Home / Featured Stories / నా కలల తెలంగాణ సిన్మా
tg cinema

నా కలల తెలంగాణ సిన్మా

అంతర్జాతీయ వెండి తెర మీద ఎల్ల కాలం మిరుమిట్లుగొలిపే చిత్రం ‘నా కలల తెలంగాణ సిన్మా’. మన సంతోషం, మన పోరాటం, మన స్పూర్తి, మన కళలు, మన ఆరాటం, మన అందరి కలల ప్రతిబింబమే ‘నా కలల తెలంగాణ సిన్మా’.

ఆ కల సాకారం కావాలంటే ఇప్పుడు మన ముందట ఉన్న అడ్డంకులు ఏంది, వాటిని మనం ఎట్ల ఎదురుకోవచ్చు ? ప్రస్తుతానికి తెలంగాణల ఒక సినిమా తీయాలంటే కావలసిన మానవ వనరులు, సాంకేతిక నైపుణ్యానికి కొదవలేదు, (నటుల అవుసరం ఉన్నది, అయితే సినిమాలు ఆడుడు మొదలు పెడితే ఇంకా ఎక్కువ నటులు తయారైతరు). ఒక ఇరవై, ముప్పై ఏళ్ళ కిందటి తోటి పోలిస్తే ఇప్పుడు సినిమా తీసుడు అంత కష్టమైన పని ఏం కాదు. కింద మీద పడి సినిమా తీసినా ప్రేక్షకుల ముందుకు తీసుకపోవుడే అన్నీటి కన్నా కష్టమైన పని అయింది. సినిమా టాకీసులు డిస్ట్రిబ్యూటర్ల యాజమాన్యంల లేకుంట అయిపోయినయి , ఇల్లును ఒల్లును తాకట్టు పెట్టి మరీ తీసిన సినిమాలు కొన్ని ఏళ్ళు, దశాబ్దాలు అయినా టాకీసులు దొర్కక బోర్లబొక్కల పడుతున్నయి, కనీస ప్రచారానికి నోసుకోలేక పోతున్నయి.

తెలంగాణ ఏర్పడి 12 నెలలు దాటినా ‘తెలంగాణ ఫిలిం చాంబర్’ ను మన ప్రభుత్వం గుర్తించకపోవుడు బాగా ఆలోచన చేయల్సిన విషయం. మనకు ఇప్పుడు కావలసింది ఇంకో రెండు వేల ఎకరాలల్ల ఇంకో కొత్త స్టుడియో కాదు, ఇప్పుడున్న సినిమా వ్యవస్థల కాలుపెట్టనీకి మన దర్శక నిర్మాతలకు, కళాకారులకు ఒక అవకాశం, అనుకూలత కావాలె. ఇప్పుడు అందుబాటుల ఉన్న వనరులను వాడుకోనీకి సానుకూలత కావాలె. ఈ దిశగ పయనం చేయాలంటే మనకు (మన తెలంగాణ ప్రభుత్వానికి) కొన్ని తక్షణ, ధీర్ఘకాలిక లక్ష్యాలని ఏర్పరుచుకొని ఆచరణ దిక్కు అడుగులు ఎయ్యాల్సిన అవసరం ఉన్నది.

తక్షణ లక్ష్యాలు :

