడీలకు ఊతం ఇస్తున్న కేంద్రం

కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు దీటుగా రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటురంగాలతోపాటు గృహ, వాణిజ్యరంగాల్లో సోలార్ పవర్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరం. దేశంలో విద్యుత్ ఉత్పాదక శక్తిలో సౌర విద్యుత్ భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంగా జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ సౌర విధానం-2010ను కేంద్రం రూపొందించిన విషయం తెలిసిందే. మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలకు సౌరశక్తి ఒక్కటే పరిష్కారమార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం వంటివాటికి సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటుచేయడం ద్వారా మరింత సమర్థవంత ఫలితాలను సాధించవచ్చు.

సర్కారు ఊతమిస్తే గుజరాత్‌ను మించవచ్చు

సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించినట్లయితే గుజరాత్‌ను అధిగమించవచ్చు. తెలంగాణ జిల్లాల్లో ఏడాదిలో 365 రోజులూ పూర్తిస్థాయిలో సూర్యరశ్మి అవకాశాలు ఉండడం ప్రకృతిపరంగా గొప్పవరం. దానిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజాలకు నాంది పలికినట్లు అవుతుంది. సోలార్ పవర్ వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదు. పెట్టుబడులు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రాజెక్టు ఆరు నెలల కాలంలోపే పూర్తి అయ్యి విద్యుత్ ఉత్పత్తి వస్తుంది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గిపోతాయి. పూర్తిస్థాయిలో నాణ్యమైన (ఫుల్‌లోడ్) విద్యుత్తు రైతులకు, వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ప్రైవేటురంగంలో సోలార్ ప్రాజెక్టులను ప్రోత్సహించడంవల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడే అవకాశాలు లేవు.

సబ్సిడీ నిధులే పెట్టుబడులు

తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా సోలార్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ఎంతో అవసరం. ఉచిత కరెంటుకింద ఇచ్చే సబ్సిడీలను క్రమంగా తగ్గించుకోవడంతోపాటు రైతులు స్వయం సమృద్ధి చెందేందుకు సోలార్ పవర్ ఎంతో సహకరిస్తుంది. వ్యవసాయరంగానికి ఇచ్చే కరెంటును ఇతర (కమర్షియల్, ఇండస్ట్రియల్) రంగాలకు మళ్లించడం ద్వారా విద్యుత్ సంస్థలు (డిస్కమ్స్) ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఏటా వెయ్యి మెగావాట్ల చొప్పున తెలంగాణలో సోలార్ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందించాలి.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

One comment

  1. Please encourage Solar water heaters too , Apartment act need to be changed If individual flat owner want install solar they should enable to do that.

    I have installed Solar water heater for my flat in our apartment. other owners asking me to pay rent. They showing Apartment act and saying it is permanent structure.

    Please change the rules and encourage Solar even for Apartments specially for individual flat owners.

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,258 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>