Home / తెలుగు / మార్గదర్శి జయశంకర్ సార్

మార్గదర్శి జయశంకర్ సార్

నేడే ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి.ఒక లక్ష్యం కోసం సుదీర్ఘకాలం, అలుపు లేకుండా పోరాటం చేసిన అతికొద్ది మంది యోధుల్లో ప్రొఫెసర్ జయ శంకర్ గారి పేరు చేర్చ క తప్పదు. ఆయన జీవితం తెలంగాణ ఉద్యమంతో పెనువేసుకుని పోయింది. తెలంగాణ కోసం పోరాడిన మూడు తరాలకు వారధి ప్రొఫెసర్ జయశంకర్. 1952 ముల్కీ ఉద్యమంలో జయశంకర్ గారు కార్యకర్త. 1968లో ప్రత్యే క రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో భావవ్యాప్తికి కృషి చేయగా, 1996లో మొదలైన మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిర్దేశకుడయ్యాడు.

వ్యక్తిగత అనుభవం ఆధారంగానే ఎవరైనా జీవిత లక్ష్యాలను నిర్ణయించుకుంటారు. అయితే మనలో చాలామంది జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారమైతే చాలునని అనుకుంటాం. మన సమస్య పరిష్కారమైతే సంతృప్తిచెందుతాం. కానీ జయశంక ర్ లాంటివారు తాము ఎదుర్కొన్న సమస్యలు తమ కే కాదు మరెవ్వరికీ రాకూడదని భావిస్తారు. అందుకనే సమస్యలకు మూలాలను వెతికి వాటిని సమూలంగా రూపుమాపాలని ప్రయత్నిస్తారు. అంబేద్కర్ అంటరానితనాన్ని వ్యక్తిగత సమస్యగా చూడలేదు. అంటరానితనం కులవ్యవస్థలో భాగమని గుర్తించి, కులవ్యవస్థ నిర్మూలనకు పోరాటం చేశారు. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆంధ్ర పాలకు లు చూపిన వివక్షను, వారినుంచి ఎదురైన ఈసడింపులను భరించలేదు. అవిలేని తెలంగాణకోసం పోరాటం చేశారు. ఆంధ్ర ఆధిపత్యం అంతం కావాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని భావించారు.

1948 సెప్టెంబర్ 17 నాడు భారతదేశంలో విలీనమైన తెలంగాణను పాలించడానికి భారత ప్రభు త్వం అనేకమంది ఆంధ్ర అధికారులను తెలంగాణకు తీసుకొచ్చింది. వారు స్థానిక ప్రజలతో అవమానకరంగా వ్యవహరించారు.తెలంగాణ ప్రజలను సంస్కా రంలేని అనాగరికులన్నారు. ఒక విద్యార్థిగా జయశంకర్ గారు కూడా ఆంధ్రా ఉపాధ్యాయుల ఈసడింపులను చవిచూశారు. ఈ ఈసడింపులకు నిరసనగానే ముల్కీ ఉద్యమం చెలరేగింది. ఆ ముల్కీ ఉద్యమం లో జయశంకర్ గారు క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆ తర్వాత 1953లో ఫజల్ అలీ కమిటీ హైదరాబాద్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయవద్దని కమిటీకి వినతిపత్రం ఇచ్చిన విద్యార్థి బృందంలో జయశంకర్ గారున్నారు.

Prof Jayashankar

Prof Jayashankar; Portrait by Mrityunjay

1956లో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేశారు. ఆ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న అవమానాలకు జయశంకర్ గారు సాక్షి. అప్పటికి ఆయ న బి.ఎడ్ కాలేజీలో ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్రం లో బి.ఎడ్ కాలేజీలో చేరి ఆం ధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ కోర్సు పూర్తిచేశారు. హైదరాబా ద్ రాష్ట్రంలో బి.ఎడ్ పూర్తికాగా నే ఉపాధ్యాయులుగా నియమించాలనే రూల్‌ఉండేది. కానీ జయశంకర్ గారి బ్యాచ్ విద్యార్థులెవరికీ పోస్టింగ్ రాలేదు. ఈ విషయమై వారు విద్యాశాఖ ఆఫీసుకు వెళ్లి అక్కడున్న ఆంధ్ర అధికారులను అడిగితే మీ హైదరాబాద్ ప్రభుత్వానికి చెప్పుకోమని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. వారిపైనున్న తెలంగా ణ అధికారికి ఫిర్యాదు చేస్తే, వారు పరిస్థితులు మారిపోయా యి, ఇప్పుడు మా చేతిలో ఏమీ లేదని అన్నారు. అయితే అక్కడితో ఆగకుండా జయశంకర్ గారు విద్యార్థులను సంఘటిత పరిచి తమ డిమాండ్లను సాధించుకున్నారు. ఇట్లాంటి అనుభవాల కారణంగానే జయశంకర్ గారు ఉపాధ్యాయ ఉద్యమాల్లో భాగమై తెలంగాణలో వివక్షకు గురైన ఉపాధ్యాయు ల హక్కుల కోసం పోరాటం సాగించారు. అట్లా తెలంగాణ పట్ల ఆంధ్ర పాలకుల వివక్షపూరిత ధోరణిని లోతుగా అర్థం చేసుకోగలిగారు. 