 • వర్క్ షాప్‌లు (రచయితలు, నటులు, దర్శకులు): సినీ ప్రపంచంల “కంటెంట్ ఈజ్ కింగ్” అనే ఒక లోకోక్తి ఉన్నది. తెలంగాణల (కళాకారులు, కథా వస్తువులు, రచయితలు) ముడి సరుకు ఏమి తక్కువలేదు, వాళ్ళకు సరైన శిక్షణ కేంద్రాలు / అవకాశాలు మాత్రం లేవు. ఫిలిం స్కూల్లు ఏర్పాటు అయ్యే వరకు రచన, నటన, దర్శకత్వం, నిర్మాణం, ఛాయాగ్రహణం, కూర్పు మొదలైన విషయాల మీద వర్క్ షాప్‌ల ఏర్పాటు ఎంతైనా అవసరం.
 • నిర్మాణం: ఆసక్తి, అవకాశం, నైపుణ్యం, మానవ / సాంకేతిక వనరులు ఉన్నా నిర్మాణ వ్యయం లేక ఊపిరి పోసుకోకముందే ఆరిపోయే కథలు ఎన్నో? కండ్లు తెరువకముందే చెదిరి పోయే కలలు ఎన్నో? తెలంగాణ చిత్ర పరిశ్రమ ఒక కనీస దశకు చేరుకునే దాకా, చిన్న, మధ్యస్థాయి బడ్జెట్ సినిమాల నిర్మాణంల చేయూతనియ్యాలె.
 • ఇన్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్: డిస్ట్రిబ్యూషన్ అనేదే ఏ దేశంల ఏ భాష సినిమా తీసుకున్నా సమస్యగనే ఉన్నది, చిన్న (బడ్జెట్) సినిమాలకు ఇంకా కష్టంగ ఉన్నది. మన తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే మరీ అధ్వానంగ ఉన్నది. ఇప్పుడు ఉన్న (నాలుగు కుటుంబాల గుత్తాధిపత్యాన్ని ఖతం జేసి) టాకీసుల లీజ్ సిస్టంను ఎంబడే రద్దు చేయాలె. అన్ని బడ్జెట్ (చిన్న, పెద్ద) తెలంగాణ సినిమాలు ఆడేటట్టు ఒక పాలసీ రూపకల్పన చేయాలె. మరాఠీ, తమిల్ సినిమాలకు ఆయా రాష్ట్రాలల్ల ఇస్తున్న భద్రత లాంటిది కలుగ చేయాలె. సొమవారం నుంచి బేస్తవారం వరకు రోజుకు కనీసం ఒక్క ఆట, శుక్ర శని ఆదివారం రోజులల్ల కనీసం రెండు ఆటలు ఆడేటట్టు పాలసీలు నిర్ణయించాలె.
 • అతి తొందరగ తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, షార్ట్ ఫిలంలను ప్రోత్సహించి గుర్తించాలే. షార్ట్ ఫిలంలకి అవార్డులు ఏర్పాటు జేయాలె. కొంత ఫండ్ ఇచ్చి చిన్న సినిమాలను ప్రోత్సహించాలే. పర్సంటేజ్ సిస్టం అమలు జేసి ప్రొడ్యూసర్‌లను ఆదు కోవాలె.
 • ఫిలిం ఫెస్టివల్స్: ఫెస్టివల్లు ఏర్పాటు చేస్తే మన సినిమాలు మనం చూసుకునుడు కాకుంట జాతీయ అంతర్జాతీయ సినిమాలను మన ఫిలిం మేకర్లకు పరిచయం చేయొచ్చు, మన సినిమాను ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. నిష్ఠగా చేస్తే అయిదు ఏళ్ళల్ల జాతీయ స్థాయిల నిలిసి పోయే ఫిలిం ఫెస్టివల్‌ను రూపొందించవచ్చు.
 • ఫిలిం కౌన్సిల్: తెలంగాణ ఫిలిం మేకర్లు, జాతీయ స్థాయిల పేరు ఉన్న ఫిలిం మేకర్లతో కూడిన ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి, రాబోయే తరం ఫిలిం మేకర్లకు ఒక దిక్సూచిగ నిలవాలె.
 • అనుసంధానం / నెట్వర్క్: తెలంగాణ ఫిలిం మేకర్లు, జాతీయ అంతర్జాతీయ స్థాయిల పని చేస్తున్న ఫిలిం మేకర్లతో కలుసుకొని చర్చించుకో దగ ఒక వేదిక ఏర్పాటు. దీని వల్ల పరిచయాలు ఏర్పడుడే కాకుంట అనుభవాలను పంచుకునే అవకాశం ఏర్పడుతది.

ధీర్ఘకాలీక లక్ష్యాలు:

 • ఫిలిం స్కూల్లు: సినిమాకు కావలిసిన అన్నీ డిపార్ట్మెంట్‌లల్ల శిక్షణ దొరికేటట్టు, దేశంల ఉన్న అనుభవజ్నులైన సీనీ పండితుల ఆధ్వర్యంల నడిసే ఒకటి రెండు కలాశాలల ఏర్పాటు అత్యవసరం.
 • ఫిలిం ఇంక్యుబేటర్లు: ఫిలిం ఇనిస్టిట్యూట్‌లకు అనుసంధానంగ ఏర్పటు చేసి, అందరి క్రాఫ్ట్‌లను ప్రదర్శించి సినీ రంగంలకు ప్రవేశించాలనుకునేటోల్లకు ఒక వారధిగ పని చేసే సంస్థ ఒకటి ఉండాలె.
 • సబ్సిడిలు: (బంధు ప్రీతి, పక్షపాతాలకు అతీతంగ) ఫిలిం మేకర్లు, నిర్మాతలకు సబ్సిడిల ఇప్పించ్చే ఏర్పాటు. బెంగాలీ మరాఠీ మలయాలం తమిల్ కన్నడ సినిమా రంగాలను పరిశీలన చేసి మన దెగ్గర ఒక పాలిసీ తయారు చేసుకోవచ్చు.
 • ప్రమోషన్: జాతీయ అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ సినిమాలు ప్రమోట్ చేయగల ఏర్పాటు
 • అవుట్ ఆఫ్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్: జాతీయ అంతర్జాతీయ మార్కెట్‌ల తెలంగాణ సినిమాల పంపిణి
 • డివీడి సేల్స్: కేవలం టికెట్ కలెక్షన్‌లకే పరిమితం కాకుంట జాతీయ అంతర్జాతీయ మార్కెట్‌ల డివీడి / వీఓడి (DVD/VOD) హక్కులు అమ్మకాల మీద కేంద్రీకరణ ఉండాలె, దీని వల్ల ఫిలిం మేకర్‌లకు రెసిడ్యుల్ ఇన్‌కం దొరుకుతది.
 • మండల కేంద్రాలల్ల చిన్న థియేటర్‌లు, మొబైల్ థియేటర్‌లు తయారుజేయలె. దీనిని PPP ప్రకారం చేసి కొంతమందికి ఉపాధి నివ్వలే. థియేటర్ టికెట్ బూకింగ్స్ అన్నీ ఆన్‌లైన్ చెయ్యాలే. తెలంగాణల ఉన్న అన్నీ సినిమా థియేటర్‌లకు అవసరమైన సబ్సిడీలు ఇచ్చే యోచన చేయ్యలె.
 • తెలంగణల నిర్మించబడే చిత్రాలకు , తెలంగాణా నటులను , టెక్‌నీషియన్‌లనుని 70% వరకు తీసుకునే పరబాష చిత్రాలకు సబ్సిడీ వర్తింపజేయలె. ఎం జేసినా గవుర్మేంటే జెయాలె, లేదంటే ప్రస్తుతమున్న పెద్ద తలకాయల ముందు తెలంగన చిన్న సిన్మా ఎంత పొర్లాడిన , పోరాడిన దండుగే.

తెలంగాణ కళలకు కలలకు నిలయం, కళాకారులకు ఏ రాష్ట్రానికి తీసిపోదు. తెలంగాణ సిన్మా దేశంలనే ధీటుగ తయారు చేయాలంటె ఇదే సరైన సమయం. మన శక్తి యుక్తులను ఇప్పుడు మనం సరిగ్గ వాడుకోకపోతె తెలంగాణ సిన్మాకు ఇదొక పెద్ద గొడ్డలి పె ట్టు అయితది. నేను ఒక ఫిలిం మేకర్‌ని, ఒక ఆశావాదిని, తొందర్లనే మనం ప్రపంచ సినిమా రంగంల పోటీ పడే సినిమాలను ఇక్కడ నిర్మిస్తం, మన కలలను అందరితోటి పంచుకుంటం. అయితె ఆ రోజు ఈ జీవితకాలంలనే రావలని కోరుకుంటున్న, ఎందుకంటే అరవై ఏళ్ళు తండ్లాడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం, ఏం జేసినా ఇప్పట్లనే చేసుకోవాలె, ఇప్పుడు కాకపోతె ఇంక ఎప్పటికి కాదు.

ఒక మూసల పడి కొట్టుకపోతున్న తెలుగు సినిమాలకు దూరంగ తీసుకపోయె కథలు తెలంగాణల మస్తు ఉన్నయి, ఆ కథలకు ఒక సుక్కాని మనకు తొందరగ దొరుకుతది అని ఆశిస్తున్న.

 

 • జయ ప్రకాశ్ తెలంగాణ

 

( ‘ఫిలిం తెలంగాణ’ ఫిలిం ఫెస్టివల్ ఫౌండర్, ఆయన దర్శకత్వం వహించిన శార్ట్ ఫిలింలు శాడొస్, మూడు కలలు, రాజిగ వొరి రాజిగ, అంతిమేథ్యం, డిస్కనెక్ట్ ; మరిన్ని వివరాలు www.youtube.com/JapesFilms)

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

11,154 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>