Home / తెలుగు / నేడు కేసీఆర్, చంద్రబాబు చర్చలు!

నేడు కేసీఆర్, చంద్రబాబు చర్చలు!

-సమస్యలు పరిష్కరించుకుందాం
- గవర్నర్ సమక్షంలో నేడు కేసీఆర్, చంద్రబాబు చర్చలు
- రాజ్‌భవన్ వేదికగా 12 గంటలకు సమావేశం
- వివాదాస్పదమైన అంశాలపై సీఎంల కీలక భేటీ
- స్థానికత, విద్యుత్ సమస్య, ఫాస్ట్.. చర్చకు రానున్న మరికొన్ని కీలకాంశాలు

రాష్ట్ర విభజన వికాసానికి దారితీసేలా ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆదివారం రాష్ట్ర గవర్నర్ సమక్షంలో చర్చలు జరుపనున్నారు. విభజన నేపథ్యంలో తలెత్తుతున్న పలు సమస్యలు ఇరు ప్రాంతాల మధ్య ఇబ్బందులకు తావిస్తున్నాయి. వీటిపై మాటామాటా అనుకోవడంకంటే కూర్చుని మాట్లాడుకుని, పరిష్కరించుకుంటే మంచిదని తెలంగాణ, ఏపీ సీఎంలు కే చంద్రశేఖర్‌రావు, ఎన్ చంద్రబాబునాయుడు అభిప్రాయానికి వచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో ఉభయ ముఖ్యమంత్రులు నరసింహన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. 

అయితే.. మామూలుగా మాట్లాడుకోవడంకంటే నిర్మాణాత్మక పద్ధతిలో ఉభయ రాష్ర్టాల సీఎస్‌లు, ముఖ్య అధికారులతో సహా కూర్చుని చర్చించుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచన చేశారు. ఈ మేరకు ఆదివారం రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ కీలక భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అపోహలు, వివాదాలపై చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుకు ప్రయత్నం, స్థానికత, ఎంసెట్ కౌన్సెలింగ్, ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, ఆక్రమిత భూములపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, విద్యుత్ పంపిణీ, నీటి విడుదల, గ్రేటర్ పరిధిలో గవర్నర్ అధికారాలువంటి అంశాలు చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయని భావిస్తున్నారు. ఈ సమావేశంకోసం తెలంగాణ ప్రభుత్వంలోని ఏడుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు మొదట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో భేటీ అవుతారు. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించాల్సిన అంశాలను తయారు చేస్తారు. అనంతరం వాటిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వివరిస్తారు. అనంతరం ప్రభుత్వాధికారులతో కలిసి సీఎం రాజ్‌భవన్‌కు వెళతారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తనకున్న అభ్యంతరాలను భేటీ సందర్భంగా గవర్నర్ ముందుచనున్నారు. ఇందుకోసం ఆయన కూడా తమ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కసరత్తు చేసినట్లు తెలుస్తున్నది.

విభజన అనంతరం రెండు రాష్ర్టాల మధ్య పలు అంశాలపై వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ప్రజలను చీకట్లలో ముంచడానికి పీపీఏలను రద్దు చేశారని తెలంగాణ మంత్రులు బహిరంగంగానే ధ్వజమెత్తారు. 

విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం ఎంసెట్ కౌన్సెలింగ్‌ను రెండు రాష్ర్టాల అధికారులు కలిసి నిర్వహించాల్సి ఉండగా, ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కోర్టు రెండు రాష్ర్టాల అధికారులు కలిసి కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం అక్రమార్కుల భరతం పడుతుంటే ఓర్వలేకపోయిన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, హైదరాబాద్‌లో గవర్నర్ పాలన అమలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉంటున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదంతా ఇబ్బందికరమైన వాతావరణంగా మారింది. 

తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ర్టాన్ని పునర్నిర్మాణం చేసుకునే మార్గంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరుతో జరిగిన అవినీతి, అక్రమాలను సరిచేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం పడింది. దొంగ సర్టిఫికెట్లు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించి, తెలంగాణవాళ్లమేనని చెప్పుకునే వారి లెక్కలు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లకోసం ఫాస్ట్ అనే కొత్త పథకానికి సీఎం రూపకల్పన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగిన ఆటలను కట్టిపడేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రజల సామాజిక స్థితిగతుల అధ్యయనం కోసం సమగ్ర సర్వేకు సిద్ధపడింది. దీనిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేతలు రాజకీయం చేశారు. కోర్టుకు వెళ్లారు. సర్వే జరుగకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. చివరికి సర్వే నిర్వహించవద్దనడంలో సహేతుకత లేదని కోర్టు తేల్చింది. స్థానికతను గుర్తిస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటే, దశాబ్దాలుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిష్ఠవేసిన తెలంగాణేతరులు భుజాలు తడుముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ చర్చించేందుకు రెండు రాష్ర్టాలకు గవర్నర్‌గా ఉన్న నరసింహన్ ఆదివారం ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు.

[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,280 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>