1968 ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు భావవ్యాప్తి కార్యక్రమాన్ని స్వీకరించారు. అప్పటికి లెక్చరర్‌గా పదోన్నతి పొందారు. ఆయన ప్రధానంగా తెలంగాణ డిమాండ్ వెనుకగల కారణాలను విశదీకరించారు. తెలంగాణ ప్రజలు ప్రాంతీయ మౌఢ్యంతో ప్రత్యేక రాష్ర్టాన్ని కోరడంలేదు. ఆంధ్రతో తెలంగాణ షరతులతో విలీనమైందని, ఆ షరతులు ఉల్లఘించబడుతున్నాయి కనుకనే విభజన అనివార్యమైందని చెప్తుండేవారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం దక్కవలసిన వాటా దక్కలేదు. కాబట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడదలుచుకున్నదని గణాంకాలతో వివరిస్తూ మాట్లాడేవారు. ఏ రంగంలో చూసినా అన్యాయమే జరిగింది కాబట్టి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం లో ఉండదలచుకోలేదని చెప్పేవారు. ఈ వాదమే తెలంగాణ ఉద్యమాని కి సిద్ధాంత భూమికను తయారుచేసింది.

1996లో మొదలైన మలిదశ ఉద్యమానికి జయశంకర్ గారు ఆద్యుడు. ఆయన భూప తి కృష్ణమూర్తి, కేశవరావ్ జాద వ్ గార్లతో కలిసి నవంబర్1 నాడు అవతరణ దినోత్సవాన్ని నిరసిస్తూ వరంగల్‌లో సభ జరిపారు. ప్రచారం లేకపోయినా వేలాదిమంది ఆ సభకు హాజరయ్యారు. ఆ సభ మలిదశ ఉద్యమానికి బీజాలు నాటింది. అటు తర్వాత జరిగిన ఉద్యమానికి సిద్ధాంతకర్తగా జయశంకర్‌గారు మార్గదర్శకత్వం వహించారు. ఆయన చేసిన సూత్రీకరణలు ఉద్యమానికి మూలస్తంబాలుగా నిలిచారు. మొదటగా ఆయన అందరూ కలిసి సంఘటితంగా ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పారు. అందరూ సంఘటితంగా సాగకపోతే పరస్పర సహకారంతో, సమన్వయంతో ఉద్యమాన్ని నిర్మించాలన్నారు. అదీ కుదరనప్పుడు పరస్పర విమర్శలు లేకుండా సమాంతరంగానైనా ఉద్యమంలో సాగాలన్నారు. ఈ సూత్రీకరణ ఉద్యమశక్తుల ఐక్యతకు తోడ్పడింది.

ఇక రెండవ సూత్రీకరణ ఉద్యమ క్రమానికి సం బంధించింది. ఉద్యమంలో మూడు పార్శాలుంటాయని జయశంకర్ గారుచెప్పిన మాట వినూత్నమైం ది. ఇప్పటి వరకు ఏ రచయితా ఈ కోణాన్ని చూడలేదు. ఉద్యమంలో భావవ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ అనే మూడు అంశాలుంటాయి. భావవ్యాప్తి ద్వారా ప్రజలు వాస్తవాలను గ్రహించి చైతన్యవంతులవుతారు. భావవ్యాప్తిలో విద్యావంతుల పాత్ర ముఖ్యమైనదని సార్ అభిప్రాయం. ప్రజలు జీవితానుభవం ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటారు. కానీ ప్రజలు చూస్తున్న పరిణామాలకు గల కారణాలను అధ్యయనం ద్వారా తెలియజెప్పగలిగేది విద్యావంతులని జయశంకర్ గారి అభిప్రా యం. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించి సమూల మార్పుకు విద్యావంతులు తోడ్పడాలని జయశంకర్ గారు సూచించేవారు. సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు విద్యావంతులు మౌనంగా ఉండడం ప్రమాదకరమని హెచ్చరించేవారు.

ఇక భావవ్యాప్తి జరిగితే చైతన్యవంతులైన ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సంఘటితంగా ఉద్యమిస్తారు. ఉద్యమాలు జరగకుండా ప్రభుత్వాలు దిగిరావు. కనుక ప్రజాపోరాటాలే తెలంగాణను సాధించగలవని జయశంకర్ గారు నమ్మినారు. అయితే డిమాండ్ల సాధనకు రాజకీయ ప్రక్రియ సాగవలసిం దే. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా ఏ సమస్యా పరిష్కారం కాదు. తెలంగాణ డిమాండ్ల సాధనకు రాజకీయ ప్రక్రియను నడిపించడానికి రాజకీయ నాయకత్వం అవసరం. ఆ బాధ్యత నిర్వర్తించడానికి ఏ రాజకీయ నాయకుడు కదిలి వచ్చినా జయశంకర్ వెంట నిలిచారు. 

రాజకీయ నాయకులు తెలంగాణ తేకపోతే వెంటపడతాం,తెలంగాణ తేవడానికి పూనుకుంటే వెంట నిలబడతామని చాలాసార్లు అన్నారు. రాజకీయ నాయకత్వం పూనుకొని ప్రజల డిమాండ్లను నెరవేర్చకపోతే సమాజంలో హింస పెచ్చరిల్లుతుందని వారు చాలాసార్లు అన్నారు. అందుకని తమ బాధ్యతను గుర్తెరిగి నాయకులు వ్యవహరించాలని కోరారు. ఈ ఆలోచనలతో జయశంకర్ గారు ఉద్యమానికి మార్గనిర్దేశన చేశారు. నిబద్ధతతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నడిపించారు. ఆయన ఎన్నడూ తన గురించి ఆలోచించలేదు. తెలంగాణ కోసం తపించా రు. 1996 తర్వాత పెల్లుబికిన ప్రజాకాంక్షను చూసి ఇక తెలంగాణ ఏర్పాటు అనివార్యమని గుర్తించారు. ఆఖరిదశలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి చాలా కీలకపాత్ర పోషించారు. అందుకే ఆయన తెలంగాణ జాతిపితగా మిగిలిపోయారు.

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,269 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>